Begin typing your search above and press return to search.

అమ‌రావతి భూముల అమ్మ‌కం.. కుట్ర కోణం ఉందా?

By:  Tupaki Desk   |   14 Aug 2022 10:35 AM GMT
అమ‌రావతి భూముల అమ్మ‌కం.. కుట్ర కోణం ఉందా?
X
వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌రావ‌తి ప్రాంత ప‌రిధిలోని భూములు అమ్మ‌కానికి గ‌త జూలై నెల‌లో ఏర్పాట్లు చేసింది. రాజ‌ధాని అభివృద్ధికి నిధులు లేవ‌ని.. ఆ భూముల‌ను విక్ర‌యించి రాజ‌ధానిని అభివృద్ధి చేస్తామ‌ని ప్ర‌భుత్వం చెప్పిన‌ప్ప‌టికీ ఇందులో కుట్ర‌కోణం ఉంద‌ని రాజ‌ధాని రైతులు అభిప్రాయ‌ప‌డుతున్నార‌ని అంటున్నారు.

తొలి విడతలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం మొత్తం 248.34 ఎకరాల భూమిని అమ్మాలని నిర్ణయించింది. ఎకరా భూమి ధర కనీసం రూ.10 కోట్లుగా నిర్ధారించిన ప్రభుత్వం.. మొత్తం దాదాపు 2,500 కోట్లు స‌మీక‌రించాల‌ని నిర్ణ‌యించింఒది. వేలం ద్వారా భూముల విక్రయానికి అనుమతి ఇస్తూ జూలైలో జీవో నెంబర్ 389 జారీ కూడా చేసింది.

అయితే ఈ భూముల వేలానికి సంబంధించి జీవో జారీ చేసినా.. తొలుత ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింద‌ని అంటున్నారు. తర్వాత లీకులు రావడంతో రాజధాని ప్రాంతంలో భూముల వేలం బయటకు పొక్కిందని చెబుతున్నారు. చంద్రబాబు ప్ర‌భుత్వ‌ హయాంలో బీఆర్ శెట్టి, అమరావతి మెడిసిటీ, లండన్ కింగ్స్ కాలేజీలకు కేటాయించిన భూములను వారు ఉపయోగించుకోలేదు. సమయం కూడా దాటిపోవడంతో ఆ భూములు తిరిగి ప్రభుత్వానికే చెందాయి. ఇప్పుడు ఈ భూములను వేలం వేసి వచ్చిన నిధులను రాజధాని అభివృద్ధికి కేటాయిస్తామని జగన్ ప్రభుత్వం చెబుతోంది.

కాగా రాజధానిని అభివృద్ధి చేసేందుకు తమ దగ్గర డబ్బులు లేవని జగన్ ప్రభుత్వం ఎప్పుడో చేతులెత్తేసింది. ఇదే విషయాన్ని హైకోర్టుకి కూడా తేట‌తెల్లం చేసింది. అయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌రావ‌తి భూముల వేలానికి పెద్ద‌గా స్పంద‌న రాలేద‌ని స‌మాచారం. ఎక‌రా రూ.10 కోట్లు అని ప్ర‌భుత్వం ప్రాథ‌మికంగా నిర్ణ‌యించ‌డంతో అంత‌పెట్టి కొన‌డానికి ఎవ‌రూ ముందుకు రావ‌డం లేద‌ని చెబుతున్నారు. వేలానికి పిలుపు ఇస్తే కనీసం బిడ్లు కూడా దాఖలు కాలేదంటున్నారు.

కొద్ది రోజుల కిందట రాజ‌ధాని ప్రాంత ప‌రిధిలో ప్రభుత్వ స్థలాలకు వేలం నిర్వహించాలని ఉత్తర్వులిచ్చారు. 56 ఎకరాల్లో వంద నివాస, వాణిజ్య ప్లాట్లను వేలానికి ఉంచితే నిర్దేశిత గ‌డువులోపు మూడే ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని చెబుతున్నారు. ఈ వేలం కోసం వంద మందికిపైగా సిబ్బందిని రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) నియమించింద‌ని అంటున్నారు. ఏకంగా ప్రచారం కోస‌మే రూ.50 లక్షలు ఖర్చు పెట్టార‌ని చెబుతున్నారు. కానీ వేలం ద్వారా ఈ డ‌బ్బులు కూడా రాలేద‌ని స‌మాచారం.

అయితే ఎక్కువ ధ‌ర పెట్ట‌డంతో ఎక‌రా ప‌ది కోట్ల రూపాయ‌ల‌కు కొన‌డానికి ఎవ‌రూ రాలేదు కాబ‌ట్టి ఈ రేటును చాలావ‌ర‌కు త‌గ్గించి మ‌ళ్లీ బిడ్లు ఆహ్వానిస్తుంద‌ని ప్ర‌తిప‌క్షాలు భావిస్తున్నాయి. త‌ద్వారా అమ‌రావ‌తి భూముల‌కు త‌క్కువ రేట్లు నిర్ధారించి వాటిని వైఎస్సార్సీపీ నేత‌లు ద‌క్కించుకునేలా ప్ర‌భుత్వం పావులు క‌దుపుతోందా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ అంశం ముందుముందు తీవ్ర వివాదాస్ప‌దమ‌య్యే అవ‌కాశం ఉందంటున్నారు.