సంక్షేమం మోజులో ఊబిలోకి దిగుతున్న తెలుగు నేల

Sat Jul 24 2021 13:18:50 GMT+0530 (IST)

Welfare Schemes and Telugu Politics

రెండు రియల్ స్టోరీలు ముందు చెప్పుకోవాలి. ఆ తర్వాత విషయంలోకి వెళితే.. చాలా త్వరగా వాస్తవాలు అర్థమవుతాయి. ఇప్పుడు చెప్పే విషయాలు నిప్పులాంటి నిజాల్ని చెప్పటమే ఉద్దేశం. ఎవరి మీద కోపంతోనో.. మరే హిడెన్ ఎజెండా పెట్టుకొని రాస్తున్న అక్షరాలు కావివి.ఇప్పుడు చెప్పే రియల్ ఉదాహరణల్లో ఒకటి అనుకోకుండా జరిగిందైతే.. మరొకటి చేజేతులారా చేసుకున్నది. తెలుగు నేల మీద ఇప్పుడు నడుస్తున్న రాజకీయం ఏ కోవలోకి చెందింనదన్నది నిర్ణయించాల్సిన న్యాయ నిర్ణేతలు మీరే.జర్మనీ.. పేరు విన్నంతనే సంపన్న దేశమే కాదు.. ఆర్థికంగా పటిష్టమైన స్థితిలో ఉండే ఈ దేశంలో ప్రజలు అంతులేని క్రమశిక్షణతో వ్యవహరిస్తుంటారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేని ఈ దేశం.. దాదాపు వందేళ్ల క్రితం (మరింత స్పష్టంగా చెప్పాలంటే 99 సంవత్సరాలు) మొదటి ప్రపంచ యుద్ధం జరిగి.. దారుణమైన ఓటమిని మూటకట్టుకున్న ఆ దేశం తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయింది. దేశ పునర్నిర్మాణానికి భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. అప్పుల్ని చెల్లించటానికి అప్పటి ప్రభుత్వం భారీగా వారి కరెన్సీ నోట్లను పెద్ద ఎత్తున ముద్రించటం షురూ చేశారు. దీంతో జర్మనీ దేశ కరెన్సీ అయిన ‘మార్క్’ దారుణంగా పడిపోయింది.

1923 అక్టోబరు నాటికి జర్మనీ దేశంలో ద్రవ్యోల్బణం నెలకు 29500 శాతానికి చేరుకుంది. ప్రతి మూడు నాలుగు రోజులకు వస్తువుల ధరలు పెరిగేవి. ఆ ఏడాది జనవరిలో 250 మార్కులకు కొన్న బ్రెడ్ ప్యాకెట్.. అదే ఏడాది నవంబరు నాటికి 20వేల కోట్ల మార్కులకు చేరుకుంది. కరెన్సీ విలువ ఎంత దారుణంగా పడిపోయిందంటే.. అప్పట్లో సామాన్ల కొనుగోలుకు సూట్ కేసుల్లో డబ్బులు తీసుకెళ్లేవారు. అప్పటి పరిస్థితి గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. అప్పట్లో ఒక వ్యక్తి సూట్ కేసులో డబ్బులు తీసుకెళ్లి రోడ్డు మీద మర్చిపోయాడు. తర్వాతి రోజు ఆ వ్యక్తి అక్కడకు చేరుకుంటే.. ఆ వ్యక్తి డబ్బుల కట్టలన్ని అలానే ఉన్నాయి. కాకుంటే.. సూట్ కేస్ మాత్రం మాయమైందట. కరెన్సీ విలువ ఎంతలా క్షీణించిందనటానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. అలాంటి ఆ దేశం ఇప్పుడు ఇంత సంపన్న దేశంగా ఎలా మారింది?

ప్రభుత్వం కొత్త కరెన్సీని ప్రవేశ పెట్టటం.. ఆ దేశానికి అప్పిచ్చిన దేశాలు తమ రుణాల్ని రీషెడ్యూల్ చేయటంతో పాటు.. దేశంలోని ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయటమే తప్పించి.. సంక్షేమ పథకాలు ఆచితూచి.. ఎవరికి అవసరమో వారికి మాత్రమే అందేవి.

కట్ చేస్తే.. వెనుజులా. ఆర్థికంగా బలమైన దేశం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేని పరిస్థితి. అయితే.. పాలకులు చేసిన తప్పులకు ప్రజలు దారుణమైన నరకాన్ని చవిచూస్తున్నారు. దాదాపు ఏడేళ్ల క్రితం వరకు ఆ దేశం పరిస్థితి బాగుండేది. ప్రజలకు ఆర్థికపరమైన సమస్యలు ఎంత దారుణంగా ఉంటాయన్న విషయంపై అవగాహనే లేదు. అలాంటిది.. వెనుజులా సోషలిస్టు నేత హ్యూగో చావెజ్ మరణించిన తర్వాత.. ఆయన స్థానంలో 2013లో మడూరో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అతగాడి విధానాలు.. సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్ని ఆకర్షించేందుకు అతడు ప్రకటించిన పథకాలు దేశ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బ తీసింది. దివాళ ఎత్తేసిన పరిస్థితి.

అధికారంలోకి వచ్చిన తర్వాత తన అధికారానికి తిరుగులేకుండా ఉండేందుకు వీలుగా సైనిక దళాలకు ఎప్పటికప్పుడు భారీగా జీతాలు పెంచేసేవారు. తనకు అనుకూలమైన వారికి మాత్రమే కీలక బాధ్యతలు అప్పజెప్పారు. పేదల్ని ఆకర్షించేందుకు నిత్యవసరాల ధరల్ని భారీగా తగ్గించేవారు. దీంతో.. కష్టపడి పని చేసి వ్యవసాయం చేసే రైతులు పంటల్ని పండించటం మానేశారు. ఎందుకంటే.. ఎంత కష్టపడి పంట పండించినా.. వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. దాని కంటే కూడా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల్ని సొంతం చేసుకుంటే చాలన్న మైండ్ సెట్ లోకి ప్రజలు వచ్చేశారు. బండి బాగా నడుస్తున్నంత కాలం ఎలాంటి ఇబ్బంది ఉండదన్న మాటకు తగ్గట్లే.. చమురు ఎగుమతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతున్నంత కాలం మడూరో ఆటలు సాగాయి.

ఎప్పుడైతే అంతర్జాతీయంగా చమురు ధర క్షీణించటంతో వెనుజుల విదేశీ మారకం కొరత ప్రారంభమైంది. చమురు అమ్ముకొని.. ఇతర వస్తువుల్ని దిగుమతి చేసుకోవటంతో పాటు.. ప్రభుత్వ విధానాలతో ఇతర వస్తువుల తయారీ బాగా తగ్గిపోయింది. ఎప్పుడైతే చమురు ధర తగ్గిందో.. దిగుమతులపై ప్రభావం పడింది. సంపాదన తగ్గి.. ఖర్చులు పెరిగితే ఇంటి బడ్జెట్ లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో.. అలాంటి దుస్థితే వెనుజులాకు ఎదురైంది. దీనికి తోడు అవసరమైన ప్రతిసారీ పెద్ద ఎత్తున కరెన్సీని ముద్రించటం మొదలు పెట్టారు పాలకులు. దీంతో ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. మొదట్లో సంక్షేమ పథకాల్ని ఎంజాయ్ చేసిన ప్రజలకు తాము చేసిన తప్పులు అర్థమయ్యాయి. ఒకపూట భోజనానికి కూడా ఇబ్బంది పడే దుస్థితి. విద్యావ్యవస్థ దెబ్బ తినటం.. రోగులకు మందులు దొరకటం కష్టంగా మారటంతో..బతుకు భయంకరంగా మారింది.

పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే.. తమ పిల్లల్ని పోషించే స్థితి లేక.. పిల్లల్ని అమ్ముకునేందుకు సైతం వెనుకాడని దుస్థితి. అధికారం చేతులు మారినా.. సర్వనాశనమైన ఆర్థిక వ్యవస్థ ఎప్పటికి చక్కబడుతుందన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి.

ఈ రెండు ఉదాహరణల్లో పాలకుల తప్పులు ప్రజలకు శాపాలుగా మారాయి. మొదటి ఉదాహరణలో ప్రభుత్వం తప్పు చేసినప్పటికి ప్రజలు కష్టం.. తర్వాతి ప్రభుత్వాలు కమిట్ మెంట్ తో పని చేయటంతో కష్టం నుంచి బయటపడ్డాయి. రెండో ఉదాహరణలో అధికారంలో ఉన్న వారి తప్పులకు తోడు.. వాటిని ఆదరించిన ప్రజలు ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నారు. సంక్షేమ పథకాలు అవసరమే. వాటిని ఎవరూ వ్యతిరేకించరు. కానీ.. అవెలా సాగాలన్న దానిపై పాలకులకు స్పష్టత ఉంటుంది. కానీ.. వాటి వల్ల తమ భవిష్యత్తుకు జరిగే ప్రమాదాన్ని గుర్తించి.. వాటి పట్ల ఆకర్షితులు కాకుండా ఉండాల్సిన బాధ్యత ప్రజలదే.

తెలుగు రాష్ట్రాల్లో కేజీ బియ్యం రూపాయికే లభిస్తోంది. దాని లబ్థిదారుల్లో సగం కంటే ఎక్కువ మంది ఇవాల్టి రోజున లక్షరూపాయిల టూవీలర్ మీద రేషన్ షాపుకు వచ్చి ఆ బియ్యాని తీసుకొని.. బహిరంగ మార్కెట్లో కేజీ రూ.20 వరకు అమ్ముకుంటున్నారు. ఇందుకోసం విలువైన ప్రజాధనాన్ని ప్రభుత్వాలు ఎంత భారీగా ఖర్చు చేస్తున్నాయో తెలిసిందే. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకాన్ని సింఫుల్ గా మూడు ముక్కల్లో చెప్పాలంటే.. ఎంపిక చేసిన దళితులకు రూ.10లక్షల మొత్తాన్ని ఇస్తారట. ఆర్థికంగా ఉన్నత స్థాయికి తెచ్చేందుకు డబ్బుల్ని వెదజల్లే బదులు.. వారికి ఉపాధిని కల్పించటం.. వారికి ఉచితంగా విద్యతో పాటు వైద్య ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుందని చెబితే సరిపోదా? అవసరమైతే వారుండేందుకు ఇంటికి కేటాయించి.. ఇవి తప్పించి మరింకే సంక్షేమ పథకం ఇవ్వమంటే ఇవ్వమని చెబితే ఎలా ఉంటుందో ఆలోచించండి.

కొన్నేళ్ల క్రితం కేసీఆర్ ప్రారంభించిన రైతు బంధు పథకాన్నే తీసుకుంటే.. ఎకరం ఉండే బక్క రైతు నుంచి వందల ఎకరాలు ఉండే భూకామందు వరకు ఈ పథకంలో అందరూ లబ్థిదారులే. చివరకు సంపన్నుడైన ఈటల రాజేందర్ సైతం ఈ పథకానికి లబ్థిదారే. ఆయనలాంటి వారెందరో ఈ పథకం ద్వారా వస్తున్న డబ్బులు ఎవరివి? పన్నుల రూపంలో వసూలు చేసినవే కదా? ఒక మోస్తరు రైతులు.. ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు నగదుతో ఇంటికి అవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువుల్ని భారీగా కొనుగోలు చేశారని.. నగలు చేయించుకున్నారన్న సర్వే రిపోర్టులు ఉన్నాయి.

రైతుబంధు పథకాన్ని నగదు రూపంలో కాకుండా.. పంట పండించేందుకు అవసరమైన విత్తనాలు.. ఎరువులు.. రసాయనక మందులు లాంటివి ఉచితంగా క్రమపద్దతిలో అందిస్తే మేలు జరుగుతుందా? లేక.. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తే లాభం జరుగుతుందా? ఏపీ విషయానికి వస్తే.. ప్రతి వర్గానికి ఒక పథకాన్ని అమలు చేసి.. వారి సంక్షేమం కోసం చేస్తున్న ప్రయత్నాలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇలా ప్రతి ఒక్కరి బ్యాంకు అకౌంట్లో క్రమపద్దతిలో డబ్బులు పడే కన్నా.. వారికి ఉపాధి అవకాశాల్ని కల్పించి.. పని చేయటం ద్వారా సంపదను సృష్టించే పని చేస్తే ప్రయోజనం ఎక్కువగా ఉంటుందన్నది మర్చిపోకూడదు.

తెలుగు ప్రాంతం రెండు ముక్కలై.. రాష్ట్రాలుగా ఏర్పడి అప్పుడే ఏడేళ్లు గడిచిపోయాయి. కొత్త రాష్ట్రాలతో రాష్ట్ర ప్రజలకు జరిగిన మేలు ఏమిటి? భూముల విలువ పెరిగి.. సంపద పెరిగినట్లుగా చెప్పే వారు.. పేదలు ఎందుకు తగ్గట్లేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి. క్యాలెండర్లో ఏడాది గడిచేసరికి.. సంక్షేమం కోసం బడ్జెట్ లో కేటాయిస్తున్న నిధుల ఎంత భారీగా పెరిగిపోతున్నాయన్నది చూస్తున్నాం. అదే సమయంలో.. ఏడాదికేడాదికి రెండు తెలుగు రాష్ట్రాలు చేస్తున్న అప్పులు అంతకంతకూ పెరుగతున్నాయి. అప్పుల మీద ఉన్న వడ్డీలను తీర్చటానికే కిందా మీదా పడుతున్న పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులకు నెలసరి జీతాలు ఇవ్వటానికి సైతం అప్పులు చేసే పరిస్థితి. ఇదంతా చూసినప్పుడు.. సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్ని పాలకులు ఎక్కడికి తీసుకెళుతున్నారు.

ఎనభయ్యో దశకంలో ఎన్టీఆర్ అధికారంలో వచ్చిన వేళలో తెలుగు నేల పరిస్థితి వేరు. అప్పట్లో రాష్ట్ర ప్రజల్లో చాలామంది ఆర్థికంగా వెనుకబాటులో ఉండేవారు. ఈ కారణంతోనే కేజీ బియ్యం రెండు రూపాయిలకు ఇస్తానని ప్రకటించిన ఎన్టీఆర్ పేరు మారుమోగింది. అంతేకాదు.. పేదలకు జనతా వస్త్రాల్ని కూడా ఇచ్చేవారు. కేజీ బియ్యాన్ని రెండు రూపాయిలకు అందించటం మొదలు పెట్టిన సుమారు నలభై ఏళ్ల తర్వాత కేజీ బియ్యాన్ని రూపాయికే ఇవ్వటంలో అర్థమేమిటి? ఇంకా ఆ పథకాన్ని మనమెందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. దానికి బదులుగా ప్రతి ఒక్కరికి కార్పొరేట్ తరహాలో ఉచిత విద్యను అందించటంతో పాటు.. కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తే మేలు కదా?

సంక్షేమ పథకాల్ని అంతకంతకూ పెంచుకుపోవటం ద్వారా.. ప్రజల్లో పని చేసే తత్త్వాన్ని చంపేస్తున్నామన్న విషయాన్ని పాలకులు మర్చిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాల్ని చూసినప్పుడు.. కష్టపడి నెలకు రూ.15 నుంచి రూ.25 వేల జీతానికి రెక్కలు ముక్కలు చేసుకునే వాడికి డబుల్ బెడ్రూం ఇల్లు రాదు. కానీ.. పని ఏమీ చేయని పేదలకు మాత్రం డబుల్ బెడ్రూం ఇంటిని ఇస్తానని చెప్పటం దేనికి సంకేతం?  చిరు ఉద్యోగం చేస్తూనే ఆదాయపన్నును కట్టే దిగువ మధ్యతరగతి జీవులు చాలామంది తాము పేదవాళ్లమని చెప్పటానికి మొహమాటపడి.. దారుణమైన పేదరికాన్ని అనుభవిస్తున్న పరిస్థితి.

అలాంటి వారు నిత్యం లీటరు పెట్రోల్ మీద దాదాపు రూ.70లకు పైనే పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తోంది. అనవసర సంక్షేమ పథకాలకు చెక్ చెప్పి.. ధరల పెరుగుదలకు కళ్లాలు వేసి.. పన్ను బాదుడుకు పుల్ స్టాప్ పెట్టటం మానేసి.. పన్నుల్ని పెంచేస్తూ.. సంక్షేమ పథకాల్ని పొడిగించుకుంటూ పోతే.. పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందన్న సత్యాన్నిపాలకులు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. అధికారం కోసం.. ఓటు బ్యాంకురాజకీయాల కోసం పాలకులు ఆడుతున్న ఆట..నిప్పుతో కాడు ఆర్థిక సంక్షోభం అనే బడబాగ్నితో అన్న విషయాన్ని మర్చిపోకూడదు.

అప్పుల ఊబిలోకి తెలుగు నేలను కూరుకునేలా చేయటం కంటే కూడా.. దాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన అధినేతల్ని భావితరాలు నెత్తిన పెట్టుకొని పూజిస్తాయన్నది వాస్తవం. ఈ విషయంలో ఏ మాత్రం తప్పు చేసినా.. తర్వాతి తరానికి తిప్పలు తప్పవు. పాలకులు తప్పులు చేస్తారన్నది అబద్ధం. వారి చేత ఆ పనులు చేయించేది ప్రజలే. ఈ సత్యాన్ని గుర్తిస్తే.. సమస్య నుంచి బయటపడే దారి లభిస్తుంది. లేదంటే.. తెలుగు నేలకు తిప్పలు తప్పవు.