Begin typing your search above and press return to search.

నాడు శీనయ్య సేన...నేడు కోటన్న సేన... నెల్లూరుతో పెట్టుకుంటే అంతేనా...?

By:  Tupaki Desk   |   6 Feb 2023 9:56 AM GMT
నాడు శీనయ్య సేన...నేడు కోటన్న సేన... నెల్లూరుతో పెట్టుకుంటే అంతేనా...?
X
నెల్లూరు జిల్లా రాజకీయంగా చైతన్యం కలిగినది. ఇక్కడ రాజకీయ నాయకులు ఆత్మ గౌరవం కోసం పోరాటాలు చేస్తారు. బలమైన నాయకుడిని ధిక్కరిస్తారు. తామేంటో చూపిస్తారు. ఎందాకైనా అని ఫైట్ చేస్తారు. ఇది చరిత్రలోనే ఉంది. నెల్లూరు గడ్డ మీద నుంచి సింహనాదం చేసిన వారు అంతా గెలిచారు నిలిచారు. వారిని రెచ్చగొట్టిన వారు తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఎంతటి ఘనమైన నాయకుడు ఎన్టీయార్ అయినా నెల్లూరు జిల్లా పంచాయతీతో పెట్టుకుని ఓడారు.

ఇలా ఎందుకు జరిగింది అంటే ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాలి. అప్పట్లో అంటే 1988లో నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి అని ఒక ఫైర్ బ్రాండ్ మంత్రి ఉండేవారు. ఆయనకు ఎన్టీయార్ ఎంతో ప్రయారిటీ ఇచ్చేవారు. అయితే శ్రీనివాసులురెడ్డిది దూకుడు స్వభావం. ఆయన తన అనుభవాన్ని తలచుకుని పెద్ద సీటు కోరుకుంటూ ఉండేవారు. ఎన్టీయార్ కూడా ఆయనకు అలాగే గౌరవం ఇచ్చేవారు.

అయితే ఎపుడైతే చంద్రబాబు తెలుగుదేశంలో ఎంట్రీ ఇచ్చారో నాటి నుంచి సీనియర్లకు కష్టాలు మొదలయ్యాయి. అలా నల్లపురెడ్డికి కూడా ఎసరు పెట్టడానికి పార్టీలోనే పావులు కదిపారు. ఆయనకు వ్యతిరేక వర్గాన్ని జిల్లాలో ప్రోత్సహించారు. పైగా నల్లపురెడ్డి మీద అవినీతి ఆరోపణలు కూడా చేయించారు. అవి నెల్లూరు టూర్ కి వెళ్ళిన ఎన్టీయార్ చెవిన పడేలా చేశారు. దాంతో ఆయన నల్లపురెడ్డి కోటలోనే టూర్ వేసి మరీ ఆయన మీద తనకు అనుమానం ఉంటున్నట్లుగా చాటి చెప్పారు. అలా తనకు జరిగిన అవమానాన్ని భరించలేక నల్లపురెడ్డి 1988లో తమ మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు.

ఆయన శీనయ్య సేన అన్న దాన్ని పెట్టి ఏపీ అంతటా తిరిగారు. ఎన్టీయార్ కి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఎన్టీయార్ ని ఎంతగానో నమ్మాను, జిల్లాలో పెద్దగా ఉన్న నన్ను అవమానించి తప్పించారు అంటూ ప్రతీ మీటింగులో జనాలతో చెప్పుకుని ఆవేదన చెందేవారు. తన అల్లుడు చంద్రబాబు కోసం ఎన్టీయార్ తన తలను పళ్లెంలో పెట్టి కానుకగా ఇచ్చారని తన మంత్రి పదవిని కోల్పోయిన తీరుని ఆయన ఉపమానాలతో చెబుతూ ఏపీ జనాల సానుభూతి పొందారు.

ఎన్టీయార్ నిజ స్వరూపం ఇదని, అక్కడ మంత్రులకు విలువ లేదని, ఎవరి మాట ఎన్టీయార్ వినరని తన సొంత అల్లుళ్ళ మాటనే వింటారని అందుకే తనను బయటకు నెట్టారని కూడా చెప్పుకుని విలపించారు. ఇలా శీనయ్య సేనతో వచ్చిన నల్లపురెడ్డి ఎన్టీయార్ 1989లో ఘోరంగా ఓడిపోవడానికి తనదైన శైలిలో పనిచేశారు అని చెప్పాలి. నల్లపురెడ్డి దెబ్బ అలా అబ్బా అనిపించేలా సాగింది అనే అంటారు. సీన్ కట్ చేస్తే ఇపుడు అదే నెల్లూరు నుంచి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకు వచ్చారు.

ఆయన కూడా జగన్ భక్తుడే. ఇపుడు తాను యుద్ధం చేస్తున్నాను అని అంటున్నారు. నమ్మినందుకు ఫలితం ఇదా అని వాపోతున్నారు. మరి ఏమి జరిగిందో జగన్ తో ఆయనకు ఎక్కడ చెడిందో దానికి జిల్లా నేతలు ఎంతవరకూ కారకులో తెలియదు కానీ కోటం రెడ్డి నిప్పులే చెరుగుతున్నారు. తాను ఎక్కడా తగ్గేది లేదు అంటున్నారు. నా ప్రాణం తీసినా నేను జంకేది లేదు అంటున్నారు. కోటం రెడ్డి ని ఆయన మాటలను చూస్తే 1988 నాటి నల్లపురెడ్డి మాటలు ఆ దూకుడు గుర్తుకురాక మానదు.

నాడు శీనయ్య సేన పేరిట ఏపీ అంతా తిరిగి ఎన్టీయార్ మొత్తం గ్లామర్ ని ఉఫ్ అని ఊదేసిన నల్లపురెడ్డి నెల్లూరుతో పెట్టుకుంటే ఇంతే ఇలాగే ఉంటుంది అనిపించారు. ఇపుడు కోటం రెడ్డి కూడా మాతో పెట్టుకోకు అంటున్నారు. ఇది ఆత్మ గౌరవ పోరాటం అంటున్నారు. అవమానం జరిగిన చోట తాను అసలు ఉండను అని అంటున్నారు.

చూడబోతే కోటం రెడ్డి సేన కూడా రెడీ అవుతున్నట్లుగా ఉంది. నెల్లూరు లో పుట్టిన అగ్గి ఏపీ అంతా విస్తరిస్తే మాత్రం గత చరిత్ర రిపీట్ అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. కోటం రెడ్డి అంటున్న మాటలకు బాహాటంగా మద్దతు ఇవ్వకపోయినా లోపల మాత్రం బాగానే అడుగుతున్నారు అని అనే వాళ్ళు వైసీపీలో ఎక్కువగానే ఉన్నారని అంటున్నరు. ఇది ఏదో నాటికి బయటపడితే మాత్రం నాటి శీనన్న సేనలా కోటన్న సేన ఏపీలో వైసీపీని దావానలంగా చుట్టు ముట్టే ప్రమాదం అయితే ఉంది మరి ఈ విషయంలో హై కమాండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది అన్న దాని మీదనే కోటన్న ఫైర్ ఆధారపడి ఉంటుంది అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.