తెగిస్తున్న ముగ్గురు ఎంఎల్ఏలు

Fri Mar 31 2023 11:51:46 GMT+0530 (India Standard Time)

YSRCP MLAs Ready For Fight

పార్టీ నుండి సస్పెండ్ అయిన నలుగురు ఎంఎల్ఏల్లో ముగ్గురు పూర్తిగా తెగిస్తున్నట్లే ఉంది. ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో పార్టీ నుండి టీడీపీ అభ్యర్ధికి క్రాస్ ఓటింగ్ చేశారనే కారణంగా ఎంఎల్ఏలు ఆనం రామనారాయణరెడ్డి కోటంరెడ్డి శ్రీధరరెడ్డి మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఉండవల్లి శ్రీదేవిలను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. వీరిలో కోటంరెడ్డి మేకపాటి ఉండవల్లికి పార్టీ నేతలకు గొడవలవుతున్నాయి. దీంతో వీళ్ళ ముగ్గురు కూడా అంతేస్ధాయిలో గొడవలకు తెగిస్తున్నట్లు అర్ధమవుతోంది.



పార్టీ నుండి సస్పెండ్ కాకముందే కోటంరెడ్డి మద్దతుదారులకు పార్టీ నేతలకు మధ్య రెండుసార్లు గొడవలయ్యాయి. రెండుసార్లు కూడా మీరో మేము తేల్చుకుందాం రమ్మంటు ఎంఎల్ఏ సవాళ్ళు విసిరారు. సహజంగానే కోటంరెడ్డి ఆవేశపరుడన్న విషయం తెలిసిందే. దానికి తోడు జగన్మోహన్ రెడ్డికి ద్రోహం చేశారనే ముద్రపడటంతో పార్టీ నేతలు కూడా బాగా రెచ్చిపోతున్నారు. సస్పెండ్ అయిన తర్వాత కూడా ఎంఎల్ఏ మద్దతుదారులకు పార్టీ నేతలకు మధ్య గొడవైంది.

తాజాగా మేకపాటి మద్దతుదారులకు పార్టీ నేతలకు ఉదయగిరి బస్టాండ్ సెంటర్లోనే పెద్ద గొడవైంది. నిజంగా ఎంఎల్ఏ అదృష్టవంతుడు కాబట్టి దాడిని తప్పించుకున్నారు.

బస్టాండ్ సెంటర్లోనే రోడ్డుపై ఎంఎల్ఏ దాదాపు రెండుగంటలు కుర్చీలో కూర్చుని మరీ పార్టీ నేతలను రెచ్చగొట్టారు. పోలీసులు అడ్డుకున్నారు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే గురువారం సాయంత్రం పెద్ద గొడవయ్యేదే. ఇంత జరిగినా ఎంఎల్ఏ ఇంకా పార్టీ నేతలను రెచ్చొగొడుతునే ఉన్నారు.

ఇక ఉండవల్లి విషయం కాస్త డిఫరెంటుగా ఉంది. ఈమె జగన్ను డైరెక్టుగా ఏమీ అనటంలేదు. అయితే స్ధానికంగా ఎంఎల్ఏతో చాలామందికి పడదు. ఎంఎల్ఏ మద్దతుదారులకు బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మద్దతుదారులకు గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ క్రిస్తినా వర్గాయులతో పాటు ఎంఎల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మద్దతుదారులతో ఏమాత్రం పడదు.

అనేక కారణాలతో నందిగం డొక్కా మద్దతుదారులకు ఎంఎల్ఏ వర్గీయులతో గొడవల్లయ్యాయి. సస్పెన్షన్ తర్వాత ఎంఎల్ఏ ఆఫీసుపైన పార్టీలోని కొందరు నేతలు దాడి చేశారు. మూడువర్గాలతో ఎంఎల్ఏకి పడని కారణంగా రెగ్యులర్ గా వివాదాలు పెరిగిపోతున్నాయి. అందుకనే తనకు ప్రాణహాని ఉందని చెప్పి ఎంఎల్ఏ నియోజకవర్గంలోకే రాకుండా బయటెక్కడో కూర్చుని పై నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. చివరకు ఈ గొడవలు ఎక్కడకు దారితీస్తాయో ఏమో.      


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.