Begin typing your search above and press return to search.

నాలుగు సినిమాలు చేస్తున్న పవన్... ఇంక పాలిటిక్స్ ఏమి చేస్తారు...?

By:  Tupaki Desk   |   29 May 2023 5:00 PM GMT
నాలుగు సినిమాలు చేస్తున్న పవన్... ఇంక  పాలిటిక్స్ ఏమి చేస్తారు...?
X
పవర్ స్టార్ ట్యాగ్ తోనే పవన్ కళ్యాణ్ అభిమానులకు తెగ నచ్చేస్తాడు. ఆయన సినిమా ఒప్పుకుంటేనే ఫ్యాన్స్ లో హుషార్ చెలరేగుతుంది. అలాంటి పవన్ కళ్యాణ్ ఏకంగా నాలుగు సినిమాలు ఏక బిగిన చేస్తున్నారు. దాంతో పవన్ ఫ్యాన్స్ ఆనందం పట్టనలవి కాదు. అదే సమయంలో పవన్ రాజకీయల్లో కూడా ఉన్నారు.

ఆయన జనసేన పార్టీని పెట్టి దశాబ్దం అయింది. ఇప్పటికి రెండు ఎన్నికలను చూసిన పవన్ 2024లో పోటీ చేయాలని తనతో పాటు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలిపించాలని చూస్తున్నారు. అయితే పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. మరి ఆయన ఊపిరి సలపనంత బిజీగా ఉన్నారు.

అలాంటి పవన్ రాజకీయాలు ఏమి చేస్తారు అని అంతా అంటున్నారు. రాజకీయాలు అంటే ఫుల్ టైం జాబ్. దానికి ఇరవై నాలుగు గంటలు కాల్షీట్లు ఇచ్చినా సరిపోదు.జనాల మెప్పు పొందడానికి ఏడున్నర పదుల వయసులో చంద్రబాబు పడరాని కష్టాలు పడుతున్నారు. ఆయన ఎంతో ఓపిక తెచ్చుకుని మరీ రాజకీయాలు చేస్తున్నారు.

ఎక్కడా క్షణ తీరిన లేకుండా జిల్లాల టూర్లు చేస్తున్నారు. ఎండలను సైతం ఆయన తట్టుకుని మరీ ఏపీ అంతా కలియతిరుగుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ రాజకీయంగా చూస్తే యువకుడి కిందనే లెక్క. ఆయన కూడా అంతలా తిరిగి తన పార్టీని జనాలకు చేరువ చేయాల్సి ఉంది కదా అన్న చర్చ సాగుతోంది. పైగా ఎన్నికలకు ఏమంత సమయం కూడా లేదు. పది నెలల వ్యవధిలోకి ఎన్నికలు వచ్చేసాయి.

అధికార పార్టీ వైసీపీ ఏమి చేయాలో చేసుకుంటోంది. ఎలా సర్దుకోవాలో చూసి అలా సర్దుకుంటోంది. మరి జనసేన మాత్రమే ఏమీ కాకుండా అలా ఉండిపోతోంది. దానికి కారణం పవన్ కళ్యాణ్ అని అంతా అంటున్నారు. ఇప్పటికి ఆరేడు నెలల క్రితం వారాహి వాహనాన్ని తయారు చేయించిన పవన్ కళ్యాణ్ మరి దాని అవసరం ఇక రాదనో లేదనో అలా షెడ్ లో పెట్టేసి తాళాలు వేశారని అంటున్నారు.

ఆయన మాత్రం హ్యాపీగా సినిమాలు వరసబెట్టి చేసుకుంటున్నారు. అంటే పవన్ ఉద్దేశ్యం ఎన్నికల వేళ అలా వచ్చి నాలుగు మీటింగ్స్ పెడితే జనాలు ఆదరిస్తారు అనా అన్న డౌట్లు వస్తున్నాయి. అయితే పవన్ పొత్తుల మీదనే ఆశలు పెట్టుకున్నారు అని అంటున్నారు. టీడీపీ నేతలు ఎటూ జనాల్లో ఉన్నారు. యాంటీ వైసీపీ వాతావరణాన్ని వారు తీసుకుని వచ్చారు.

ఇక ఎన్నికలు దగ్గరపడినపుడు తాను కూడా ఒక చేయి వేస్తే 2024 ఎన్నికల యాగం పూర్తి అవుతుంది అని భావిస్తున్నారని అంటున్నారు. అందువల్లనే ఎన్నికలు దగ్గర పడుతున్నా వరసబెట్టి సినిమాలు ఒప్పుకుంటూ అలా చేసుకుంటూ పోతున్నారు అని అంటున్నారు. అయితే దీని వల్ల జనసైనికులు డీ మోరలైజ్ అవుతారని అంటున్నారు. అదే విధంగా రాజకీయాల్లో ఎపుడూ ఎవరినీ నమ్మకూడదు. ఎవరి రాజకీయం వారిదే అన్నట్లుగా ఉండాలి

ఈ రోజున తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అందరి సాయం కోరుతోంది.రేపటి రోజున అదే పార్టీ అధికారంలోకి వస్తే జనసేనను కూడా టార్గెట్ చేస్తుంది అని అంటున్నారు. ఇక సొంత పార్టీని తీర్చిదిద్దుకుని క్యాడర్ ని లీడర్ ని బలంగా నిలబెట్టుకుంటే 2024 తరువాత రాజకీయ పరిణామాలు ఎటు నుంచి ఎటు మారినా జనసేనకు పెద్దగా ఇబ్బంది ఉండదని అంటున్నారు

అయితే పవన్ మాత్రం ఒకే ఒక స్లోగన్ తో ఉన్నారు. అలాగే ఆయన మార్క్ పాలిటిక్స్ ఆయన నేర్చుకున్న పొలిటికల్ మేధమెటిక్స్ అన్నీ కూడా జగన్ని ఏపీలో గద్దె దింపుతాయని అనుకుంటున్నారు. ముందు ఆ పని జరిగితే చాలు ఆనక మన రాజకీయం చూసుకోవచ్చు అని అనుకుంటున్నట్లుగా ఉంది అంటున్నారు. అయితే జగన్ వంటి బలమైన నేతనే గద్దె దించేస్తే చంద్రబాబుకు పవన్ కూడా పెద్దగా ఆనతాడా అన్నదే అసలైన పాయింట్.

మరి బాబుని బాగా నమ్మేసి రాజకీయాన్ని డిప్యూటీ లీడర్ అయిన నాదెండ్ల మనోహర్ కి అప్పగించేసిన పవన్ మాత్రం సినిమాలే చాలు అనుకుంటున్నారు. మరి జనసైనికులకు ఇది ప్రాణ సంకటంగా ఉన్నా పవన్ మీద ఉన్న అభిమానంతో పెదవుల చాటున వ్యధను బాధను అలా దాచుకుంటున్నారు అని అంటున్నారు. మరి పవన్ ఎపుడు మేలుకొంటారో చూడాలని అంటున్నారు.