టీడీపీకి ఇన్ని నియోజకవర్గాల్లో ఇన్‌చార్జుల కొరత ఉందా?

Wed Aug 17 2022 22:00:01 GMT+0530 (IST)

Update News Onn TDP Politics

వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు పన్నుతోంది. మే 28 29 తేదీల్లో నిర్వహించిన టీడీపీ మహానాడు అంచనాలకు మించి విజయవంతం కావడం ఆ తర్వాత చేపట్టిన బాదుడే బాదుడు మినీ మహానాడు కార్యక్రమాలు కూడా సక్సెస్ కావడంతో టీడీపీ కొత్త ఉత్సాహంతో తొణికసలాడుతోందని పరిశీలకులు చెబుతున్నారు.అయితే ఏపీలో ఉన్న మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 75 చోట్ల టీడీపీకి ఇన్‌చార్జులు లేరని తెలుస్తోంది. ఇటీవల కార్యకర్తలతో మాట్లాడుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా ఇదే విషయాన్ని చెప్పారని అంటున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన కొందరు రాజకీయాల నుంచి తప్పుకుని వ్యాపారాలకు పరిమితమైపోయారు. మరికొన్ని చోట్ల వైఎస్సార్సీపీలో చేరిపోయారు. మరికొంతమంది బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లోనూ వల్లభనేని వంశీమోహన్ (గన్నవరం) వాసుపల్లి గణేశ్ కుమార్ (విశాఖ సౌత్) మద్దాలి గిరి (గుంటూరు పశ్చిమ) కరణం బలరాం (చీరాల) వంటివారు వైఎస్సార్సీపీతో అంటకాగుతున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇన్‌చార్జులు క్రియాశీలకంగా లేరని అంటున్నారు. ఇలా మొత్తం మీద 75 నియోజకవర్గాల్లో టీడీపీకి ఇన్‌చార్జుల కొరత ఉందని పరిశీలకులు అంటున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న టీడీపీ ఈ 75 నియోజకవర్గాలపై ముందు దృష్టి సారించాలని చెబుతున్నారు. టీడీపీలో ఉన్న ఈ సమస్యను గుర్తించే ఏపీ ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధిస్తామని చెబుతున్నారని అంటున్నారు.

ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమ (ప్రకాశం నెల్లూరు కడప కర్నూలు అనంతపురం చిత్తూరు) జిల్లాల్లోనే టీడీపీకి నియోజకవర్గాల ఇన్‌చార్జుల కొరత ఉందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా మినహాయించి మిగిలిన అన్ని జిల్లాల్లో టీడీపీ చావుదెబ్బ తిందని గుర్తు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అత్యంత బలంగా ఉంది కూడా గ్రేటర్ రాయలసీమ జిల్లాల్లోనే అని పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో ఇన్‌చార్జులు లేని 75 నియోజకవర్గాల మీద దృష్టి సారించకపోతే టీడీపీకి వచ్చే ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బ తప్పదని పరిశీలకులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆగస్టు 17న కొన్ని నియోజకవర్గాల ఇన్చార్జ్‌లతో భేటీ కానున్నారు. అవనిగడ్డ పెనమలూరు మార్కాపురం సంతనుతలపాడు గుంటూరు తూర్పు నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జులతో సమావేశం కానున్నారు. ఆయా నియోజకవర్గాలలో స్థానిక పరిస్థితులు రాజకీయ పరిణామాలు పార్టీ కార్యక్రమాలపై నేతలతో సమీక్షించనున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.