Begin typing your search above and press return to search.

మిషన్ రాయలసీమ... పెద్ద టెండరే పెట్టేసిన లోకేష్

By:  Tupaki Desk   |   8 Jun 2023 1:00 PM GMT
మిషన్ రాయలసీమ... పెద్ద టెండరే పెట్టేసిన లోకేష్
X
నారా లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం కడప జిల్లాలో సాగుతోంది. అది జగన్ కంచుకోట కావడం విశేషం. లోకేష్ కేవలం పాదయాత్రతో సరిపెట్టడంలేదు. అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రత్యేకించి రాయలసీమలో పొలిటికల్ గా డామినేటింగ్ రోల్ ప్లే చేస్తున్న రెడ్డి సామాజికవర్గం మీద కూడా ఆయన టార్గెట్ చేశారు.

సీమ అభివృద్ధి ఎందుకు సాధించలేదు అని ప్రశ్నిస్తున్నారు. రాయలసీమ వెనకబాటుతనానికి ఇక్కడ ఓట్లు సీట్లు పొంది గెలిచిన వారిదే తప్పు అని లోకేష్ అంటున్నారు. తమకు 2019 ఎన్నికల్లో కేవలం మూడు సీట్లు మాత్రమే సీఎం ఇచ్చిందని, అయినా తాము సీమను తక్కువ చేసి చూడడం లేదని లోకేష్ అంటున్నారు.

సీఎం కన్నీరు తుడవడానికి తెలుగుదేశం ప్రయత్నం చేస్తోందని, మిషన్ రాయలసీమ పేరుతో భారీ కార్యక్రమాన్ని తమ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్, డిఫెన్స్, టూరిజం, మైనింగ్... ఈ ఐదింటిని ఫోకస్ గా అమలు చేస్తే సీమ అభివృద్ధిలో దూసుకుపోతుందని లోకేష్ అంటున్నారు. రాయలసీమ తమకు ఎపుడూ సీట్లూ ఓట్లు ఇవ్వడంలేదని, అయినా కానీ 2014లో టీడీపీ హయాంలో కియా మోటార్స్ సెల్ ఫోన్ కంపెనీ, మామిడి పంటలు గుర్తుకు వచ్చేలా చేస్తున్నామని లోకేష్ చెబుతున్నారు.

సీమ బిడ్డను అని తాను బిల్డప్ ఇవ్వకుండా అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తామని ప్రతీ ఇంటికీ మంచి నీరుతో పాటు ప్రతీ ఎకరాకు సాగు నీరు ఇస్తామని సీమను సస్యశ్యామలం చేస్తామని లోకేష్ అంటున్నారు. ఈసారి మీరంతా ఒక్క పని చేయండని అంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఇచ్చిన సీట్లను మాకు ఇవ్వండి అని లోకేష్ పెద్ద టెండరే పెట్టేశారు.

అంటే మొత్తం సీమలో ఉన్న 52 అసెంబ్లీ సీట్లలో 49 సీట్లు టీడీపీకి ఇమ్మంటున్నారు. ఈ సీట్లు గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చాయి. మొత్తానికి లోకేష్ రాయలసీమ మీద ఫుల్ ఫోకస్ పెట్టేసి వైసీపీ ఏమి చేసిందని నిలదీస్తున్నారు. మేము అయిదేళ్ళుగా ఎన్నో చేశామని అంతున్నారు.

మీరంతా మంచివారే, ఫ్రాక్షనిజం ఇక్కడ లేదు, మీకు ఉన్నది ఆత్మాభిమానం, నా పాదయాత్రలో అదే చూశాను, మీ గౌరవం తగ్గేలా టీడీపీ ఎపుడూ ప్రవర్తించదని లోకేష్ హామీ ఇచ్చారు. మిషన్ రాయలసీమ పేరుతో అయిదేళ్ళతో తమ ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాన్ని లోకేష్ తెలిపారు.

రాయలసీమ అంటే ఆత్మాభిమానానికి పెట్టింది పేరు అని కొనియాడారు. రెడ్లకు కూడా ఆఖరుకు మేలు చేయని వైసీపీ ప్రభుత్వం ఎందుకు అంటూ ఆయన ఫ్యాన్ పార్టీ గాలి తీసే ప్రయత్నం చేశారు. మొత్తం మీద చూస్తూంటే దశాబ్దాలు గడచినా సీమ రాత బాగుపడలేదు అని జనం అంటున్నారు.

ఏడుగురు ముఖ్యమంత్రులు సీమ నుంచి అయ్యారని ఆనందించాలో లేక చింతించాలో అర్ధం కావడంలేదు అంటున్నారు. చంద్రబాబు సీమ నుంచి సీఎం అయినా ఆయన కోస్తా అభివృద్ధికే ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. ఇపుడు లోకేష్ వచ్చి మిషన్ రాయలసీమ అంటూ ప్రయారిటీ మీకే అంటున్నారు. రెడ్లను సైతం దువ్వే ప్రయత్నం చేస్తున్నారు.

సీమలో పార్టీల కంటే వర్గాలే ఉంటాయి. అందువల్ల ఎవరు ఎన్ని చెప్పినా వర్గ పోరులో ఎవరు గెలిస్తే వారిదే రాజకీయం, రాజ్యాధికారం. అందువల్ల లోకేష్ మిషన్ రాయలసీమ ఎంతవరకూ వర్కౌట్ అవుతుంది అన్నది చూడాలని అంటున్నారు. ఒక్కటి మాత్రం ఇక్కడ నిజం. లోకేష్ రాయలసీమ పాదయాత్ర సందర్భంగా తన తండ్రి చంద్రబాబు చేయలేనిది చేస్తున్నారు అని అంటున్నారు.

చంద్రబాబు ఎంతసేపూ జగన్ మీద విమర్శలు చేస్తూ మీటింగ్స్ పెడుతూ ఉంటారు. లోకేష్ కూడా జగన్ని విమర్శించినా తమ పార్టీ వస్తే ఏమి చేస్తామని జాగ్రత్తగా రచ్చబండ వేదికగా పెడుతున్నారు. అలాగే ఎవరితోనైనా మాట్లాడేందుకు యువ నేత రెడీ అవుతున్నారు. ప్రతీ ప్రశ్నకు నిర్మొహమాటంగా జవాబు చెబుతున్నారు. లోకేష్ చేస్తున్న ఈ ప్రయత్నాల వల్ల్ల టీడీపీ ఎంతో కొంత సీమలో బలపడింది అన్న భావన కలుగుతోంది. అదే టైం లో రాయలసీమలో రెడ్లను దువ్వడం ద్వారా లోకేష్ వ్యూహాత్మకమైన ఎత్తుగడలక్లు తెర లేపారని అంటున్నారు.