చంద్రబాబుకు కేంద్రం ఆహ్వానం.. అసలు వాస్తవం ఇది!

Thu Nov 24 2022 14:00:01 GMT+0530 (India Standard Time)

Modi Invitation to Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ ఆహ్వానంపై టీడీపీ అనుకూల మీడియా పొంగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కలసి పోటీ చేయడానికి ఈ ఆహ్వానం అక్కరకు వస్తుందని.. ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ కానున్నారని టీడీపీ అనుకూల మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది.మరోవైపు చంద్రబాబుకు కేంద్రం ఆహ్వానం పంపడంపై వైసీపీ అనుకూల మీడియా కాస్తంత నైరాశ్యంలో ఉంది. తాము కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చెబుతున్నా చేస్తున్నప్పటికీ టీడీపీ అధినేతకు కేంద్రం ఆహ్వానం పంపడం ఏమిటనే దుగ్ధ వైసీపీలో కనిపిస్తోందని అంటున్నారు.

అయితే అటు టీడీపీ ఇటు వైసీపీ చంకలు గుద్దుకోవడానికి బాధపడటానికి అక్కడ ఏమీ లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. డిసెంబర్ 5న ఢిల్లీలో జరిగే సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపిందని చెబుతున్నారు. ఈ ఆహ్వానాలు కూడా ప్రధానమంత్రి మోడీ పంపలేదని గుర్తు చేస్తున్నారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ ఆహ్వానాలు పంపారని.. చంద్రబాబుతోపాటు ప్రతి రాజకీయ పార్టీ అధినేత ఈ ఆహ్వానాలు వెళ్లాయని అంటున్నారు.

డిసెంబర్ 5న ఢిల్లీలో జరగబోయే సమావేశంలో జీ-20 దేశాల సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై చర్చించడానికి కేంద్రం రాజకీయ పార్టీలతో భేటీ ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. అంతేతప్ప ఇందులో ఏ విశేషం లేదని అంటున్నారు. ప్రస్తుతం జీ-20 కూటమికి ప్రధానమంత్రి మోడీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇటీవల ఇండోనేసియాలో జరిగిన జీ-20 దేశాల సమావేశంలో ఆ దేశాధ్యక్షుడి నుంచి ప్రధాని మోడీ ఈ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

ఈసారి జీ-20 సమావేశాలు భారత్‌లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సమావేశాల్లో భారత్ వైఖరి ఎలా ఉండాలో చర్చించడానికే కేంద్రం ఈ సమావేశం ఏర్పాటు చేసిందని అంటున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీనే చంద్రబాబును ఆహ్వానించినట్టు టీడీపీ అనుకూల మీడియా చెప్పుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. గతంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నేతలను ప్రధాని మోడీ కలుసుకున్నప్పుడు ప్రధాని.. చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా పలకరించినప్పుడు కూడా టీడీపీ అనుకూల మీడియా దాన్ని చిలవలు పలువలు చేసిందని గుర్తు చేస్తున్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.