కొడాలి నాని మీద పోటీ : బరువైన నేతను దింపనున్న బాబు

Mon Mar 27 2023 21:55:50 GMT+0530 (India Standard Time)

TDP chandrababu on ycp kodali nani

గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానిని ఓడించాలి. ఇది టీడీపీ అధినేత చంద్రబాబు పంతం. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదు. తనను అనరాని మాటలు నాని అన్నారని బాబుకు తీవ్రమైన ఆగ్రహం ఉంది. అంతే కాదు తమ్ముళ్ళు అంతా కూడా కట్టకట్టుకుని మరీ నాని ఓటమిని చూడాలని వేయి కళ్ళేసుకుని చూస్తున్నారు.గుడివాడ అంటే నానిదే అన్నట్లుగా గడచిన నాలుగు ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. ఆయన పార్టీలతో సంబంధం లేకుండా గెలిచి వస్తున్నారు. 2004 2009లలో టీడీపీ తరఫున గెలిచిన నాని 2014 2019లలో వైసీపీ తరఫున గెలిచి సమం చేశారు. అంటే ఇక్కడ నానిని చూసి జనాలు ఓట్లు వేస్తున్నారు అని అర్ధం అవుతోంది అని ఆయన అనుచరులు చెబుతున్నారు.

నాని సైతం తాను గెలిచి తీరుతాను అంటున్నారు. ఆయన మీద ఎవరిని దింపాలన్నది బాబుకు అయితే తోచడంలేదు అంటున్నారు. నానికి ముందు ఒకసారి టీడీపీ తరఫున గెలిచిన రావి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఆయనే ప్రస్తుతం గుడివాడ ఇంచార్జిగా ఉన్నారు. గుడివాడలో నానిని ఆయనే ఎదుర్కొంటున్నారు. ఆయనకు టికెట్ కాదని నానికి అప్పట్లో టికెట్ ఇచ్చారు.

ఆ తరువాత నాని పాతుకుపోయారు. దాంతో రావికి గుడివాడలో పట్టుచిక్కడంలేదు. అయితే  ఈసారి మాత్రం తనదే విజయం అని ఆయన అంటున్నరు. తాను గెలిచి చూపిస్తాను అని తొడగొట్టి మరీ చెబుతున్నారు. కానీ బాబుకు మాత్రం నమ్మకం కుదరడం లేదు. కొడాలి నాని బలంగా ఉన్నారని అర్ధబలం అంగబలం ఆయనకు దండీగా ఉన్నాయని అంచనా కడుతున్నారు.

అలాంటి నాని మీదకు రావిని పెట్టి పోటీ చేయించాలంటే కొంత ఇబ్బందే అని సందేహిస్తున్నారుట. పైగా రావి ఆర్ధికంగా అంత స్థితిమంతుడు కాడని అంటున్నారు. ఈ నేపధ్యంలో అన్ని విధాలుగా బరువైన అభ్యర్ధినే వెతికి పట్టుకున్నారని అంటున్నారు. ఆయనే ఎన్నారై గా ఉన్న వెనిగళ్ల రాముగా చెబుతున్నారు. ఆయన ఆర్ధికంగా కుబేరుడిగా చెబుతున్నారు.

ఇక సామాజికవర్గం కోణంలో చూస్తే ఆయన కమ్మ అయితే భార్య దళిత సామాజిక వర్గంగా ఉన్నారని అంటున్నారు. దాంతో రెండు వర్గాల నుంచి దండీగా మద్దతు దక్కితే గుడివాడను సులువుగా ఓడించవచ్చు అన్నదే బాబు మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు. ఇప్పటికే గుడివాడ వేదికగా చేసుని వెనిగళ్ల రాము తన రాజకీయ యాక్షన్ ప్లాన్ ని స్టార్ట్ చేశారని అంటున్నారు.

ఆయన కొడాలి మీద తన అస్త్ర శస్త్రాలను రెడీ చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో  చంద్రబాబు వెనిగళ్ల రాము వైపు గట్టిగా మొగ్గు చూపిస్తున్నారు అని అంటున్నారు. ఆయన అయితేనే కరెక్ట్ అని డిసైడ్ అవుతున్నారుట. అయితే రావి వర్గీయులు మాత్రం తమ నేతకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారని అంటున్నారు. పార్టీ కోసం ఆరుగాలం కష్టపడి పనిచేస్తున్న రావిని ఇన్నాళ్ళు వాడుకుని ఇపుడు పక్కన పెట్టడం సమంజసం కాదని అంటున్నారుట

కానీ గెలుపు గుర్రాలకే ఎన్నికల్లో టికెట్లు అని ఒట్టేసి పెట్టుకున్న టీడీపీ అధినాయకత్వం ఇపుడు అదే దిశగా కదులుతోందని అంటున్నారు. మొత్తానికి గుడివాడలో కొడాలి నానికి గట్టి వారు బరువైన వారు అయిన ప్రత్యర్ధిని ఏర్చి కూర్చి బాబు రెడీ చేసి పెడుతున్నారన్న మాట. మరి ఆయన లక్ ఎలా ఉందో చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.