మరెవరికి దక్కని లక్ మంత్రి తలసాని సొంతం

Thu May 26 2022 10:11:22 GMT+0530 (IST)

Minister Talasani is so Lucky

సుడి అందరి సొంతం కాదు. కొందరికి మాత్రమే వద్దనుకున్నా వస్తూనే ఉంటుంది. అలాంటి మహా సుడిగాడిగా గులాబీ పార్టీలో పేరున్న నేత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. టీఆర్ఎస్ చరిత్రను..ఆ పార్టీ అధినేత కేసీఆర్ గతాన్ని చూస్తే.. ఏ నేతను ఆయన తనకు అత్యంత సన్నిహితంగా ఉంచుకోవటం కనిపించదు. ఎంతటి నేతను అయినా సరే..కొంతకాలం తర్వాత దూరంగా పెట్టేయటం కనిపిస్తూ ఉంటుంది.ఉద్యమ సమయం నుంచి చూస్తే.. ఎంతో మంది నేతలు కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా రావటం.. తిరిగి వెళ్లటం కనిపిస్తూ ఉంటుంది. విచిత్రమైన విషయం ఏమంటే.. కేసీఆర్ నుంచి విడిపోయిన తర్వాత ఏ నేత కూడా మంచి ఛరిష్మా ఉన్న నేతగా మిగల్లేదు. అందుకే కేసీఆర్ కు మరీ సన్నిహితంగా ఉన్నా సమస్యే అంటూ కొందరు టీఆర్ఎస్ నేతల నోట ప్రైవేటు సంభాషణల్లో వినిపిస్తూ ఉంటుంది. తెలంగాణ ఉద్యమం నుంచి ప్రత్యేక రాష్ట్రం గురించి సానుకూలంగా ఎప్పుడూ మాట్లాడని తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీలో ఉండేవారు.

ఆ సందర్భంగా చంద్రబాబుకున అండగా నిలిచిన ఆయన.. 2014 ఎన్నికల అనంతరం అనూహ్యంగా టీఆర్ఎస్ లోకి ఎంట్రీ ఇవ్వటం.. పార్టీ చేరటంతోనే మంత్రి పదవి దక్కించుకున్న ఆయన.. గులాబీ బాస్ కు అత్యంత సన్నిహితంగా ఉండటం తెలిసిందే.

పార్టీలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రగతి భవన్ కు వెళ్లి.. నేరుగా ఇంటికి వెళ్లే అతి కొద్ది మందిలో తలసాని ఒకరుగా చెబుతుంటారు. గులాబీ నేతకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించే తలసాని విషయంలో సీఎం కేసీఆర్ మిగిలిన వారికి కాస్తంత భిన్నంగా వ్యవహరిస్తూ.. ఆయనకు ప్రాధాన్యతను ఇవ్వటం కనిపిస్తుంది.

కేంద్రంతో తనకున్న పంచాయితీ నేపథ్యంలో.. దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తున్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయనకు స్వాగతం పలికే అవకాశాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఇవ్వటంతెలిసిందే. గతంలో శంషాబాద్ లో జీయర్ స్వామి నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మోడీకి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలికే అవకాశం తలసానికి దక్కింది. తాజాగా ఐఎస్ బీలో జరిగే స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న మోడీకి స్వాగతం పలికే ఛాన్సును మరోసారి తలసానికే ఇచ్చారు సీఎం కేసీఆర్.

ప్రధాని మోడీని కలిసేందుకు ఇష్టపడని గులాబీ బాస్.. తన దారిన తాను బెంగళూరుకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి స్వాగతం పలికే బాధ్యతను మంత్రి తలసానికి అప్పజెబుతూ నిర్ణయం తీసుకున్నారు. నెలల వ్యవధిలో దేశ ప్రధాని మోడీ రాష్ట్రానికి రెండుసార్లు రావటం.. అలా వచ్చిన రెండుసార్లు ఆయనకు స్వాగతం పలికే అవకాశం మంత్రి తలసాని సొంతం చేసుకోవటం నిజంగా ఆయన సుడిగా పలువురు అభవర్ణిస్తున్నారు. తలసానా మజాకానా?