వైసీపీకి నెల్లూరు పెద్దారెడ్లు మరో షాక్.. టీడీపీలోకి రెబల్ ఎమ్మెల్యే తమ్ముడు!

Fri Mar 24 2023 11:00:01 GMT+0530 (India Standard Time)

Kotamreddy Giridhar Reddy Joined TDP

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో తన సొంత ప్రభుత్వంపైనే నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తన కోటరీలోని బోరుగడ్డ అనిల్ వంటివారితో తనను తన తమ్ముడిని చంపుతామని బెదిరిస్తున్నారని.. వీటికి తాను భయపడబోనని కోటంరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దీంతో వైసీపీ అధిష్టానం ఆయనను నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జిగా తప్పించింది. అంతేకాకుండా ఆయనకున్న భద్రతను కూడా కుదించింది.మరోవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని నెల్లూరు రూరల్ వైసీపీ ఇంచార్జిగా నియమిస్తోందని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని వైసీపీ తరఫున బరిలోకి దించుతారని చెప్పుకున్నారు.

అయితే గిరిధర్ రెడ్డి వైసీపీ అధిష్టానం మాయలో పడలేదు. తన సోదరుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితోనే నడవాలని నిర్ణయించుకున్నారు. దీంతో నెల్లూరు రూరల్ వైసీపీ ఇంచార్జిగా వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది.

కొద్దిరోజులుగా వైసీపీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించింది. అంతేకాకుండా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ ఆయనను వైసీపీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

మరోవైపు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.. తన అన్న శ్రీధర్ రెడ్డి తిరుగుబాటు నుంచి ఆయనతోనే ఉంటున్నారు. ఇంకోవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి టీడీపీలో చేరాలని ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే ఆయన తన మనసులో మాటను బయటపెట్టారు. అంతా అనుకున్నట్టు జరిగితే 2024లో టీడీపీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేయడం ఖాయమని చెబుతున్నారు.

అయితే ఈలోపు తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని టీడీపీలో చేర్చుతున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైంది. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో గిరిధర్ రెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నారు.

తాజాగా జరిగిన ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటేశారని చెబుతున్నారు. ఇందుకు తగ్గట్టే అనురాధ గెలిచారని ప్రకటించగానే శ్రీధర్ రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డి నెల్లూరులోని తమ కార్యాలయం ముందు బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు.

కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరికను పురస్కరించుకుని నగరంలో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. చంద్రబాబు లోకేష్ ఫొటోలతో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం విశేషం. నెల్లూరు నుంచి భారీ ప్రదర్శనగా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి చేరుకుంటారని చెబుతున్నారు. గిరిధర్ రెడ్డితో పాటుగా మరికొందరు వైసీపీ నెల్లూరు ముఖ్య నేతలు కూడా టీడీపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది.

అయితే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరినా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం సస్పెండ్ అయ్యేవరకు వైసీపీలోనే ఉండి ఆ పార్టీపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసే ఉద్దేశంతోనే ఉన్నారని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ లో టీడీపీ సీటు ఇస్తే పోటీ చేస్తానని ఇప్పటికే తన మనసులో మాటను బయటపెట్టారు. దీంతో నెల్లూరు రాజకీయం రసకందాయంలో పడింది.

ప్రస్తుతం నెల్లూరు రూరల్ టీడీపీ నియోజకవర్గ ఇంచార్జిగా అబ్దుల్ అజీజ్ ఉన్నారు. నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా ఆయనే ఉన్నారు. గత ఎన్నికల్లో ఈయన కోటంరెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కోటంరెడ్డి టీడీపీలోకి వస్తుండటంతో అబ్దుల్ అజీజ్ కు ఈసారి కష్టమేనంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ వైపు చూస్తున్నారన్న టాక్ నడుస్తోంది.   నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.