Begin typing your search above and press return to search.

జూనియర్ పై పెరిగిపోతున్న వివాదం

By:  Tupaki Desk   |   27 Nov 2021 7:25 AM GMT
జూనియర్ పై పెరిగిపోతున్న వివాదం
X
అసలు కన్నా కొసరే ఎక్కువన్నట్లుగా తయారైంది టీడీపీలో పరిస్ధితులు. భువనేశ్వరిని అడ్డుపెట్టుకుని జూనియర్ ఎన్టీయార్ కు వ్యతిరేకంగా కొందరు తమ్ముళ్ళు రెచ్చిపోతున్నారు. నిజానికి వీళ్ళు రెచ్చిపోవటంలో లాజిక్కే లేదు. ఎందుకంటే తన భార్యను, తల్లిని మంత్రి కొడాలి నాని, ఎంఎల్ఏ వంశీ అంతేసి మాటలంటే చంద్రబాబునాయుడు, లోకేషే వాళ్లపై స్పందించాల్సినంత తీవ్రంగా స్పందించలేదు అంటున్నారు. అలాంటిది మేనత్తను అంటే జూనియర్ ఎన్టీయార్ స్పందించాల్సిన అవసరం ఏమిటంటు జూనియర్ అభిమానులు గట్టిగానే తమ్ముళ్ళను తగులుకుంటున్నారు.

సరే వీళ్ళ గోల ఎలాగున్నా జూనియర్ ను డీ గ్రేడ్ చేయటానికి పార్టీలో వ్యూహం మొదలైందంటున్నారు. కొందరేమో పార్టీ భవిష్యత్తు కోసం జూనియర్ ను పార్టీలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తుంటే మరికొందరేమో భువనేశ్వరి గొడవను అడ్డుపెట్టుకుని జూనియర్ ను ఎగతాళి చేస్తున్నారు. పార్టీకి మంచి జరగాలంటే జూనియర్ ను వెంటనే తీసుకురావాలని రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ, సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి బహిరంగంగానే సూచించిన విషయం తెలిసిందే.

అప్పట్లో జూనియర్ విషయంలో బుచ్చయ్య సూచనను ఎవరు బహిరంగంగా వ్యతిరేకించలేదు. అయితే ఇపుడు హఠాత్తుగా భువనేశ్వరి వివాదాన్ని అడ్డం పెట్టుకుని జూనియర్ ను బుద్ధా వెంకన్న, వర్ల రామయ్య, నాగుల్ మీరా, బోండా ఉమ లాంటి వాళ్ళు బహిరంగంగానే అవహేళన చేస్తున్నారు. అంటే పై తమ్ముళ్ళ ఉద్దేశ్యంలో భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని జూనియర్ కూడా అమ్మనాబూతులు తిట్టాలని కాబోలు. ఇదే సమయంలో చంద్రబాబుకు జూనియర్ మద్దతు ప్రకటిస్తారని అనుకున్నట్లున్నార.

కానీ జూనియర్ వీడియోలో ఘటనను తప్పుపట్టారు కానీ ఏ ఒక్కరినీ ప్రత్యేకంగా పేరుపెట్టి మాట్లాడలేదు. జూనియర్ స్పందన తాము అనుకున్నట్లు లేకపోవటంతో తమ అక్కసంతా ఇపుడు తీర్చుకుంటున్నారు. దాంతో పార్టీలోనే జూనియర్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు అర్ధమవుతోంది. జూనియర్ ను ఎలాగైనా పార్టీకి పనిచేయించేట్లు చేయాలని అనుకునే బుచ్చయ్య లాంటివాళ్ళు జూనియర్ గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు.

ఇదే సమయంలో కొందరు తమ్ముళ్ళ తాజా అవహేళనలు చూస్తుంటే జూనియర్ ను పార్టీకి దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది. పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తుంటే భువనేశ్వరి వివాదం మూలనపడిపోయి జూనియర్ వివాదమే పెద్దదయ్యేట్లుంది. లేకపోతే భువనేశ్వరి వివాదంలో ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు స్పందిస్తున్నారు. అంతేకానీ తమ్ముళ్ళు ఆశించినట్లు స్పందించాల్సిన అవసరం ఎవరికీ లేదు. అసలు విషయాన్ని పక్కకుపెట్టి కొసరు విషయమైన జూనియర్ స్పందనను తమ్ముళ్ళు బూతద్దంలో చూస్తున్నారు.