ఆసక్తికర పరిణామం.. హర్షకుమార్ తో వైసీపీ ఎంపీ భేటీ!

Tue Dec 06 2022 12:48:24 GMT+0530 (India Standard Time)

Pilli Subhash Chandra Bose Met Harsha Kumar

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ను ఆయన నివాసంలో వైసీపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కలవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో దళితుల్లో హర్షకుమార్‌కు మంచి పట్టుంది. హర్ష కుమార్ మాల సామాజికవర్గానికి చెందినవారు. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో మాలల ప్రాబల్యం ఎక్కువ. కాపు సామాజికవర్గంతో సమానంగా ఉన్నారు.2004 2009ల్లో అమలాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా హర్షకుమార్ గెలుపొందారు. 2014లో కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటు చేసిన జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఒక కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కాళ్లకు నమస్కరించారు. ఈ వ్యవహారంలో దళిత సంఘాల నుంచి హర్షకుమార్ భారీగానే విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే 2019లో ఆయనకు టీడీపీ సీటు కేటాయించలేదు. మాజీ స్పీకర్ జీఎం బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాథుర్‌కు సీటు కేటాయించింది.

2019 ఎన్నికల తర్వాత హరీష్ కుమార్ స్తబ్దుగా ఉండిపోయారు. అయితే విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే వివిధ ఉద్యమాల్లో పాల్గొని ఉండటం దళిత స్పృహ దూకుడుగా వ్యవహరించగల స్వభావం ఇవన్నీ ఉండటంతో వైసీపీ హర్షకుమార్‌ను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉందని అంటున్నారు.

ఇందులో భాగంగా వైసీపీ ముఖ్య నేతల్లో  ఒకరిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను హర్షకుమార్ దగ్గరకు పంపిందని అంటున్నారు.

కాగా ఇటీవల కొత్తగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) ఏర్పాటులో భాగంగా తనకు ఇచ్చిన పదవిని హర్షకుమార్ తిరస్కరించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయాన్ని ఆయన ఢిల్లీ వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు వివరించారు.

ఈ నేపథ్యంలో పార్టీ మారే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో హర్షకుమార్‌ను కలసి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడారు. బంధువుల సమస్యకు సంబంధించి పాత మిత్రుడు హర్షకుమార్‌ను కలిసినట్లు బోస్ చెబుతున్నప్పటికీ అసలు విషయం అది కాదని అంటున్నారు.

ఈసారి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం గట్టిగా ఉంటుందనే వార్తల నేపథ్యంలో వైసీపీ ముందు జాగ్రత్త చర్యగా వివిద సామాజికవర్గాల్లో కీలక నేతలను ఆకర్షిస్తోందని అంటున్నారు. ఈ క్రమంలో దళిత నేతల్లో ప్రముఖంగా ఉన్న హర్షకుమార్‌ను తన వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుందని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.