Begin typing your search above and press return to search.

చచ్చేవరకు జగన్ తోనే... ఇక చాలా అంటున్న వైసీపీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   28 March 2023 3:00 PM
చచ్చేవరకు జగన్ తోనే... ఇక చాలా అంటున్న  వైసీపీ ఎమ్మెల్యే
X
జగన్ తోనే నా పయనం. ఆయనతోనే నా జీవితం. నా కడసారి ఊపిరి వరకూ ఆయనతోనే రాజకీయం కొనసాగిస్తాను. ఒకవేళ నేను చనిపోతే నా కుమారుడు రజత్ కుమార్ రెడ్డి సైతం జగన్ తోనే ఉంటాడు. ఇక చాలా అంటూ నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. తాను వైసీపీ వ్యవస్థాప సభ్యున్ని, పార్టీ పెట్టాక వైఎస్ విజయమ్మ తరువాత వచ్చిన రెండవ ఎమ్మెల్యేను అని ఆయన తన బంధాన్ని బలంగా చాటుకున్నారు.

మంత్రి పదవుల కోసమో మరో దాని కోసమో గీత దాటేసే నైజం తనది కాదన్నారు రాజకీయ కుటుంబం తమదని, విలువలు కలిగిన ఫ్యామిలీ నుంచి వచ్చానని ప్రసన్న చెప్పారు. తాను పార్టీ మారుతాను అని చెప్పడం చంద్రబాబు మార్క్ మైండ్ గేం అన్నారు. చంద్రబాబు ఈ విధంగా తనదైన శైలిలో తన అనుకూల మీడియాలో రాతలు రాయిస్తున్నారని మండిపడ్డారు.

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేశారని, వారు కూడా పార్టీ గుర్తుతో గెలిచి గోడ దాటారని ఆయన విమర్శించారు. జగన్ బొమ్మ ఉంటేనే వారి గెలుపు సాధ్యపడింది అన్నది గుర్తించాలని అన్నారు. నిజాయతీ లేకుండా పార్టీని వదిలేశారని విమర్శించారు.

తెలుగుదేశం తమ పార్టీలో ఏదో గందరగోళం సృష్టించాలని చూస్తోందని, అబద్ధాలనే పదే పదే ప్రచారం చేయడం ద్వారా నమ్మించాలని చూస్తోందని ఆయన దుయ్యబెట్టారు. చంద్రబాబుకు ఇలాంటివి అన్నీ అలవాటే అని ఆయన అంటున్నారు. ఇక జగన్ విషయానికి వస్తే పార్టీ నాయకులను ఎమ్మెల్యేలను అందరినీ ఆయన గౌరవిస్తున్నారని అన్నారు.

తన నియోజకవర్గంలో సమస్యలను తాను జగన్ తో చెప్పి పరిష్కరించుకుంటూ వస్తున్నాని అని చెప్పారు. తనకు ఏ బాధా లేదు, ఏ రకమైన సమస్య అంతకంటే లేదని ప్రసన్న అంటున్నారు. తాను వైసీపీలోనే ఉంటాను, చనిపోయేంతవరకూ అదే జెండా తనదని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా ప్రసన్న కుమార్ రెడ్డి మంత్రి పదవి దక్కలేదన్న బాధతో ఉన్నారని ప్రచారం అయితే ఉంది. అలాగే ఆయన కోవూరు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి బాలెదని అంటున్నారు. దీంతో జగన్ అక్కడ ప్రసన్నకు ఈసారి టికెట్ ఇవ్వకపోవచ్చు అన్న చర్చ నడుస్తోంది.

అందుకే దానికి కూడా ప్రసన్న బదులిచ్చారు. తనకు టికెట్ ఇవ్వకపోయినా వేరే వారికి ఇచ్చినా తానే దగ్గర ఉండి వైసీపీని గెలిపిస్తాను అని. అయితే మాటల వరకూ ఓకే అనుకున్నా ఇంతటి విశాల హృదయం రాజకీయాల్లో ఉంటుందా అనేది చూడాలి. ఇక ప్రసన్న చచ్చేంతవరకూ వైసీపీతోనే అని అన్నారు.

ఆయన కంటే ముందు అదే నెల్లూరు జిల్లాకు చెందిన రూరల్ ఎమ్మెల్యే, జగన్ భక్తుడు, వీర విధేయుడు అయిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే తాను చస్తే వైసీపీ జెండాయే తన భౌతిక కాయానికి కప్పాలని ఇంతకంటే పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చారని ఇంకొందరు గుర్తు చేస్తున్నారు. సీన్ కట్ చేస్తే ఆయన ఇపుడు టీడీపీ కండువా కపుకోవడానికి రెడీ అవుతున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీలో ఒక గందరగోళం నిజంగా ఉందా లేక టీడీపీ ప్రచారం చేస్తోందా అన్నది మాత్రం తెలియడంలేదు. ఏది ఏమైనా కానీ ఇలా ఎంతమంది సంజాయిషీలు ఇచ్చుకుంటారో చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.