మరీ ఇంత మాటా రోజా? శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లుగానట

Wed Mar 22 2023 11:11:37 GMT+0530 (India Standard Time)

RK Roja Comments On TDP Winning MLC Elections

రాజకీయంగా వైరం ఉండొచ్చు. అంతమాత్రానికే నోటికి వచ్చినట్లు ఎంత మాట అంటే అంత మాట అనేయటం సరైనదేనా? ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయం దూకుడుగా మారింది నిజమే. అంత మాత్రానికే నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేయటంలో అర్థం లేనిది. ఏపీ మంత్రి ఆర్కే రోజా మాటలు వింటే ఇదే భావన కలుగక మానదు. ప్రజల తీర్పును సైతం ఎక్కెసం చేసేలా మాట్లాడటం.. చులకన చేసేలా మాటలు రువ్వటంలో పేరున్న వైసీపీ నేతల్లో రోజా ఒకరు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో విపక్ష టీడీపీ సంచలన విజయాన్ని సాధించటం తెలిసిందే.ఈ విజయంపై మంత్రి రోజా మాట్లాడుతూ.. 'శవాల నోట్లో తీర్థం పోసిన విధంగా టీడీపీకి అనుకోకుండా మూడు ఎమ్మెల్సీ స్థానాలు వచ్చాయి' అని వ్యాఖ్యానించటం గమనార్హం. 2019 నుంచి ఏపీలో ఎక్కడా గెలవకపోవటంతో.. టీడీపీ నేతలకు పిచ్చెక్కి పోయారన్నారు. శవాల నోట్లో తులసి తీర్థం పోసిన విధంగా మూడు ఎమ్మెల్సీ సీట్లు సాధించినంతనే ఇష్టారాజ్యంగా సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.

ఆ ఎమ్మెల్సీలు సొంత ఓట్లు..సింబల్ తో గెలవలేదన్న రోజా.. 'అయినప్పటికీ అదేదో పెద్ద ఘనకార్యం సాధించినట్లుగా సంబరాలు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. 2024లో మరోసారి జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు అంటారు. టీడీపీ అధికారంలోకి రావటం కలగానే మిగిలిపోతుంది.

నోరు ఉంది కదా? అని వైసీపీ గురించి.. సీఎం జగన్ గురించి మాట్లాడితే తాము చూస్తూ ఊరుకోమన్నారు. వైనాట్ పులివెందుల అంటూ కామెంట్లు చేస్తున్న వ్యక్తికి దమ్ముంటే పులివెందుల వచ్చి సీఎం జగన్ మీద పోటీ చేయాలి" అని సవాలు విసిరారు.

ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవి రావు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే మరింత ఎక్కువ ఓట్లు వచ్చేవన్నారు. ఫ్యాన్ గుర్తుతో పోటీ చేస్తే ప్రజలు కచ్ఛితంగా వైసీపీకే ఓట్లు వేస్తారన్న వ్యాఖ్య చేసిన రోజా.. అక్కడితో ఆగకుండా మరిన్ని వ్యాఖ్యలు చేశారు.

జీవో నెంబరు 1 తీసుకొచ్చింది ప్రజల ప్రాణాల్ని కాపాడేందుకేనని.. పబ్లిసిటీ పిచ్చితో చంద్రబాబు 11 మందిని చంపేస్తే ప్రజారాక్షణ కోసమే తామీ జీవో నెంబరు 1ను తెచ్చామంటూ కొత్త భాష్యాన్ని చెప్పటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.