Begin typing your search above and press return to search.

రాజమండ్రి ఎంపీ టికెట్ ఎవరికి....?

By:  Tupaki Desk   |   30 May 2023 6:00 AM GMT
రాజమండ్రి ఎంపీ టికెట్ ఎవరికి....?
X
రాజమండ్రి లోక్ సభ సీటు ప్రతిష్టాత్మకమైనది. ఈ ఎంపీ సీటు విషయంలో టీడీపీలో అపుడే పోటీ పెరుగుతోంది. నిజానికి రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో టీడీపీ గెలిచింది ముచ్చటగా మూడు సార్లే. 1984లో ఒకసారి, 1991లో రెండవసారి, 2014లో మూడవసారి ఆ పార్టీ విజయం సాధించింది. మిగిలిన టైం లో కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ కూడా రెండు సార్లు ఇక్కడ జెండా పాతింది. ఇక బీసీ నినాదంతో 2019లో వైసీపీ ఘన విజయం సాధించింది.

ఇక ఈ సీటులో బ్రాహ్మణులు, కాపులు, కమ్మలు ఎక్కువగా గెలిచారు. బీసీలు కూడా ఇపుడు ఈ సీటు మీదనే కన్నేశారు. వైసీపీ 2024లో ఎవరికి టికెట్ ఇస్తుందో తెలియదు కానీ టీడీపీ అయితే ఈసారి గెలిచి తీరాలని చూస్తోంది. ఆ పార్టీ నుంచి చాలా మంది ఆశావహులు రేసులోకి వస్తున్నారు. అందులో కొన్ని పేర్లు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. ఇక్కడ రాజులు కూడా గతంలో గెలిచిన చరిత్ర ఉండడంతో వైసీపీ రెబెల్ ఎంపీ రఘు రామ క్రిష్ణం రాజు ఈ సీటు మీద ఆశలు పెంచుకుంటున్నారు అని అంటున్నారు.

అయితే ఆయన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారు కావడంతో సీటు ఇస్తారా లేదా అన్నది చూడాలి, ఇక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన శిష్ట్లా లోహిత్ ఈ సీటు మీద కన్నేశారు అని అంటున్నారు. ఆయన గత రెండేళ్ళుగా ఈ సీటు మీద ఫోకస్ పెట్టి మరీ పనిచేస్తున్నారు. ఆయన యువ పారిశ్రామిక వేత్తగా ఉన్నారు. చంద్రబాబు లోకేష్ లకు ఆయన పట్ల మంచి అభిప్రాయం ఉందని అంటున్నారు.

ఇక ఇపుడు మరో పేరు తెర మీదకు వస్తోంది. ఆయనే బొడ్డు వెంకట రమణ చౌదరి. ఆయన తండ్రి బొడ్డు భాస్కరరావు పెద్దాపురంలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉంటూ 1994, 1999లో తెలుగుదేశం పార్టీ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారు. ఆయన వారసుడే బొడ్డు వెంకట రమణ.

అంగబలం, అర్ధబలం దండీగా ఉన్న ఆయన రాజమండ్రి టికెట్ కోరుతున్నారు. మరి ఆయనకు టీడీపీ టికెట్ ఇస్తుందా లేక రెబెల్ రాజుకు కానీ లోహిత్ కానీ ఇస్తుందా ఇక ఈ ముగ్గురు కాకుండా వేరే వారు కూడా క్యూ కడతారా అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి చూస్తే ఈసారి రాజమండ్రి లోక్ సభ సీటు విషయంలో టీడీపీకి చాలా ఆశలు ఉన్నాయి.

మహానాడు పూర్తిగా విజయవంతం అయింది. అదే టైం లో జనసేనతో పొత్తు కుదురితే రాజమండ్రి సీటుని మంచి మెజారిటీతో గెలుచుకుంటామన్న ధీమా ఉంది. ఏది ఏమైనా రాజమండ్రి ఎంపీ అభ్యర్ధి ఎవరు అన్నది ఇపుడు టీడీపీలో చర్చగా ఉంది.