Begin typing your search above and press return to search.

ఏం జరగనుంది.. ఒకే వేదికపైకి జగన్, చంద్రబాబు!

By:  Tupaki Desk   |   5 Dec 2022 5:31 AM GMT
ఏం జరగనుంది.. ఒకే వేదికపైకి జగన్, చంద్రబాబు!
X
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఉప్పూనిప్పుగా వ్యవహరిస్తున్నారు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు. కనీసం మర్యాదకు సైతం వీరిద్దరి మధ్య మాటలు చోటు చేసుకోనంతగా ఏపీ రాజకీయాలు మారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీరిద్దరూ ఒకే వేదిక పైకి రానుండటం ఆసక్తికరంగా మారింది.

2011లో జగన్‌ మోహన్‌ రెడ్డి తన రాజకీయ పార్టీని ప్రారంభించిన తర్వాత దాదాపు తొలిసారిగా డిసెంబర్‌ 5న సోమవారం న్యూఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో కలిసి ఒక సమావేశంలో పాల్గొననుండటం ఆసక్తి రేపుతోంది.

జీ-20 దేశాల కూటమికి ప్రస్తుతం భారత్‌ అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ జీ-20 దేశాల కూటమికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ మేరకు ఇటీవల ఆయన ఇండోనేషియా అధ్యక్షుడి నుంచి బాధ్యతలు అందుకున్నారు.

వచ్చే ఏడాది జీ-20 దేశాల సమావేశాలకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఆ సమావేశాల ఎజెండా ఖరారు చేసేందుకు ప్రధాని మోడీ వివిధ పార్టీల అధినేతలతో డిసెంబర్‌ 5న సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రావాలని ఇప్పటికే 30కి పైగా పార్టీల అధినేతలను కేంద్రం ఆహ్వానించింది. వీరిలో జగన్, చంద్రబాబు సైతం ఉన్నారు.

ఇద్దరు నేతలు ఏపీ అసెంబ్లీలో తప్ప కళ్లెదుట కనిపించలేదు. ఆ తర్వాత బడ్జెట్‌ సమావేశాల్లో తన సతీమణిని అవమానించారని చంద్రబాబు నాయుడు అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి అయ్యాకే శాసనసభలో అడుగుపెడతానని చంద్రబాబు భీషణ ప్రతిజ్ఞ చేశారు. దీంతో ఈ ఇద్దరు నేతలు అసెంబ్లీలో కలుసుకోవడం కూడా ఆగిపోయింది.

ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి తమ సత్తా నిరూపించుకోవాలని అటు జగన్, ఇటు చంద్రబాబు భావిస్తున్నారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల పోరుకు శ్రీకారం చుట్టారు. మరోవైపు చంద్రబాబు నాయుడు సైతం అధికారాన్ని దక్కించుకోవడానికి ఇదేం ఖర్మ, బాదుడే బాదుడు వంటి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. నారా లోకేష్‌ సైతం జనవరి నెల చివర నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించే సమావేశానికి చంద్రబాబు, వైఎస్‌ జగన్‌ ఇద్దరూ హాజరు కానున్నారు. కనీసం ఈ అఖిల పక్ష సమావేశంలోనైనా వీరిద్దరి మధ్య మాటలు కలుస్తాయా, లేదా అనేదానిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.

జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రధానితో, బీజేపీ నాయకత్వంతో స్నేహంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు చంద్రబాబు నాయుడు 2018లో బీజేపీ పొత్తు తెంచుకుని ఇప్పుడు మళ్లీ స్నేహం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.