జగన్ జిల్లాలో చంద్రబాబుకు సమస్యగా ఆ నియోజకవర్గం!

Tue Jan 24 2023 18:00:01 GMT+0530 (India Standard Time)

Mydukuru constituency has become a big problem for Chandrababu

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని ఆశిస్తున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు. ఇందులో భాగంగా జనవరి 27 నుంచి నారా లోకేష్ పాదయాత్ర కూడా చేస్తున్నారు. మొత్తం 400 రోజులపాటు 4 వేల కిలోమీటర్లు ఆయన పాదయాత్ర సాగుతుంది.మరోవైపు రాయలసీమలో అందులోనూ కడప జిల్లాలో ఎలాగైనా ఆధిపత్యం సాధించాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2014 2019 ఎన్నికల్లో వైసీపీ ఈ జిల్లాలో అన్ని సీట్లనూ తుడిచిపెట్టేసింది. 2014లో ఒక్క రాజంపేటలో మాత్రమే వైసీపీ ఓడిపోయింది.

ఈ నేపథ్యంలో తమకు కొరకరాని కొయ్యగా మారిన కడప జిల్లాపై చంద్రబాబు దృష్టి సారించారు. గట్టి అభ్యర్థుల ఎంపికపై ఇప్పటి నుంచే దృష్టి సారించారు. ఈ క్రమంలో మైదుకూరు నియోజకవర్గం చంద్రబాబుకు పెద్ద సమస్యగా మారిందంటున్నారు.

మైదుకూరులో టీడీపీ టికెట్ కోసం ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరూ గట్టి అభ్యర్థులే కావడంతో ఎవరిని ఎంచుకోవాలో తెలియని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు టికెట్ ను ఆశిస్తున్నారు.

డీఎల్ రవీంద్రారెడ్డి సీనియర్ రాజకీయ నేతగా ఉన్నారు. మైదుకూరు నుంచి 1978 1983 1989 1994 2004 2009ల్లో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా కూడా పనిచేశారు. ఐదుసార్లు కాంగ్రెస్ నుంచి గెలిచిన డీఎల్ రవీంద్రారెడ్డి ఒకసారి ఇండిపెండెంట్ గా విజయం సాధించారు. 2014 2019ల్లో రవీంద్రారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయలేదు.

మరోవైపు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న శెట్టిపల్లి రఘురామిరెడ్డి కూడా సీనియర్ రాజకీయ నేతే. 1985లో ఆయన తొలిసారి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లోనూ టీడీపీ నుంచే గెలుపొందారు. 2014 2019ల్లో మాత్రం వైసీపీ నుంచి రఘురామిరెడ్డి విజయం సాధించారు. 1978 నుంచి రవీంద్రారెడ్డి రఘురామిరెడ్డిలే మైదుకూరు ఎమ్మెల్యేలుగా ఉండటం గమనార్హం.

ప్రస్తుతం మైదుకూరు ఇంచార్జ్‌గా టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. 2014 2019లో సుధాకర్ కు చంద్రబాబు టికెట్ ఇచ్చినా గెలవలేకపోయారు. వరుసగా రెండుసార్లు ఓడిపోయినవారికి ఈసారి టికెట్ ఇవ్వకూడదని టీడీపీ నిర్ణయించినట్టు ఇటీవల ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో పుట్టా సుధాకర్ యాదవ్ కు సీటు లభించకపోవచ్చని అంటున్నారు. మరోవైపు ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట నుంచి లోక్ సభకు పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో డీఎల్ రవీంద్రారెడ్డికి ఇస్తే టీడీపీ విజయం సాధించే అవకాశం ఉందని అంటున్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ కు టికెట్ ఇస్తే మాత్రం మరోసారి వైసీపీ గెలుపొందడం ఖాయమని చెబుతున్నారు. ప్రస్తుతం డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో ఉన్నారు. ఇటీవల వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి డీఎల్ ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో డీఎల్ రవీంద్రారెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించి సీటు ఇవ్వాలా? లేదంటే పుట్టా సుధాకర్ యాదవ్ కు సీటు ఇవ్వాలా అనే విషయంలో చంద్రబాబు డైలమాలో ఉన్నారని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.