Begin typing your search above and press return to search.

మంచి కాలం మించిపోతోంది... బస్సు యాత్ర ఎపుడు సేనానీ...?

By:  Tupaki Desk   |   5 Dec 2022 6:30 AM GMT
మంచి కాలం మించిపోతోంది... బస్సు యాత్ర ఎపుడు సేనానీ...?
X
మంచి తరుణం మించిపోతోంది. కాలం ఆగని ప్రవాహం. అది అలా సాగిపోతూనే ఉంటుంది. రాజకీయాలు చేసేవారికి నాయకులకు కాలం ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. కానీ అది పరుగులు తీస్తుంది. దాంతోనే వారు కూడా పరుగులు పెట్టాల్సి ఉంటుంది. ఆ పనిని ఏడున్నర పదుల వయసులో చంద్రబాబు చేస్తున్నారు. ఇక ఆయన తనయుడు నారా లోకేష్ సైతం పాదయాత్ర అంటున్నారు. మరి పవన్ ఎక్కడ. ఆయన బస్సు యాత్ర డేట్ ఎపుడు. ఇదే ఏపీలో రాజకీయాల పట్ల ఆసక్తిని చూపిస్తున్న వారి నుంచి వస్తున్న ప్రశ్న.

నిజానికి ఏపీలో ఎన్నికలకు టైం చాలా తక్కువ ఉంది. కచ్చితంగా ఏణ్ణర్ధం కంటే ఎక్కువ టైం లేదు. ఇక జగన్ కనుక ముందస్తు ఎన్నికలు అని డిసైడ్ అయితే ఆ ఎన్నికలు కాస్తా చాలా ముందుకు తోసుకువస్తాయి. ఈ నేపధ్యంలో ఎన్నికలలో గట్టిగా తేల్చుకోవాలంటే ఎవరైనా జనంలో ఉండాలి. మరి ఏపీలో వచ్చేది మేమే రాబోయే కాలానికి కాబోయే సీఎం మా పవనే అని చెబుతున్న జనసేన ఆ దిశగా అడుగులు వేస్తోందా అన్నదే పెద్ద చర్చగా ఉంది.

పవన్ కళ్యాణ్ తనకు వీలు వెంబడి మాత్రమే ఏపీకి వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. దానిని అధికార వైసీపీ నేతలు వీకెండ్ పాలిటిక్స్ అని ఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్నందువల్ల డోస్ ఏ మాత్రం సరిపోదు పవన్ నిత్యం జనాలలో ఉంటేనే తప్ప కధ రక్తి కట్టదు అని అంటున్నారు. ఒక వైపు జనవరి 27 నుంచి నారా లోకేష్ పాదయాత్ర మొదలెడుతున్నారు. ఎన్నికలు వచ్చేంతవరకూ ఆ పాదయాత్ర సాగుతుంది అని అంటున్నారు.

అలాగే చంద్రబాబు జిల్లాల టూర్లు చేస్తున్నారు. ఆయన కూడా వారంలో మూడు నాలుగు రోజులు జిల్లాలోనే ఉంటున్నారు. మరి విపక్షంలో కీలక పక్షంగా ఉన్న జనసేన కూడా ఆ దిశగా యాక్టివిటీ స్టార్ట్ చేయాలి కదా అన్నదే అందరి మాటగా ఉంది అప్పట్లో అంటే జగన్ విపక్షంలో ఉన్నపుడు రెండేళ్లకు ముందే జనంలో పదయాత్ర కోసం వచ్చేశారు. అది ఆయన పార్టీ విజయానికి కలసివచ్చింది.

ఇపుడు చూస్తే గట్టిగా ఏణ్ణర్ధం కూడా లేదు. ఈ టైం ని సద్వినియోగం చేసుకోవడానికి పవన్ జనంలోకి రావాలని అంటున్నారు. అయితే పవన్ ప్రస్తుతం సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారని అంటున్నారు. ఆయన నటించిన హరిహర వీరమల్లు సినిమా తరువాత సుజీత్, హరీష్ శంకర్ లతో మరో రెండు సినిమాలకు కమిట్ అయినట్లుగా తెలుస్తోంది. దాంతో ఈ ప్రాజెక్టులు అన్నీ పూర్తి అయ్యేసరికి ఎన్నికలు వచ్చేస్తాయా అన్న డౌట్ కొడుతోందిట.

మరి ఏపీలో ఎన్నికలు అత్యంత కీలకం అని చెబుతున్న జనసేనకు పవన్ లాంటి వారు రంగంలోకి దిగకపోతే ఎలా అన్న ప్రశ్న వస్తోంది. బస్సు యాత్ర పవన్ దసరా నుంచే స్టార్ట్ చేస్తారు అని ప్రకటన కొన్నాళ్ళ క్రితం వచ్చింది. అయితే అది కాస్తా పోస్ట్ పోన్ అయింది. ఇపుడు చూస్తే కొత్త ఏడాది వస్తోంది కానీ బస్సు యాత్ర గురించి అప్డేట్స్ లేవు.

మరి బస్సు యాత్ర ఉంటుందా ఉంటే ఎపుడు అన్నది చర్చకు వస్తోంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర అంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతఒంది కానీ నిజంగా ఆ డేట్ ముహూర్తం ఎపుడో జనసేన వారే చెప్పాలి అని అంటున్నారు. ఇంతకంటే మంచి సమయం రాదు, కాబట్టి పవన్ జనంలో ఉండాలని అంతా కోరుకుంటున్నారు. చూడాలి మరి జనసేన నుంచి బస్సు యాత్ర మీద ఏ రకమైన ప్రకటన వస్తుందో.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.