Begin typing your search above and press return to search.

టీడీపీ మ్యానిఫేస్టోలో స్పష్టత లేదా...?

By:  Tupaki Desk   |   29 May 2023 9:00 PM GMT
టీడీపీ మ్యానిఫేస్టోలో స్పష్టత లేదా...?
X
ఏం తమ్ముళ్ళూ ఎలా ఉంది అదిరిపోయిందా లేదా అంటూ పదే పదే మహానాడు వేదిక మీద చంద్రబాబు నాయుడు ఎన్నికల మ్యానిఫేస్టో గురించి అడుగుతూ గొప్పగా ప్రకటించారు. అయితే తొలి విడతగా ప్రకటించిన ఎన్నికల మ్యానిఫేస్టో మీద జనాల్లో మిశ్రమ స్పందన వస్తోంది.

చంద్రబాబు లాంటి విజనరీ ఈ విధంగా నగదు బదిలీ పథకాలు వెంట పడడం ఏంటన్న హాట్ కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే ఎన్నికల రాజకీయాల్లో పడిన చంద్రబాబుకు పక్షి కన్ను లాంటి గెలుపు తప్ప మరేమీ కనిపించడంలేదు అని అంటున్నారు. అందుకే చంద్రబాబు ఇపుడు ఓట్లకు గేలం వేసే పధకాల మీదనే పడ్డారు అని అంటున్నారు.

అయితే ఓట్లు దండుకునేందుకు పధకాలను ప్రకటించడం బాగానే ఉన్నా మ్యానిఫేస్టోలో స్పష్టత ఉందా అన్నదే ఇపుడు చర్చకు వస్తున్న అంశం. పైగా ఏమీ చూసుకోకుండా ఏ లెక్కలు కూడా చెప్పకుండా వారికీ వీరికీ అందరికీ పధకాలు పంచుడే అని బాబు అనౌన్స్ చేశారు.

అక్కడ చాలా డౌట్లు వస్తున్నాయి. ఉదాహరణకు ఒక ఇంట్లో మహిళలు అందరికీ నెలకు పదిహేను వందలు అని చంద్రబాబు మహిళా శక్తి పధకం ద్వారా ప్రకటించారు. అయితే ఇక్కడ ఆయన స్పష్టంగా ఏదీ చెప్పలేదు. ఈ పధకాలు ఏపీలో ఉన్న కోట్లాది మహిళలు అందరికేనా లేక తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికేనా అన్నది ఎక్కడా తేల్చలేదు అని అంటున్నారు.

ఈ ఒక్క పధకమే కాదు యువగళం అంటూ యువకులకు ప్రకటించిన నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి తీసుకున్నా అందరికీ ఇస్తారా లేక తెలుపు రేషన్ కార్డు ఉండాలని ఒక నిబంధన విధిస్తారా అన్నది తెలియడంలేదు. మరో వైపు చూస్తే మహిళలకు జిల్లాలలో ఉచితంగా ఆర్టీసీ బస్సులలో తిరిగేందుకు అవకాశం ఇస్తామని కూడా చంద్రబాబు ప్రకటించారు.

ఇది కూడా అందరికీనా లేక వైట్ రేషన్ కార్డు ఉండాలా అన్నది ఎక్కడా చెప్పలేదు. రైతులకు ఏడాదికి ఇరవై వేలు అన్నారు. అది కూడా కేంద్రం ఇచ్చే కిసాన్ స్కీమ్ తో లింక్ పెడతారా లేక పూర్తిగా తానే మొత్తం చెల్లిస్తారా అన్నది చెప్పడంలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

ఇక్కడ ఒక మాట ఉంది. గతంలో అంటే 2014లో చంద్రబాబు అన్ని వర్గాలకు స్కీములను అమలు చేస్తామని దాదాపుగా ఆరు వందల హామీలు ఇచ్చారు. అందులో రైతులకు రుణ మాఫీ విషయంలో కూడా ఎన్నో కండిషన్లు చంద్రబాబు పెట్టి చివరికి పెద్దగా ఎవరికీ ఇవ్వలేదు అని ఉంది.

ఇపుడు కూడా అలా చెప్పకుండా కండిషన్లు అన్నీ గెలిచిన తరువాత పెడతారా అన్న చర్చ ఉంది. ఏది ఏమైనా రాజకీయ నాయకులు అందరికీ పధకాలు అని ఓట్ల ముందు చెబుతారు. తీరా చేతికి అధికారం వచ్చాక ఆ పధకానికే ముప్పయి మూడు షరతులు పెడతారు. ఇక చంద్రబాబు వంటి నాయకుడు పధకాలు ప్రకటించడం తో పాటు ఎవరికి వర్తిస్తుందో ముందుగా చెప్పి ఒక స్పష్టత ఇస్తే బాగుంటుందని అంటున్నారు. మరి అలా చేస్తాతా లేదా అనంది చూడాల్సి ఉంది.