Begin typing your search above and press return to search.

టీడీపీలో గంటా మోగుతుందా...?

By:  Tupaki Desk   |   31 May 2023 8:00 AM GMT
టీడీపీలో గంటా మోగుతుందా...?
X
విశాఖ జిల్లాలో సీనియర్ లీడర్, మాజీ మంత్రి అయిన గంటా శ్రీనివాసరావు తెలుగుదేశంలో పూర్వ వైభవం కోసం చూస్తున్నారు. ఆయన రీ యాక్టివ్ అయ్యారు. ఆ విషయాన్ని మీడియా సాక్షిగా ప్రకటించారు. పనిలో పనిగా చినబాబు లోకేష్ ని పాదయాత్రకు ముందే కలిశారు. ఆ తరువాత పాదయాత్రలో కూడా కలసి వచ్చారు. చంద్రబాబు ఈ మధ్యలో రెండు సార్లు వస్తే ఆయన్ని ఘన స్వాగతం పలికారు. నవ్యాంధ్ర నిర్మాత అంటూ కీర్తించారు.

అయితే చంద్రబాబు మాత్రం గంటా విషయంలో పూర్వం మాదిరిగా దగ్గరకు తీయడం లేదా అన్న చర్చ సాగుతోంది. గంటా వర్సెస్ అయ్యన్నపాత్రుడు అన్నది విశాఖ జిల్లా టీడీపీలో చాలా కాలంగా నడుస్తున్న వ్యవహరమే. గంటాకి పెద్ద పీట వేస్తే అయ్యన్న వర్గం గుస్సా అయ్యే ప్రమాదం ఉంది. విశాఖలో జరిగిన ఉత్తరాంధ్రా టీడీపీ సదస్సులోనే ఆ విషయాన్ని చంద్రబాబు గమనించి అయ్యన్నకు ఎక్కువ ప్రాధ్యాన్యత ఇచ్చారు.

ఇక అయ్యన్నపాత్రుడితో పాటు, విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామక్రిష్ణబాబు, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత సహా కీలక నాయకులు అంతా గంటాకు పార్టీలో పెద్ద పీట వేయకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇటీవల రాజమండ్రీలో జరిగిన మహానాడులో చూసుకున్నా గంటా వేదిక మీద వెనక సీటుకే పరిమితం అయిపోయారు.

మహనాడులో అయ్యన్న బ్యాచ్ సందడి చేసి తామే కీలకం అని గట్టిగా చెప్పుకుంది. జూనియర్ లీడర్స్ కూడా వేదిక మీద ముందు వరసల్లో ఉంటే గంటా వెనకనే ఉండిపోవడం ఆయన అభిమానులకు అనుచరులకు కొంత ఇబ్బంది కలిగించింది. ఇక చంద్రబాబు తీరు చూసిన గతానికి భిన్నంగా ఉంది అని అంటున్నారు. ఆయన పనిచేసే వారికే టికెట్లు అంటున్నారు. అలాగే పార్టీలో వారికే పెద్ద పీట అని స్పష్టం చేస్తున్నారు.

గంటా నాలుగేళ్ల పాటు టీడీపీలో పెద్దగా అలికిడి చేయకుండా సైలెంట్ గా గడిపేశారు. ఈ మధ్యలో ఆయన వైసీపీలోకి వెళ్తారని, జనసేనలోకి కూడా వెళ్తారని చర్చ నడచింది. అయితే తెలుగుదేశం అనూహ్యంగా పుంజుకోవడంతో గంటా టీడీపీలో ఉండాలని డిసైడ్ అయ్యారు. ఇదంతా టీడీపీలో మొదటి నుంచి యాక్టివ్ గా ఉన్న సీనియర్లు గమనిస్తూ పార్టీకి ప్రాణం పెట్టి పనిచేసిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని బాబుకు విన్నవించుకున్నారని అంటున్నారు]

ఇక గంటా కంటే కూడా విశాఖ సిటీలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యే గణబాబుకే చంద్రబాబు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ నెల 31న ఆయన కుమారుడి వివాహానికి చంద్రబాబు ప్రత్యేకంగా రాబోతున్నారు. ఇక ఈ మధ్య విశాఖ సిటీ టూర్ లో సైతం గణబాబుని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ఆయన బాగా పనిచేస్తున్నారు అని కితాబు ఇచ్చారు

ఈ పరిణామాల నేపధ్యంలో టీడీపీ మ్యానిఫేస్టో సూపర్ గా ఉందని వైసీపీ గుండెల్లో గుబులు పుట్టిస్తోందని గంటా శ్రీనివాసరావు మీడియా సమావేశం పెట్టి మరీ చంద్రబాబుని పొగిడారు. బాబు రావాలి ఏపీ బాగుపడాలి అంటూ ఆయన చెబుతున్నారు. జగన్ మీద గతం కంటే ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. అయితే ఎన్ని చేసినా గంటాకు తెలుగుదేశంలో గత ప్రాభవం దక్కేనా అన్న చర్చ అయితే ఉంది. గంటా ఈసారి కోరుకున్న సీటు దక్కుతుందా అన్నది కూడా మరో చర్చగా ఉంది.

ఏది ఏమైనా గంటాకు టీడీపీ అధినాయకత్వానికి గ్యాప్ 2018లో స్టార్ట్ అయింది. ఆయనకు వ్యతిరేకంగా టీడీపీ అనుకూల పత్రికలో కధనం రాయించారని అప్పట్లో గంటా అలిగారు. బాబు విశాఖ టూర్ కి దూరంగా ఉంటే బతిమాలి మరీ తీసుకుని వచ్చారు. అప్పట్లో లోకేష్ కి భీమిలీ సీటు కోసం గంటా మీద వ్యతిరేక కధనాలు రాశారని ఆయన అనుచరులు అనుమానించారు. అలా భీమిలీతో గంటాకు బంధం కట్ చేశారు. ఇపుడు మరోసారి ఆయన భీమిలీ మీదనే కన్నేశారు. చూడబోతే ఈసారి ఆ సీటు దక్కే అవకాశం లేదని పార్టీ వర్గాల మాటగా ఉంది.

టీడీపీ వర్గాల్లో ప్రచారంలో ఉన్న మరో విషయం ఏంటి అంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే మంత్రులుగా కొత్త వారికే చాన్స్ ఇస్తారని, మొత్తానికి గంటాకు టీడీపీలో పూర్వ వైభవం దక్కేనా అన్నది ఆలోచించాల్సిందే అంటున్నారు.