Begin typing your search above and press return to search.

మీరు స్పీకర్ తమ్మినేని: 'కమాండోలను తీసేస్తే చంద్రబాబు ఫినిష్'

By:  Tupaki Desk   |   30 May 2023 11:00 AM GMT
మీరు స్పీకర్ తమ్మినేని: కమాండోలను తీసేస్తే చంద్రబాబు ఫినిష్
X
ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరిస్తున్న తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడకు భద్రతా ఉన్న బ్లాక్ క్యాట్ కమాండోలను తీసివేస్తే ఫినిష్ అయిపోతారని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు పెను దుమారంగా మారాయి.

బ్లాక్ క్యాట్ కమాండోలు ఉన్నారన్న ధైర్యంతో ఆయన మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. సభాపతి స్థానంలో ఉన్న తమ్మినేని.. విపక్ష నేతను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? అన్నది ఇప్పుడు చర్చగా మారింది.

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవసల పట్టణంలో వైసీపీ శ్రేణులతో కలిసి ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎవరిని ఉద్దరించటానికి ఆయనకు బ్లాక్ క్యాట్ కమాండోస్ భద్రత? రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా ఈ భద్రతను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తాను? జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రతకు ఆయన ఏ విధంగా అర్హులు? దేశంలో చాలామందికి హెచ్చరికలు.. ముప్పు పొంచి ఉందని.. వారందరికి ఈ స్థాయి భద్రత కల్పిస్తారా? అని ప్రశ్నించారు.

ఓవైపు బ్లాక్ క్యాట్ కమాండోలను తీసేస్తే ఫినిష్ అవుతారని చెబుతూనే.. మరోవైపు చంద్రబాబుకు బ్లాక్ క్యాట్ కమాండోల భద్రతను తీసేయాలని స్పీకర్ స్థాయిలో తాను కేంద్రానికి సిఫార్సు చేస్తానని చెప్పిన తమ్మినేని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజకీయాల్లో శత్రుత్వం ఉండటం మామూలే అయినా.. మరీ ఈస్థాయిలో ఉండటం విస్మయానికి గురిచేస్తుంది. అందునా.. అసెంబ్లీకి సభాపతిగా వ్యవహరించే నేత నోటి నుంచి ఈ తరహా మాటలు సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రజాప్రతినిధులే అయినప్పటికీ.. స్పీకర్ లాంటి స్థానంలో కూర్చున్న వారు మిగిలిన పొలిటిషియన్లకు కాస్త భిన్నంగా వ్యవహరిస్తారు.రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నందున.. మిగిలిన ఎమ్మెల్యేల మాదిరి.. ఎంపీల మాదిరి వారు వ్యవహరించలేరు.

అసెంబ్లీ.. లోక్ సభల్లో స్పీకర్ గా వ్యవహరించే వారు.. తాము మిగిలిన ఎమ్మెల్యేలు.. ఎంపీలుగా ఎన్నికల్లో విజయం సాధించినా.. స్పీకర్ పదవికి ఉండే ప్రత్యేకతను గుర్తించి.. అందుకు తగ్గట్లుగా మలుచుకుంటారు.

ఈ క్రమంలో రాజకీయంగా వారు నష్టపోవటం కనిపిస్తుంటుంది. అయినప్పటికీ.. స్పీకర్ పదవికి ఉండే ప్రత్యేక గౌరవ మర్యాదలతో తమను తాము రాజకీయంగా పరిమితం చేసుకోవటం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ్మినేని సీతారాం తాజా వ్యాఖ్య సంచలనంగా మారింది.