Begin typing your search above and press return to search.

బాబు అంటే పడి చచ్చే ఓటర్లకు అలా దెబ్బేశారా...?

By:  Tupaki Desk   |   31 May 2023 9:00 AM GMT
బాబు అంటే పడి చచ్చే ఓటర్లకు అలా దెబ్బేశారా...?
X
చంద్రబాబు రాజకీయాల్లో ఘటనా ఘటన సమర్ధుడు. ఆయన రాజకీయం అంతా ఎపుడూ తనది కాని వాటి మీదనే దృష్టి పెడుతుంది. అది చాణక్య నీతి కూడా. ఉన్నది ఎటూ ఉంటుంది లేని దాని మీదనే ఆలోచించమన్నది బాబు మార్క్ రాజనీతి. అయితే కొన్ని సార్లు ఉన్నది పోతుంది. కొత్తదీ అనుమానం అవుతుంది అన్న లెక్కలూ ఉన్నాయి.

ఇపుడు చంద్రబాబు కూడా అలాగే రెండు పడవలలో సవారీ చేస్తూ ఇబ్బంది పడిపోనున్నారా అన్నదే చర్చగా ఉంది. టీడీపీ అంటే ఎక్కువగా ఇష్టపడేది అర్బన్ ఓటర్లు. అది కూడా చంద్రబాబుకు మాత్రమే. ఆయన మామ, టీడీపీని స్థాపించిన ఎన్టీయార్ కి అర్బన్ ఓటర్లు కేవలం 1983 ఒక్క ఎన్నికల్లో మాత్రమే మద్దతు ఇచ్చారు.

ఆ తరువాత ఏడాదికే వారంతా దూరం అయ్యారు ఎన్టీయార్ ఎన్ని అద్భుత విజయాలు సాధించినా ఆయన వెనక రూరల్ ఓటర్లే బలంగా నిలబడ్డారు కానీ అర్బన్ ఓటర్లు అపుడు కాంగ్రెస్ కే జై కొట్టారు. వారే మధ్యతరగతి, ఉన్నత వర్గాలు అన్న మాట. చదువరులు, ఉద్యోగస్తులు మేధావులు అన్న వారు 1995 దాకా టీడీపీకి ఓటర్లే కాదు.

అలాంటి వారిని చంద్రబాబు తనదైన పాలనా సంస్కరణలతో పూర్తిగా తిప్పుకున్నారు. ఐటీ ఫీల్డ్ లో బాబు సాధించిన విజయాలు మధ్యతరగతి ఇళ్లలో లక్షల రూపాయల జీతాలను సంపాదించి పెట్టాయి. అలాగే బాబు మార్క్ సంస్కరణల వాదం కూడా పన్ను చెల్లింపు దారులకు అభివృద్ధి ఏంటో చూపించింది. ఒక విధంగా బాబు గుడ్ అడ్మినిస్ట్రేటర్ అనడానికి 1995 నుంచి 2004 మధ్య పాలన బెస్ట్ ఎగ్జాంపుల్ గా చూడాలి.

ఇక చంద్రబాబు ఓడాక మాత్రం సంస్కరణలు తీసి పక్కన పెట్టారు. 2014లో ఆయన ఉచితాలతో పధకాలను కొన్ని పెట్టారు. అయితే అప్పటికీ ఆయన మీద అర్బన్ ఓటర్లకు ఎంతో నమ్మకం ఉంది. విభజన ఏపీని కూడా అభివృద్ధి బాట పట్టించి మరో హైదరాబాద్ గా చేస్తారని. అందుకే మద్దతు ఇచ్చారు.

ఈ నేపధ్యంలో 2019లో బాబు ఓడిపోయారు. సంక్షేమ పధకాలు జగన్ని గెలిపించాయి. దాంతో వాటినే ఇపుడు బాబు గట్టిగా నమ్ముతున్నారు. అయితే జగన్ గత పాలకుల కంటే సంక్షేమాన్ని పీక్స్ కి చేర్చారన్న అపవాదు ఉంది. దాంతో అప్పులు ఏపీని ముంచెత్తనున్నాయన్న బాధతో చదువరులు అర్బన్ ఓటర్లు పూర్తిగా వైసీపీకి దూరం అయ్యారు.

వారంతా టీడీపీ వైపు పూర్తి స్థాయిలో మొగ్గు చూపుతున్నారు. వారిలో కసి ఎంతలా ఉందంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం క్యూలు కట్టి మరీ టీడీపీని గెలిపించేటంతలా. బాబు వస్తే తప్ప ఏపీ బాగుపడదు అన్న కచ్చితమైన భావన వారిలో ఉంది. ఇలాంటి వారికి ఎన్నికల షెడ్యూల్ రావడం ఆలస్యం బాబు సీఎం అవుతారు అన్నది బలమైన భావన.

నిజానికి అర్బన్ ఓటర్లలో అత్యధికులు ఓటింగ్ కి దూరంగా ఉంటారు. కానీ ఇపుడు ఏపీ పూర్తిగా ప్రమాదంలో పడిందనే వారు రోడ్ల మీదకు వచ్చారు. 2024లో వారంతా నూటికి నూరు శాతం తమ ఓటు హక్కుని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. దాంతో ఆ ఓటింగ్ కలిస్తే టీడీపీకి ఎదురులేని పరిస్థితి ఉంటుందని అంటున్నారు.

ఈ నేపధ్యంలో మహానాడు వేదికగా టీడీపీ అభివృద్ధి అజెండాను మ్యానిఫేస్ట్లో ఆవిష్కరిస్తుందని అంతా తలచారు. బాబు మార్క్ విజన్ ని మరోమారు చూడాలని ఆశపడ్డారు. కానీ వారి ఆశలను తల్లకిందులు చేస్తూ అంతా సంక్షేమం గానే బాబు ఎన్నికల ప్రణాళిక సాగింది. పైగా జగన్ ఒకటి ఇస్తే నేను నాలుగు అంటూ ఇంటింటికీ నగదు బదిలీ పథకం పేరిట దోచిపెట్టేందుకు టీడీపీ సిద్ధపడుతోంది అని అర్ధం అయింది.

దాంతో అర్బన్ ఓటర్లు పూర్తిగా ఖంగు తిన్నారు. చంద్రబాబు విజనరీ అనుకుంటే మళ్ళీ ఇదేమిటి అని కలవరపడుతున్నారు. ఏపీ అప్పులను తిప్పలను గట్టెకించే నేర్పరి తీర్పరిగా బాబుని చూసిన వారికి జగన్ చెప్పులో బాబు కాళ్ళు పెట్టడం చూసి ఫైర్ అవుతున్నారు. జగన్ లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ పధకాలు అయ్యాయని, వాటికి నాలుగు రెట్లు అంటే ఏపీ పరిస్థితి శ్రీలంక పాకిస్థాన్ కి డిటోగా మారుతుందన్న కలవరం అయితే బయల్దేరింది.

దీని బదులు అప్పులు తగ్గించి ఏపీని డెవలప్మెంట్ చేస్తాను అని బాబు ఒకే ఒక్క మాట ఇచ్చి ఉంటే సాలిడ్ గా ఈ సెక్షన్ల ఓట్లు అన్నీ పడేవి అని వారు అంటున్నారు. ఇపుడు జగన్ బాటలో బాబు నడిస్తే ఏపీకి దిక్కెవరు అన్న బాధ అయితే మేధావుల్లో కనిపిస్తోంది. ఖజానా దోచి పెట్టడానికే ప్రభుత్వాలు ఎన్నికలు అయితే అసలు ఓటేయడం ఎందుకు అన్న నిర్వేదం కూడా చాలా మందిలో కలుగుతోంది. బాబు ఎందుకు డేరింగ్ గా ఆలోచించలేకపోతున్నారు అన్నదే అర్బన్ ఓటర్ల వ్యధగా ఉంది. మొత్తానికి బాబు అంటే పడి చచ్చే ఆతి పెద్ద ఓటింగ్ సెక్షన్ కి షాక్ ఇచ్చేలా టీడీపీ మ్యానిఫేస్టో ఉందని అంటున్నారు.