Begin typing your search above and press return to search.

పవన్, బాబులకు సమస్యగా ఆ నియోజకవర్గం!

By:  Tupaki Desk   |   27 Jan 2023 6:00 PM GMT
పవన్, బాబులకు సమస్యగా ఆ నియోజకవర్గం!
X
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీల మధ్య పొత్తు కుదురుతుందనే ఎక్కువమంది నమ్ముతున్నారు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఎన్నికల నాటికి పొత్తులు ఖాయమనే విశ్వసిస్తున్నారు. అందులోనూ అటు జనసేనాని పవన్‌ కల్యాణ్, ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొడవడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలో ఉభయ గోదావరి జిల్లాల్లో సీట్ల సర్దుబాటు జనసేన, టీడీపీలకు సమస్యగా మారిందని అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రాబల్యం గతంలో పోల్చితే ఈసారి అధికంగా ఉందనే అంచనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల సర్దుబాటు రెండు పార్టీల అధినేతలకు సమస్యగా మారిందని అంటున్నారు.

ఈ క్రమంలో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గం అటు పవన్, ఇటు చంద్రబాబులకు సమస్యగా మారిందని అంటున్నారు. ప్రస్తుతం రాజమండ్రి రూరల్‌ నుంచి టీడీపీ తరఫున గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. రాజమండ్రి, రాజమండ్రి రూరల్‌ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో వైసీపీ సునామీని తట్టుకుని మరీ గెలిచారు.

మరోవైపు రాజమండ్రి రూరల్‌ లోనే జనసేన తరఫున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ ఉన్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి దుర్గేష్‌ ఎమ్మెల్సీగా ఉన్నారు. జనసేన పార్టీలో ఉన్న ముఖ్య నేతల్లో, గెలవగలిగే నేతగా దుర్గేష్‌ కు పేరుంది. గత ఎన్నికల్లో దుర్గేష్‌ దాదాపు 43 వేల ఓట్లు సాధించారు.

అయితే వైసీపీ (ఆకుల వీర్రాజు), జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్థులు కాపు సామాజికవర్గానికి చెందినవారు కావడంతో నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న కాపుల ఓట్లు చీలిపోయాయి. ఇది అంతిమంగా కమ్మ సామాజికవర్గానికి చెందిన టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి లాభం చేకూర్చింది.

అయితే ఈసారి కూడా పొత్తు కుదరకపోతే ఈ పార్టీల నుంచి వీరే పోటీ చేసే అవకాశం ఉంది. వైసీపీ మాత్రం ఈసారి బీసీ అభ్యర్థి చందన నాగేశ్వరరావుకు సీటు ఇవ్వచ్చని చెబుతున్నారు.

టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే ఈ సీటు తమకంటే తమకని కందుల దుర్గేష్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి భావిస్తున్నారని తెలుస్తోంది. గోరంట్ల సీనియర్, అందులోనూ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కావడం, 2014లోనూ గెలుపొంది ఉండటంతో చంద్రబాబు ఆయనను మార్చలేని పరిస్థితి ఉందని అంటున్నారు. పోనీ రాజమండ్రి సిటీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవానీని తప్పించి గోరంట్లకు సీటు కేటాయిస్తే బీసీ అభ్యర్థిని తప్పించి తన సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి సీటు ఇచ్చారనే అపప్రథ వస్తుందనే ఆందోళనలో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు.

అందులోనూ ఆదిరెడ్డి భవానీ దివంగత కేంద్ర మంత్రి ఎర్రం నాయుడు కుమార్తె కావడం, ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆమెకు బాబాయి కావడం, శ్రీకాకుళం టీడీపీ ఎంపీగా భవానీ సోదరుడు రామ్మోహన్‌ నాయుడు ఎంపీగా ఉండటం ఇలా పలు కారణాలతో ఆమెను తప్పించలేని పరిస్థితి చంద్రబాబుకు ఉందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో కందుల దుర్గేష్‌ ను రాజమండ్రిని ఆనుకునే ఉన్న రాజానగరం నుంచి పోటీ చేయాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారని టాక్‌ నడుస్తోంది. అయితే అందుకు కందుల దుర్గేష్‌ సైతం నిరాకరిస్తున్నట్టు చెబుతున్నారు. ఈసారి పొత్తు కుదిరినా, కుదరకపోయినా జనసేన ఈ నియోజకవర్గంలో గెలుస్తుందనే అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దుర్గేష్‌ రాజమండ్రి రూరల్‌ వదిలి రాజానగరం వెళ్లడానికి ససేమిరా అంటున్నారని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.