అసెంబ్లీలో ఎమ్మెల్యేల తన్నులాటపై పవన్ సంచలన వ్యాఖ్యలు!

Mon Mar 20 2023 22:00:01 GMT+0530 (India Standard Time)

Pawan Comments on MLAs Fight in Assembly

ఏపీ అసెంబ్లీలో మార్చి 20న చోటు చేసుకున్న సంఘటనలపై జనసేనాని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ సభ్యులు కొట్లాటకు దిగడంపై పవన్ స్పందించారు. అర్థవంతమైన చర్చలు జరగాల్సిన చోట ఈ దాడులేమిటి అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు పవన్ మీడియాకు ఒక ప్రకటన జారీ చేశారు.ప్రజల గొంతు నొక్కే జీవో నంబర్ 1పై చర్చ జరపాలని కోరిన టీడీపీ సభ్యులపై దాడి చేయడటం ఏమిటని పవన్ ప్రశ్నించారు. ఈ దాడిని తాను ఖండిస్తున్నానన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయ స్వామి గోరంట్ల బుచ్చయ్య చౌదరిలపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని అని కోరారు.

చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు జరగాలని పవన్ అభిప్రాయపడ్డారు. పరిపాలన విధానాల్లో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్న వాటిపై చర్చ జరగాల్సిందేనని తెలిపారు. ప్రకటనలో పవన్ ఏమన్నారంటే..

'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు సంబంధించి మీడియా ద్వారా అందిన సమాచారం చూస్తే.. ఈ పరిణామాలు దురదృష్టకరమైనవి. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేవి. ప్రజల గొంతు నొక్కే జీవో నెం.1పై చర్చను కోరిన ప్రతిపక్ష టీడీపీ శాసన సభ్యులపై అధికార పక్షం దాడి చేయడాన్ని ఖండిస్తున్నాను. ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయ స్వామి గోరంట్ల బుచ్చయ్య చౌదరిలపై దాడిని ప్రజాస్వామ్యవాదులు ముక్త కంఠంతో ఆక్షేపించాలి' అని పవన్ వ్యాఖ్యానించారు.

'చట్ట సభలలో అర్థవంతమైన చర్చలు చేసి ప్రజలకు మేలు చేస్తారని అందరం ఆశిస్తాం. పరిపాలన విధానాల్లో ప్రజా ప్రయోజనాలకి విరుద్ధంగా ఉన్నవాటిపై చర్చ చేయాలి. చర్చ కోసం పట్టుబడితే దాడి చేయడం భావ్యం కాదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ విధమైన దాడులు చట్ట సభల నుంచి వీధుల్లోకి వస్తాయి.

ఇటువంటి పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తాయి. ముందుగా చట్ట సభల గౌరవాన్ని హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత సభా నాయకుడిగా ముఖ్యమంత్రిపైనా సభ ప్రిసైడింగ్ అఫీషియల్స్ మీదా ఉంది' అని పవన్ తన ప్రకటనలో తెలిపారు.    


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.