Begin typing your search above and press return to search.

వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ... వితండ వాద‌న‌లు..!

By:  Tupaki Desk   |   22 Oct 2021 11:30 PM GMT
వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ... వితండ వాద‌న‌లు..!
X
ఏపీలో అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో యుద్ధం రగులుతోంది. బ‌హుశా టీడీపీ నేత‌లు కానీ, ఇటు వైసీపీ నాయ‌కులు కానీ.. ఇంత జ‌రుగుతుంద‌ని.. ఊహించి ఉండ‌ర‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గంజాయి సాగు, డ్ర‌గ్స్ ర‌వాణా.. వంటి అంశాల‌ను ప్రాతిప‌దిక‌గా చేసుకున్న టీడీపీ వైసీపీని ఇరుకున పెట్టి.. జాతీయ‌స్థాయిలో చ‌ర్చ‌కు ర‌చ్చ‌కు దారితీయాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇది ఫుల్‌ క్లారిటీగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ప‌ట్టాభి నోరు జారారో.. లేక‌.. ఉద్దేశ పూర్వ‌కంగానే అన్నారో.. మొత్తానికి అసాధార‌ణ వ్యాఖ్యే చేశారు. త‌ద‌నంత‌ర ప‌రిణామాల్లో.. టీడీపీ ఆఫీస్‌పై వైసీపీ నాయ‌కుల దాడులు.. త‌ర్వాత‌.. జ‌రిగిన ఘ‌ట్టాలు.. చివ‌ర‌కు ప‌ట్టాభిని అరెస్టు చేయ‌డం వంటివి రాజ‌కీయ దుమారానికి దారితీశాయి.

ఇక‌, ఈ క్ర‌మంలో ఇరు పార్టీలు కూడా భారీ ఎత్తున ఒక‌రిపై ఒక‌రు దూష‌ణ‌ల ప‌ర్వానికి తెర‌దీశారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ, వైసీపీ ఒక‌పార్టీపై ఒక‌టి... లేవ‌నెత్తిన డిమాండ్ల‌పై ఇప్పుడు మేధావి వ‌ర్గంలోనూ ఆసక్తిక చర్చ సాగుతోంది. టీడీపీ డిమాండ్ ప్ర‌కారం.. రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాలి. ఇటు. వైసీపీ డిమాండ్ ప్ర‌కారం ఏకంగా టీడీపీ గుర్తింపునే ర‌ద్దు చేయాలి. మ‌రి ఈ రెండు డిమాండ్లు సాధ్య‌మేనా ? అనేది ఇప్పుడు ప్ర‌ధాన చ‌ర్చ‌. ముందు అధికార పార్టీ విష‌యానికి వ‌స్తే.. టీడీపీ గుర్తింపును ర‌ద్దు చేయ‌డం. దీనికి హేతుబ‌ద్ధ‌త ఏంటి? అంటే.. కేవ‌లం ఒక అధికార ప్ర‌తినిధి దూషించ‌డం.

అయితే.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఢిల్లీ నుంచి గల్లీ వ‌ర‌కు కూడా పార్టీలు ఒక‌రిపై ఒక‌రు.. నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు దూషించుకుంటున్నారు. అంత‌మాత్రాన పార్టీల‌నే ర‌ద్దు చేస్తే.. దేశంలో ఒక్క పార్టీ కూడా ఉండే ప‌రిస్థితి లేదు. సో.. వైసీపీ డిమాండ్ అసంబ‌ద్ధ‌మే కాకుండా.. ఈ డిమాండ్ చేస్తున్న‌నేత‌ల‌ను అవివేకుల‌నే అంటున్నారు మేధావులు. ఇక‌, టీడీపీ డిమాండ్‌కు వ‌ద్దాం. రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాల‌ని స్వ‌యంగా చంద్ర‌బాబు కోరుతున్నారు. సాక్షాత్తూ.. రాష్ట్ర‌పతి, ప్ర‌ధాని..కేంద్ర హోం మంత్రికి ఆయ‌న 39 పేజీల‌తో కూడిన లేఖ‌ల‌ను స‌మర్పించారు.

అయితే.. ఇక్క‌డే చిన్న విష‌యం ఆసక్తిగా మారింది. మూడు సార్లు ఆయ‌న సీఎంగా ఉన్నారు. 40 ఏళ్లు పాటు రాజ‌కీయాల్లో ఉన్నారు. మ‌రి ఇంత సీనియార్టీ పెట్టుకుని.. ఒక రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టి.. ఆర్టిక‌ల్ 356ను అమ‌లు చేయాలంటే.. ఉండాల్సిన ప‌రిస్థితులు ఆయ‌న‌కు తెలియ‌వా? అనేది మేధావుల మాట‌. ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న‌లు చెల‌రేగి.. గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకుని.. సాక్షాత్తూ.. గ‌వర్న‌రే లేఖ రాస్తే త‌ప్ప‌.. రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టేందుకు అవ‌కాశం లేదే! మ‌రి ఈ విష‌యం తెలిసి కూడా చంద్ర‌బాబు డిమాండ్ చేయ‌డం.. స‌మంజ‌స‌మేనా ? అనేది వీరి ప్ర‌శ్న‌. సో.. ఏతావాతా.. ఈ రెండు పార్టీల‌ డిమాండ్లు..కేవ‌లం మీడియాకు రేటింగ్ కోసం.. ప్ర‌జ‌ల‌కు కాల‌క్షేపం కోసం ప‌నికి వ‌స్తాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.