Begin typing your search above and press return to search.

మీ ఇంటి మనిషినే అనుకోండి... సెంటిమెంట్ పండిస్తున్న వైసీపీ మంత్రి

By:  Tupaki Desk   |   31 March 2023 6:00 AM GMT
మీ ఇంటి మనిషినే అనుకోండి... సెంటిమెంట్ పండిస్తున్న వైసీపీ మంత్రి
X
ఎన్నికల వేడి ముదిరినట్లే ఉంది. అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేల భాష కూడా అలాగే ఉంది. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గానికి చెందిన వైసీపీ మంత్రి బూడి ముత్యాలనాయుడు అయితే చాలా మాట్లాడుతున్నారు. ఆయన గతంలో తక్కువ మాట్లాడతారు అని చెప్పేవారు.

ఎపుడైతే జగన్ పిలిచి పెద్ద పీట వేసి ఉప ముఖ్య మంత్రిని చేశారో నాటి నుంచే ఆయన కాస్తా సందడి చేయడం మొదలెట్టారు. మాడుగులలో మరోసారి వైసీపీ జెండా ఎగరాలని ఆయన గట్టిగా చెబుతున్నారు. అంటే ముచ్చటగా మూడవసారి తానే గెలవాలన్నది మంత్రి గారి ఆశ తాపత్రయం అన్న మాట.

బూడి ముత్యాలనాయుడు 2014, 2019లలో రెండు సార్లు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2024లో సైతం ఆయనే పోటీ చేయబోతున్నారు. ఈసారి ఆయనకు కొంత కష్టమే అని సర్వేలు చెబుతున్నాయి. ఎడ్జి వైసీపీకే ఉంది కానీ టీడీపీ కూడా బాగా పుంజుకుందని అంటున్నారు.

దాంతో బూడి గడప గడపా కలియతిరుగుతున్నారు. తాజాగా ఆయన వైఎస్సార్ ఆసరా పేరిట మహిళల ఖాతాలో నగదు వేసే పధకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాడుగులలో మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ మీ ఇంటి మనిషినే అనుకోండి అని పెద్ద మాటే వాడేశారు. నేను మీ వాడిని, మీ కష్టం చూసిన వాడిని, ఆర్చే వాడిని తీర్చే వాడిని అంటూ చాలానే చెప్పుకొచ్చారు.

మాడుగుల అంటే జగన్ కి చాలా ఇష్టం. నా మీద మీ మీద ప్రత్యేక అభిమానం లేకపోతే పంచాయతీ రాజ్ వంటి కీలకమైన శాఖ జగన్ ఇస్తారా అని ప్రశ్నించారు. నన్ను ఉప ముఖ్యమంత్రిగా జగన్ చేశారు అంటే అది మీ మీద ప్రేమ అని బూడి బాగానే పొగిడేశారు. మాడుగులకు మేలు చేసినది వైసీపీ. తెలుగుదేశం వారు అనేక హామీలు ఇచ్చారు. ఏదీ అమలు చేయలేదు.

చంద్రబాబు పాలన మీకు ఏమైనా కొత్తా ఆలోచించుకోండి. వైసీపీ చెప్పిన మాట ప్రకారం ఎన్నో చేసింది ఇంకా చేస్తోంది అని బూడి చెప్పడం విశేషం. టీడీపీ ఏరు దాటాక తెప్ప తగలేస్తుందని , వైసీపీ మాత్రం అండగా ఉంటుందని బూడి పదే పదే చెప్పారు. మీకు కష్టం వస్తే పలికే ఇంటి మనిషిని నేను అని అన్నారు.

మొత్తానికి చూస్తూంటే ఉప ముఖ్యామంత్రిలో కాసింత కలవరం బయల్దేరినట్లుగా ఉంది. గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిన మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు కాకుండా కొత్త అభ్యర్ధిని టీడీపీ బరిలోకి దించబోతోంది. నిజానికి మాడుగుల టీడీపీకి కంచుకోట లాంటి సీటు. పార్టీ పెట్టిన తరువాత ఆరు సార్లు గెలిచింది. అలాంటి సీట్లో ఇప్పటికి రెండు సార్లు ఓడింది. దాంతో ఈసారి తమ్ముళ్ళు కసి మీద ఉన్నారు.

ఈ నేపధ్యంలో తెలుగుదేశం మాడుగుల సీటుని గెలుచుకోవాలని చూస్తోంది. దాంతో బూడి ముందుగానే సెంటిమెంట్ తో జనాలను ఆకట్టుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఇంటి మనిషిని అంటున్న బూడికి మాడుగుల జనాలు హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తారో లేదో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.