Begin typing your search above and press return to search.

మూడేళ్ళ జగన్ : కలర్ ఫుల్ బుక్... జస్ట్ లుక్

By:  Tupaki Desk   |   15 May 2022 1:30 AM GMT
మూడేళ్ళ జగన్ : కలర్ ఫుల్  బుక్... జస్ట్ లుక్
X
ఈ రోజుకు జగన్ మూడేళ్ల సీఎం. నిజానికి జగన్ సీఎం ఈ రెండు పదాలకూ ఆకాశానికీ భూమికీ ఉన్నంత దూరం ఉందని ప్రత్యర్ధులు అనుకున్నారు. ఆ రెండూ ఎప్పటికీ కలవవు కాబట్టి జగన్ కూడా ముఖ్యమంత్రి అనిపించుకోలేరు అని భావించేవారు. గత శాసనసభలో అయితే ఈ జన్మలో జగన్ సీఎం కాలేడు అని సీనియర్ మంత్రులు యనమల వంటి వారు ఒకటికి పదిసార్లు హాట్ హాట్ కామెంట్స్ చేసేవారు.

ఇక వైసీపీలో అయితే జగన్ సీఎం కావాలని అందరికీ ఉంది. కానీ అవుతారా. చంద్రబాబు వంటి రాజకీయ గండర గండడు అవతల ఉండగా అది అయ్యే పనేలా అని ఎన్నో సందేహాలు. ఇక వైసీపీలో కూడా జరిగితే అద్భుతమే అన్న మాట ఉండేది. అయితే జగన్ పాదయాత్రతో కొంత పిక్చర్ వచ్చింది. ఇక దాని తరువాత జనం మూడ్ తెలిసినా ఎన్నికల్లో చంద్రబాబు మార్క్ పోల్ మేనేజ్మెంట్ తో వైసీపీకి గెలుపు చివరిదాకా వచ్చినా పవర్ దక్కడం కష్టమనే అనుకున్నారు.

చిత్రంగా వైసీపీ 151 సీట్లతో అద్భుతమైన మెజారిటీని సాధించి అధికారంలోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అది కూడా వైసీపీ వాళ్ళు కూడా తన చేయిని తామే గిల్లుకుని నిజం అనుకునేటంతగా. ఇక సీఎం గా జగన్ తొలి ఏడాది సగంలో ఉండగానే కరోనా మహమ్మారి వచ్చి పడింది. ఇలా అయితే ఎలా అని వైసీపీలో పెద్ద నాయకులే అనుకున్నారు. కానీ వరసగా రెండేళ్ల పాటు కరోనా తో ఏపీ ఇబ్బందులు పడ్డా జగన్ నెట్టుకువచ్చారు.

మొత్తానికి తొలి రెండేళ్లు జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మే నెలలో సంబరాలు ఏవీ జరగలేదు, ఈ ఏడాది మాత్రం వాటికి మొత్తం సిద్ధమైంది. ఇక గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ఒక కార్యక్రమాన్ని వైసీపీ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల చేత వైసీపీ ఏం చేసింది అని చెప్పేందుకు కరపత్రాలు అన్నీ రెడీ చేసి ఇస్తున్నారు.

ఇపుడు మల్టీ కలర్ తో పదహారు పేజీల బుక్ లెట్ కూడా మూడు సంవత్సరాల పాలనపై ఏపీ ప్రభుత్వం వెలువరించింది. ఈ బుక్ లెట్ ఇపుడు పంపిణీ చేస్తున్నారు. ఈ బుక్ లెట్ లో జగన్ మూడేళ్ల పాలన మీదనే ఫోటోలు వేసి పధకాలు పక్కన వివరిస్తూ ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 129 హామీలు ఇచ్చామాని, అందులో 123 తీర్చి 95 శాతం మార్కులు తెచ్చుకున్నామని వైసీపీ చెబుతోంది.

అలాగే సామాజిక విప్లవాన్ని సాధించి బీసీలు, దళితులు, అణగారిన వర్గాలకు పదవులు ఇచ్చినట్లుగా చెప్పుకున్నారు. అలాగే 26 జిల్లాలు చేశామని, అదే విధంగా పరిపాలన వికేంద్రీకరణ తమ విధానం కాబట్టి గ్రామ వార్డు సచివాలయాల నుంచి పాలన రాష్ట్ర సచివాలయం దాకా తీసుకెళ్తున్నామని కూడా పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆర్ధిక పరిస్థితి బాగులేకపోయినా పీయార్సీ సహా చాలా మేళ్ళు చేశామని పేర్కొన్నారు.

మొత్తానికి ఇచ్చినవి, ఇవ్వనివీ అన్నీ చేశామని వైసీపీ సర్కార్ ఈ బుక్ లెట్ ద్వారా జనాలకు చెబుతోంది. మరి ఈ బుక్ లెట్ చూస్తే వైసీపీ పాలన సూపర్ సక్సెస్ అనే అనుకోవాలి. మరి ఇన్నేసి స్కీమ్స్, ఇన్ని లక్షల కోట్లు సంక్షేమానికి ఖర్చు చేయడం ద్వారా వైసీపీ ఏలుబడి సూపర్ హిట్ అని కూడా భావించాలి. కానీ జనాల్లో ఆ సంతృప్తి ఉందా. వారు జై వైసీపీ, జై జగన్ అంటున్నారా. చూడాలి మరి జనాల స్పందనకూ పాలకుల సక్సెస్ కి ఎపుడూ చాలా పెద్ద అంతరం ఉంటుంది. అందుకే ఎన్నికలు ఎపుడూ చిత్రంగా ఉంటాయి. తీర్పులు కూడా అలాగే ఆసక్తికరంగా ఉంటాయి.