లోకేష్ పాదయాత్రకు ఎట్టకేలకు అనుమతి.. అయితే ఆ ఒక్కటీ పాటించాల్సిందే!

Mon Jan 23 2023 15:34:07 GMT+0530 (India Standard Time)

Lokesh Padayatra is finally allowed

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో ఏపీలో చేపట్టనున్న పాదయాత్రపై ప్రస్తుతం అందరి దృష్టీ నెలకొంది. మరో నాలుగు రోజుల్లో అంటే జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుకానుంది. టీడీపీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం వరకు లోకేష్ పాదయాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో జనవరి 27న కుప్పంలో పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి అటు నారా ఇటు నందమూరి కుటుంబాలు మొత్తం హాజరవుతాయని చెబుతున్నారు. దివంగత సీఎం ఎన్టీఆర్ కుమారులు కుమార్తెలు వారి సంతానమంతా వస్తారని అంటున్నారు.400 రోజులపాటు 4 వేల కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగనుంది. మొత్తం 125 నియోజకవర్గాలను కవర్ చేస్తూ సాగేలా ఇప్పటికే రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో తన తండ్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర మొదలు కానుంది.

ఈ నేపథ్యంలో జనవరి 23న లోకేష్ జన్మదినం కావడంతో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నాయి. సోషల్ మీడియాలో #happybirthdaylokesh అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అలాగే మరో నాలుగు రోజుల్లో లోకేష్ పాదయాత్ర మొదలు కానున్న క్రమంలో యువగళం పేరుతో ప్రచార చిత్రాలు టీజర్లు ట్రైలర్లను అభిమానులు రూపొందించి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నారు. అన్నదానాలు వస్త్రదానాల పంపిణీ చేపట్టారు. పలుచోట్ల అన్న క్యాంటీన్లను టీడీపీ నేతలు ప్రారంభించారు.

కాగా లోకేష్ పాదయాత్రకు ఎట్టకేలకు అనుమతి లభించింది. నిబంధనలకు లోబడి పాదయాత్ర సాగాలని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి షరతులు విధించారు. పాదయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. దీంతో పాదయాత్రకు నారా లోకేష్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

జనవరి 27న నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఆయన షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా జనవరి 25వ తేదీ మధ్నాహ్నం ఎన్టీఆర్ ఘాట్ లో తాత ఎన్టీఆర్ సమాధికి లోకేష్ నివాళి అర్పిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి కడప వెళ్తారు. అక్కడ అమీన్ పీర్ దర్గాను దర్శించుకుంటారు. అనంతరం కడపలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

జనవరి 25 రాత్రికి తిరుమల చేరుకుంటారు. రాత్రి అక్కడే నిద్ర చేసి 26వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. జనవరి 26 ఉదయం 10.30 గంటలకు తిరుమల నుంచి బయల్దేరి రోడ్డు మార్గంలో కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు వెళ్తారు. 26వ తేదీ సాయంత్రంగా నారా నందమూరి కుటుంబ సభ్యులు కుప్పం వస్తారని తెలుస్తోంది. 27వ తేదీ నందమూరి నారా కుటుంబాల ఆశీస్సులు తీసుకున్నాక కుప్పం నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమవుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.