Begin typing your search above and press return to search.

ఎన్టీయార్ డిస్కవరీ : ఎందరో మహా నాయకులు అయ్యారు!

By:  Tupaki Desk   |   28 May 2023 5:39 PM GMT
ఎన్టీయార్ డిస్కవరీ : ఎందరో మహా నాయకులు అయ్యారు!
X
ఆయన చేతి మహిమ అనుకోవాలి. ఆయన ముందు చూపు అనుకోవాలి. ఆయన డిస్కవరిగా చెప్పుకోవాలి. అతి సామాన్యులను రాజకీయాల్లోకి తెచ్చి అసమాన ప్రతిభావంతులను చేశారు. అలా చూసుకుంటే మొదటి పేరు కేసీయార్ ది అవుతుంది. ఆయన కాంగ్రెస్ సిద్దిపేటలో యువజన నాయకుడిగా ఉండేవారు. ఎన్టీయార్ టీడీపీని ప్రకటించడంతో చేరిన కేసీయార్ కి సిద్ధిపేట టికెట్ అన్న గారు ఇచ్చారు. ఆయన 1983లో ఓడినా 1985, 1989లలో గెలిచారు.

అలా ఆయన ఎన్టీయార్, చంద్రబాబు మంత్రివర్గాలలో మంత్రిగా పనిచేశారు. ఉప సభాపతిగా పనిచేసి ఆ తరువాత కాలంలో తెలంగాణా ఉద్యమంలోకి దిగారు. టీయారెస్ ఏర్పాటు చేసి పోరాడి తెలంగాణ సాధించారు. అలా 2014 నుంచి నేటి వరకూ సీఎం గా ఉంటున్నారు. ఆ మధ్యలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.

ఇక మరో నేత పేరు చెప్పుకుంటే కుందూరు జానారెడ్డి. ఆయన 1978లో జేఎస్పీ తరఫున చలకుర్తిలో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత టీడీపీలో చేరారు. 1983, 1985లలో గెలుపొందారు. మంత్రి పదవులు నిర్వహించారు. 1988లో టీడీపీ నుంచి బయటకు వచ్చారు. తెలుగు మహానాడు ఏర్పాటు చేశారు. దాన్ని కాంగ్రెస్ లో అనంతర కాలంలో విలీనం చేసి కాంగ్రెస్ నుంచి అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవులు చేపట్టారు.

మహిళా నేతగా రేణుకా చౌదరి గురించి చెప్పుకోవాలి. ఆమె ఎన్టీయార్ ని 1984లో వెన్నుపోటు పొడిచి దించేస్తున్నపుడు హైదరాబాద్లో గర్భిణీగా ఉంటూ రోడ్ల మీదకు వచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడారు. ఆమె పోరాట పటిమను చూసిన ఎన్టీయార్ 1986లో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చి కార్పోరేటర్ గా గెలిపించారు. ఆమెను ఆ తరువాత రెండు సార్లు రాజ్య సభ మెంబర్ ని చేశారు. రేణుక దేవేగౌడ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1998లో కాంగ్రెస్ లో చేరిన ఆమె యూపీయే ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా మరోసారి పనిచేశారు. ఈ రోజుకీ ధీటైన నాయకురాలిగా ఉన్నారు.

ఇక మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీయార్ తోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1983లో టీడీపీ నుంచి గెలిచి ఎన్టీయార్ ప్రభుత్వంలో మంత్రి పదవులు నిర్వహించారు. అలాగే దేవేందర్ గౌడ్ 1987లో రంగారెడ్డి జెడ్పీ చైర్మన్ గా చేశారు. 1995లో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కీలకమైన మంత్రి పదవులు ఎన్టీయార్ చంద్రబాబు మంత్రివర్గాలలో చేశారు. హోం మంత్రిగా ఆయన చేయడం విశేషం. అలాగే ఎంపీగా కూడా పనిచేశారు.

గుంటూరు జిల్లాకు చెందిన ఒక డాక్టర్ కోడెల శివప్రసాద్ ని మంచి లీడర్ గా చేసిన ఘనత ఎన్టీయార్ దే. ఆయనను రాజకీయాల్లోకి ఆహ్వానించి టికెట్ ఇచ్చారు. 1983 నుచ్ని 1999 వరకూ అయిదు సార్లు నరసారావుపేట నుంచి అయిదు సార్లు కోడెల ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవులు కూడా ఎన్టీయార్ చంద్రబాబు మంత్రి వర్గాలలో చేపట్టారు.

అలాగే చూసుకుంటే జీఎంసీ బాలయోగి. ఆయన కాకినాడలో లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన్ని కోరి తెచ్చి మరీ తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్టీయార్ చేశారు. ఆ తరువాత 1991లో అమలాపురం నుంచి ఎంపీగా టికెట్ ఇచ్చ్ పార్లమెంట్ కి పంపించారు. 1996లో ఎంపీగా ఓడినా ఆ తరువాత ముమ్మిడివరం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 1998లో మళ్లీ ఎంపీగా గెలిచి 12వ లోక్ సభకు స్పీకర్ గా పనిచేశారు అంటే అన్న గారి చలువే అదంతా అని చెప్పాలి.

ఇదే తీరున లాయర్ గా ఉన్న యనమల రామక్రిష్ణుడికి, వ్యాపారం చేసుకుంటున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరికి, విశాఖ నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడికి, శ్రీకాకుళం నుంచి కింజరాపు ఎర్రన్నాయుడుకు జనతా పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయినా రాజకీయంగా పూసపాటి అశోక్ గజపతిరాజుకు టీడీపీ ద్వారా ఎన్నో ఉన్నత పదవులు ఇచ్చిన ఘనత ఎన్టీయార్ కే దక్కుతుంది. ఆయన సోదరుడు పూసపాటి అశోక్ గజపతిరాజుకు కూడా మంత్రిని చేశారు ఎన్టీయార్.

అదే తీరున శ్రీకాకుళం జిల్లా నుంచి కావలి ప్రతిభాభారతి, గోదావరి జిల్లాల నుంచి చిక్కాల రామచంద్రరావు, ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న ఎన్ తులసీరెడ్డి, తెలంగాణాకు చెందిన మాధవరెడ్డి, అనంతపురానికి చెందిన ఎస్ రామచంద్రారెడ్డి వంటి వారిని రాజకీయంగా ఉన్నత స్థానాలకు చేర్చిన ఎన్టీయార్ నిజంగా మహానుభావుడు అనే చెప్పాలి. ఆయన ఒక వట వృక్షం. ఆయన ఒక రాజకీయ విశ్వవిద్యాలయం అని కూడా చెప్పాలి.