Begin typing your search above and press return to search.

ఏపీలో పీకే వర్సెస్ రాబిన్ శర్మ... నో యూజ్

By:  Tupaki Desk   |   31 May 2023 9:00 PM GMT
ఏపీలో పీకే వర్సెస్ రాబిన్ శర్మ... నో యూజ్
X
ట్రెడిషనల్ పాలిటిక్స్ లో కార్పొరేట్ స్టైల్ తీసుకుని వచ్చినది కచ్చితంగా ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే అని చెప్పాల్సి ఉంటుంది. ఎన్నికల వ్యూహకర్త గా ఆయన కొత్త స్ట్రాటజీస్ తన దగ్గర ఉన్నాయని చెబుతూ చాలా పార్టీలకు కన్సల్టెంట్ గా నియమితులు అయ్యారు. అయితే ఆయన వ్యూహకర్తగా పనిచేసి గెలిచిన పార్టీలకు జనాల్లో అప్పటికే పాజిటివ్ వైబ్ఉందన్న సంగతి కూడా గమనంలోకి తీసుకోవాలి.

గుజరాత్ సీఎం నుంచి ప్రధాని అభ్యర్ధిగా ప్రమోట్ చేయబడిన కొత్తల్లో నరేంద్ర మోడీ హవా దేశమంతా ఉంది. ఆయన భారత్ ని బాగు చేయడానికి వచ్చిన దేవ దూత అని అంతా తలపోసేవారు. ఇక బీజేపీ సైతం అప్పటికి వరసగా రెండు ఎన్నికల్లో ఓడడంతో కసిగా పనిచేయడం యూపీయే వైఫల్యాలు కూడా కలసి వచ్చాయి. ఇదిలా ఉంటే 2019లో ఏపీలో జగన్ గెలవడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. అయితే పీకే స్ట్రాటజీస్ తోనే గెలుపు అనుకుంటే అది పూర్తిగా తప్పు.

ఇపుడు చూస్తే వైసీపీని మరోమారు గెలిపించడానికి పేకే టీం తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 2019 పరిస్థితులు వేరు. 2024 పరిస్థితులు వేరు. అపుడు వర్కౌట్ అయినట్లుగా ఇపుడు అవాలని ఏమీ లేదు. పీకే టీం చాలానే ప్లాన్స్ ఇస్తోంది. దాన్ని వైసీపీ తుచ తప్పకుండా ఫాలో అవుతోంది. కానీ పీకే ఎన్నికల్లో పోటీ చేయదు. ఓట్లు కూడా వేయించలేదు. పోటీ చేసేది వైసీపీ అభ్యర్ధులు. ఓట్లు వేసేది జనాలు.

మరి ఓటర్లను ఇళ్ల నుంచి పోలింగ్ బూతులకు తీసుకుని వచ్చేది క్యాడర్. వైసీపీ అధికారంలోకి వచ్చాక పూర్తిగా సైడ్ అయిపోయింది క్యాడర్. వారిలో అసంతృప్తి దావానలంగా పేరుకుపోయింది. ఈ నేపధ్యంలో పీకే టీం చేసే మ్యాజిక్ ఏమీ ఉండదనే అంటున్నారు. సరిగ్గా ఇదే పాయింట్ మీదనే టీడీపీలో చర్చ సాగుతోంది. నిజానికి పీకేని వైసీపీ కన్సల్టెంట్ గా తీసుకున్నపుడు టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. వ్యూహాలు వైసీపీ లేకనే అద్దెకు తెచ్చుకుంటున్నారు అని అన్నారు.

తమకు అపర చాణక్యుడు చంద్రబాబు ఉన్నారని కూడా వారు చెప్పుకున్నారు. కానీ 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి రాబిన్ శర్మను టీడీపీ తెచ్చి పెట్టుకుంది. రాబిన్ శర్మ సూచనలతోనే ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అన్న ప్రోగ్రాం తీసుకున్నారు. అలాగే బాదుడే బాదుడు అని మరో కార్యక్రమం కూడా చేపట్టారు. ఇవన్నీ క్యాడర్ ని ఎంతో కొంత కదిలించడానికి ఉపయోపడి ఉండవచ్చు కానీ రాబిన్ శర్మ వల్ల టీడీపీకి పెద్దగా మేలు జరిగింది లేదని అంటున్నారు.

ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు గెలిచారు అంటే దానికి కారణం క్యాడర్ లో పెరిగిన పట్టుదల పార్టీ లో జోష్ పెరగడం అని అంటున్నారు. అలాగే జనాల్లో వచ్చిన కీలకమైన మార్పు అని చెబుతున్నారు. ఈ విషయాలను పక్కన పెట్టి పీకేను నమ్ముకుని వైసీపీ బరిలోకి దిగినా లేక రాబిన్ శర్మ తోనే గెలుపు సాధ్యమని తెలుగుదేశం భ్రమల్లో పడినా ఒరిగేది లేదని అంటున్నారు.

ఓటర్లలో మార్పు రావాలి, వారిని తమ వైపు తిప్పుకోవాలి. అలాగే పార్టీ బాగా కష్టపడాలి. జిల్లాలలో పార్టీ ఎక్కడికక్కడ బలంగా ఉండాలి. గ్రౌండ్ లెవెల్ వరకూ పోలింగ్ బూత్ దాకా పార్టీ విస్తరించి ఉంటేనే గెలుపు అన్నది సాధ్యం తప్ప లాప్ టాప్స్ ముందేసుకుని కన్సల్టెంట్స్ ఇచ్చే సర్వే నివేదికలు కానీ వారి సలహా సూచనలు కానీ ఏ పార్టీని గెలిపించలేవు అని అంటున్నారు.

గతంలో ఎన్టీయార్ వంటి లీడర్ గెలిచాడు అంటే జనాలతోనే కనెక్ట్ కావడం, ఆయన రావాలని సొంత పార్టీ క్యాడర్ గట్టిగా పనిచేయడం వల్లనే సాధ్యపడింది అని అంతున్నారు. మరి ఈ సంగతిని గుర్తెరగకుండా నేల విడిచి సాము చేస్తే మాత్రం దెబ్బైపోతారని అంటున్నారు. టోటల్ గా ఎవరైనా చెప్పేది ఏంతి అంటే పీకే రాబిన్ శర్మ వల్ల నో యూజ్ అనేనట.