Begin typing your search above and press return to search.

బాబు చుట్టూ భజనపరులేనా... టీడీపీ ఎంపీ గుడ్ బై...?

By:  Tupaki Desk   |   10 Dec 2022 2:30 AM GMT
బాబు చుట్టూ భజనపరులేనా... టీడీపీ ఎంపీ గుడ్ బై...?
X
తెలుగుదేశం పార్టీలో అంతా చంద్రబాబే. ఆయనే కర్త కర్మ క్రియ. ఆయన్ని కానీ పార్టీని కానీ విమర్శించేవారు అసలు ఉండరు. ఉంటే మనుగడ సాగించలేరు. ఆ విషయం రెండు సార్లు ఎంపీ అయిన విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నానికి తెలియదు అనుకుంటే పొరపాటే. మరి తెలిసి తెలిసి ఆయన తెగేదాకా ఎందుకు లాగుతున్నారు. అంటే ఆయన రాజకీయంగా విసిగిపోయారా. తెలుగుదేశం పార్టీ విషయంలో ఆయన ఆలోచనలు వేరేగా ఉన్నాయా అన్న చర్చ అయితే వాడిగా వేడిగా సాగుతోంది.

విజయవాడ నుంచి రెండవసారి ఎంపీ కాగానే కేశినేని నాని స్వతహాగా చాలానే పార్టీ నుంచి ఆశించారు. తనకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నియమిస్తారు అనుకుంటే ఫస్ట్ టైం ఎంపీ అయిన గల్లా జయదేవ్ ని బాబు తెచ్చి లీడర్ ని చేశారు. దానితోనే ఆయనలో అసంతృప్తి స్టార్ట్ అయింది. అయితే దానికి ముందు కూడా కొన్ని విషయాలు జరిగాయని అంటున్నారు. ఇక జగన్ వేవ్ బలంగా ఉన్న చోట దాదాపుగా అందరూ ఓడి ముగ్గురు ఎంపీలు గెలిస్తే అందులో ఇద్దరికి పార్టీ పదవులు ఇచ్చిన బాబు కేవలం కేశినేని నానినే సైడ్ చేశారు అన్న బాధ ఆయనకు ఉంది.

ఆ మీదట ఆయన వీలు దొరికినపుడల్లా పార్టీ మీద విమర్శలు ఇండైరెక్ట్ గా చేస్తూనే ఉన్నారు. ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో విజయవాడ మేయర్ పదవికి తన కుమార్తె శ్వేతను ఎంపిక చేస్తే తనకు లోకల్ గా ఉన్న టీడీపీ లీడర్స్ బోండా ఉమ, దేవినేని ఉమా బుద్ధా వెంకన్న వంటి వారి నుంచి సహాయ నిరాకరణ జరగడమే కాకుండా తనను నానా మాటలు అన్నా కూడా చంద్రబాబు స్పందించలేదు అని కేశినేని నాని తీవ్రంగా బాధపడ్డారు.

ఇక ఆ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. శ్వేత మేయర్ కాలేకపోయింది. అప్పటి నుంచి నాని మరింతగా దూరం అయ్యారని అంటున్నారు. ఈ మధ్యలో కేశినేని నాని సోదరుడు చిన్నిని టీడీపీ అధినాయకత్వం దగ్గరకు తీయడంతో ఆయన మండిపోయారు అని అంటున్నారు. ఏకంగా రాజకీయం కాస్తా తన కుటుంబంలోకి వచ్చేసింది అని ఆయన మధన పడ్డారు అని అంటున్నారు.

ఈ సమయంలోనే జరిగిన మహానాడుకు ఆయన డుమ్మా కొట్టారు. ఢిల్లీకి బాబు వస్తే బొకే ఇచ్చేందుకు కూడా ఆయన నిరాకరించారు. ఇక పార్టీ మీటింగ్స్ కి కూడా అటెండ్ కావడంలేదు. పార్టీలో భజనపరులు ఉన్నారని, వారంతా బాబు చుట్టూ ఉన్నారని నాని ఆఫ్ ది రికార్డుగా చేసిన కామెంట్స్ కూడా ఉన్నాయని చెబుతారు. రీసెంట్ గా నాని తన కుమార్తె వివాహానికి సంబంధించి శుభలేఖ ఇవ్వడానికి బాబు ఇంటికి వెళ్లారుట.

కేవలం పెళ్ళికి సంబంధించి మాత్రమే మాట్లాడి వచ్చారని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే నానికి బీజేపీ నేతలతో సంబంధం ఉందని ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు అని టీడీపీలో కొందరు ప్రచారం చేస్తున్నారు.

అయితే తాను నమ్మకద్రోహానికి పాల్పడనని తాను ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుంటాను మీకు నచ్చిన వారికి టికెట్ ఇచ్చుకోండి అంటూ కేశినేని నాని బాబుకే చెప్పేశారు అని టాక్ నడుస్తోంది. ఇవన్నీ చూస్తూంటే నాని వర్సెస్ బాబు అన్నట్లుగా సాగుతున్న ఈ ఎపిసోడ్ లో గ్యాప్ బాగా పెరిగింది. ఏదో ఫైన్ మారింగ్ గుడ్ బై చంద్రబాబు గారు అని నాని చెప్పేస్తారు అనే అంటున్నారుట. చూడాలి మరి అదే నిజమవుతుందో ఏమో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.