Begin typing your search above and press return to search.

'కృష్'.. కృష్ణా.. ఏమిటీ ఎంపిక‌.. వైసీపీలో నేత‌ల గుర్రు!!

By:  Tupaki Desk   |   18 May 2022 4:28 AM GMT
కృష్.. కృష్ణా.. ఏమిటీ ఎంపిక‌.. వైసీపీలో నేత‌ల గుర్రు!!
X
ఆయ‌న‌ను అంద‌రూ మ‌రిచిపోయారు. అంతేకాదు.. ఆయ‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. ఆయ‌నే మాజీ ఎమ్మెల్యే.. బీసీ సంఘం నాయ‌కుడు.. ఆర్‌. కృష్ణ‌య్య‌. అయితే.. అంద‌రూ మ‌రిచిపోయిన ఈయ‌న‌కు ఇప్పుడు వైసీపీ పెద్ద‌పీట వేసింది.ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్.. పిలిచి మ‌రీ పిల్ల‌ను ఇచ్చిన‌ట్టు.. పార్టీలో ఎంతో కాలం నుంచి సేవ చేస్తున్న‌వారు త‌మ‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని.. ప్రాధేయ ప‌డుతున్నా .. వారిని ప‌క్క‌న పెట్టిమ‌రీ.. ఆర్ కృష్ణ‌య్య‌ను పెద్ద‌ల స‌భ‌.. రాజ్య‌స‌భ‌కు ఎంపిక చేశారు. దీనిపై సొంత పార్టీలోనూ.. అటు బీసీల్లోనూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీని వ‌ల్ల సాధించేది ఏంట‌ని నిల‌దీత‌లు కూడా ఎదుర‌వుతు న్నాయి.

ఏ ఎండ‌కు ఆ గొడుగు!ఆర్‌. కృష్ణ‌య్య గురించి తెలిసిన వారు చాలా మంది ఆయ‌న ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌డ‌తార‌ని విమ‌ర్శిస్తుంటారు. ఆయ‌న వ‌ల్ల ఒక్క బీసీ సామాజిక వ‌ర్గం అయినా.. సుఖం గా ఉందా అనే ప్ర‌శ్న‌లు కూడా ఉన్నాయి. ఇక‌, పార్టీల ప‌రంగా చూసుకుంటే.. వైఎస్ ఉన్న‌ప్పుడు.. ఆయ‌న‌కు లోపాయికారీగా స‌హ‌క‌రించి.. చెక్కులు అందుకున్నార‌ని.. కాంగ్రెస్ నేత‌లే చాలా సార్లు విమ‌ర్శించారు. అయితే.. ఎవ‌రు అధికారంలో ఉంటే వారికి ఆయ‌న అనుకూల‌మ‌నే పేరు కూడా ఉంది. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. 2014లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇదే ఆర్.కృష్ణయ్యను చంద్రబాబు ప్రకటించారు.

ఆదిలాబాద్‌లో జరిగిన టీడీపీ ఎన్నికల బహిరంగ సభ సాక్షిగా కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా బాబు ప్రకటించారు. టీడీపీకి ఎంతో మద్దతుగా నిలిచే బీసీలు కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఏకపక్షంగా టీడీపీకి ఓట్లు వేస్తారనే వ్యూహంలో భాగంగా తెలుగుదేశం ఈ ప్రయత్నం చేసింది.

కానీ.. ఆ ఎన్నికల్లో టీడీపీకి కేవలం 12 సీట్లు మాత్రమే దక్కాయి. దీంతో కృష్ణ‌య్య ప్ర‌భావం ఏమీ క‌నిపించ‌కుండా పోయింది. అంటే.. కృష్ణ‌య్య ఏ విధంగానూ.. ఉప‌యోగ‌ప‌డ‌ర‌నే ముద్ర స్థిర‌ప‌డిపోయింది.

వైసీపీ నేత‌ల ఫైర్‌..''పార్టీలో ఎప్ప‌టి నుంచో ఉన్నాం. జెండా మోసాం.. పాద‌యాత్ర‌లు చేశాం.. జ‌గ‌న్ కోసం.. గ‌తంలో అనేక విమ‌ర్శ‌లు, అవ‌మా నాలు కూడా ఎదుర్కొన్నాం. మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వ‌మ‌ని అడిగితే ఇవ్వ‌డం లేదు. ఏం చేశార‌ని.. 'ఆయ‌న‌కు' 'పెద్ద‌' పీట వేశారు? '' అని ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ఓ సీనియ‌ర్ వైసీపీ నాయ‌కుడు.. ఆఫ్ ది రికార్డుగా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇదే మాట చాలా మంది అంటున్నారు. అయితే.. జ‌గ‌న్‌కు భ‌య‌ప‌డో.. లేక‌.. మ‌రే కార‌ణంతోనో.. బ‌య‌ట‌కు మాత్రం రావ‌డం లేదు. ''మంత్రి వ‌ర్గంలో అన్యాయం.. పెద్ద ప‌ద‌వుల్లోనూ.. అన్యాయం. మాకు జ‌రుగుతున్న అన్యాయం ఎవ‌రికీ జ‌ర‌గ‌డం లేదు'' అని సీమ‌కు చెందిన మ‌హిళా బీసీ నాయ‌కురాలు.. ఒకావిడ వాపోయారు.

బీసీల విష‌యంలో.. జ‌గ‌న్ జ‌డుపువాస్త‌వానికి మంత్రివర్గంలో బీసీలను తీసుకున్నామని, బీసీ కార్పొరేషన్ పదవులను పెద్ద ఎత్తున ఇచ్చామని చెప్పుకుంటున్నారు సీఎం జ‌గ‌న్‌. అలాంట‌ప్పుడు.. పార్టీ జెండా మోయ‌ని.. పార్టీతో సంబంధం లేని.. 2014లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన కృష్ణ‌య్య‌ను తెచ్చి.. ఇక్క‌డ రాజ్య‌స‌భ సీటు ఇవ్వ‌డం ఎందుకు? పోనీ.. బీసీల కోసం త్యాగ‌మే చేశార‌ని అనుకున్నా.. వైసీపీలోనే చాలా మంది బీసీ నాయ‌కులు.. ప్ర‌జాబ‌లం ఉన్న నేత‌లు ఉన్నారు క‌దా! వారిని వ‌దిలేసి.. ఎక్క‌డో ఉన్న‌వారిని వెతికి తీసుకురావ‌డం అంటే.. ఆయ‌న‌లో బీసీల విష‌యంపై జ‌డుపు ఉంద‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి.