ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ యువ నాయకుడు మాజీ మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర సుదీర్ఘ లక్ష్యంతోనే ముందుకు సాగనుంది. మొత్తం 4 వేల కిలో మీటర్ల దూరాన్ని యువ నేత పాదయాత్ర ద్వారా చేరుకోనున్నారు. 400 రోజుల సుదీర్ఘ కాలం ఆయన ప్రజలతోనే మమేకం అవుతారు. ఇది ఇప్పటి వరకు ఏపీలో చేసిన వైఎస్ జగన్ షర్మిల చంద్రబాబు పాదయాత్రల రికార్డులను చెరిపేసి సరికొత్త రికార్డును సృష్టించనుంది.
ఇది.. ఇప్పటి వరకు ఉన్న అంచనా. అయితే.. పాదయాత్ర ద్వారా .. టీడీపీ ఆశిస్తున్నది ఏంటి? దీనివల్ల వైసీపీ పోగొట్టుకునేది ఏంటి? టీడీపీ కొత్తగా సాధించేది ఏంటి? అనే చర్చ జోరుగా సాగుతోంది. దీనికి ప్రధాన కారణం.. యువ నేత ప్రారంభిస్తున్న యువగళంపై టీడీపీ ఎక్కువగా ఆశలు పెంచుకోవడం.. లక్ష్యాలను కూడా పెద్ద ఎత్తున నిర్దేశించుకోవడమే. ప్రస్తుతం టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు పైకి కనిపించకపోయినా.. నేతల మధ్య మాత్రం సఖ్యత లేదనేది వాస్తవం.
ఈ నేపథ్యంలో యువగళం వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. అదేసమయంలో కేవలం జగన్ను సెంట్రిక్గా చేసుకుని విమర్శలు గుప్పించినంత మాత్రంతోనే యువగళం విజయం చెందినట్టుకాదనే విషయాన్ని కూడా నాయకుడు గుర్తెరగాలి.
ఎందుకంటే.. సీఎం జగన్ను తిట్టినా.. వైసీపీ నేతలను విమ ర్శించినా.. ఓట్లు పడతాయో లేదో తెలియదుకానీ.. తన పాత్రను మాత్రం స్పష్టం చేయాల్సి ఉంటుంది.
ఇక ఇంకోవైపు.. వైసీపీ విషయాన్ని పరిశీలిస్తే.. ప్రజలతో మమేకమైన ప్రతినాయకుడికి.. ప్రజలు పట్టం కట్టిన పరిస్తితి ఉంది. ఈ నేపథ్యంలో సహజంగానే యువ నాయకుడు నారా లోకేష్ను సైతం ప్రజలు ఆశీర్వదిస్తారనే వాదన వైసీపీలోనూ వినిపిస్తోంది.
ఇది తమకు ప్రత్యక్షంగాను.. పరోక్షంగానూ ఎలా ఎఫెక్ట్ అవుతుందనే విషయాన్ని వైసీపీ నేతలు భేరీజు వేసుకుంటున్నారు. అయితే.. యువగళం దూకుడును బట్టే ఇది ఉంటుందని కొందరు చెబుతున్నారు. మొత్తంగా యువగళం ద్వారా.. రెండు పార్టీల భవిత తేలిపోతుందని అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.