లోకేష్ గెలిచాడా...దేనికి సంకేతం...?

Sat Mar 18 2023 18:01:19 GMT+0530 (India Standard Time)

News on TDP nara lokesh

తెలుగుదేశం పార్టీకి భావి వారసుడు నారా లోకేష్. ఆయన్ని పప్పుగా వైసీపీ సహా ప్రత్యర్ధులు ముద్ర వేసినా లోకేష్ అయితే గతం కంటే కూడా బాగా మెరుగుపడ్డారు అన్నది ఒక నిఖార్సు అయిన విశ్లేషణ. ఆయన బాడీ లాంగ్వేజ్ మారింది. భాష మారింది. ఆయన మాట తీరులో కూడా స్పష్టత ఉంది. విషయ పరిజ్ఞానంలో ఆయన బాగానే రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే జగన్ కంచుకోటగా భావించే రాయలసీమలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ దూసుకుపోతోంది.తూర్పు రాయలసీఅం గ్రాడ్యుయేట్ సీటుని ఆ పార్టీ మంచి మెజారిటీతో గెలుచుకుంది. పశ్చిమ సీట్లో టైట్ ఫైట్ సాగుతోంది. అయితే ఈ ఆరు జిల్లాల్లో వైసీపీకి గట్టి పట్టుంది. 2014 నుంచి చూసుకున్నా వైసీపీ బలాన్ని చాటుకుంటూ వస్తోంది. తెలుగుదేశం అయితే కోస్తాలో తన ఆధిపత్యాన్ని చూపిస్తున్నా సీమలో అయితే అనుకున్న విధంగా కాలూనలేకపోతోంది. మరి ఇపుడు చూస్తే ఇంతటి ప్రభంజనం రావడం వెనక కారణం ఏంటి అంటే లోకేష్ బాబు యువగళం పాదయాత్ర ప్రభావమే అని అంటున్నారు.

యూత్ ఓటర్లు గా ఉన్న వారంతా పాలుపంచుకునే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి షాక్ ఇవ్వడం వెనక లోకేష్ పాదయాత్ర ప్రభావం గట్టిగా ఉందని అంటున్నారు. లోకేష్ పాదయాత్రలో జాబ్స్ లేవు జాబ్ క్యాలండర్ ఏమైంది అంటూ ప్రశ్నిస్తూ వస్తున్నారు. వైసీపీ నాలుగేళ్ల కాలంలో ఒక్క పరిశ్రమ అయినా కొత్తగా వచ్చిందా అని ఆయన నిలదీస్తున్నారు. పై పెచ్చు ఉన్న పరిశ్రమలను తగిలేశారు అని కూడా హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

ఇంకో వైపు చూస్తే లోకేష్ ఏపీలో 2024లో చంద్రబాబు అధికారంలోకి వస్తారని 2025 జనవరిలో జాబ్ క్యాలెండర్ ని తాము ప్రకటిస్తామని కూడా హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన మీద లోకేష్ పాదయాత్రలో చేస్తున్న ఘాటైన విమర్శలు యువతరాన్ని బాగానే తాకాయని అంటున్నారు. అభివృద్ధి లేదు కక్షలు కార్పణ్యాలు తప్ప ఏపీ లో హెడ్ లైన్స్ ఏమీ ఉండవని ఆయన సెటైరికల్ గా అంటున్న మాటలు విద్యావంతులలో పెను ప్రభావమే చూపించాయని దాని ఫలితమే ఇపుడు దారుణమైన ఫలితాలు వచ్చాయని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే లోకేష్ గత నలభై అయిదు రోజులుగా పాదయాత్ర నిరాటంకంగా చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను రెట్టింపు చేయడంలో చినబాబు కీలకంగానే మారారని అంటున్నారు. ఇప్పటిదాకా ఆయనకు మాట్లాడడం చేత కాదు పప్పు అని అంటున్న వారు అంతా కూడా ఇపుడు జాగ్రత్త పడాల్సిందే అని అంటున్నారు. ఇక తెలుగుదేశంలో చంద్రబాబు టూర్లు వేస్తున్నా కంటిన్యూస్ గా పాదయాత్ర రూపంలో ఉంటోంది చినబాబు మాత్రమే అని అందుకే గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాలు లోకేష్ బాభ్ ఖాతాలోనే వేయాలని తెలుగుదేశంలో అంటున్న వారు ఉన్నారట.

తెలుగుదేశం ఇంతటి పార్టీ పెట్టినా కూడా  ఫస్ట్ టైం గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలిచింది. గతంలో అంటే 2007లో ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసినా కామ్రేడ్స్ ఆ సీటుని గెలుచుకున్నాయి. ఆ తరువాత టీడీపీ బీజేపీ పొత్తుతో బీజేపీ గెలిచింది. ఇపుడు సొంతంగా టీడీపీ గెలవడం అంటే యూత్ లోకి పార్టీ బాగానే వెళ్ళిందని లోకేష్ బాబు యువగళానికి గొంతులు కలిపిన యువజనం ఇచ్చిన తీర్పుగా దీన్ని చూస్తున్నారు.

ఏది ఏమైనా లోకేష్ బాబు పాదయాత్ర చేస్తున్న మొదట్లోనే ఇంత ఇంపాక్ట్ వచ్చిందంటే ముందు ముందు ఏపీ రాజకీయాలలో గణనీయమైన మార్పులు వస్తాయని అంటున్నారు. మొత్తానికి ఐరన్ లెగ్ లోకేష్ తో టీడీపీకి ఏమీ ఒరిగేది లేదు అన్న వారంతా  ఇపుడు కాస్తా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది అంటున్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.