ఈసారి దేవుడి స్క్రిప్ట్ లో టీడీపీకి నాలుగే... కొడాలి నాని షాకింగ్ కామెంట్స్

Wed Mar 29 2023 19:16:21 GMT+0530 (India Standard Time)

Kodali Nani's shocking comments

దేవుడి స్క్రిప్ట్ ప్రతీ సారీ ఒకేలా ఉండదు చంద్రబాబూ అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. 2019లో టీడీపీకి 23 వచ్చాయని వైసీపీకి 23 అంటూ తీసేసిన సినిమా మళ్లీ తీయాలని బాబు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆనాడు బాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొంటే దానికి ప్రతిఫలంగా 23 ఎమ్మెల్యే సీట్లు దక్కాయని సెటైర్లు వేశారు.ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటు గెలిచి దేవుడి స్క్రిప్ట్ ఇదీ అని బాబు చెప్పడమేంటని మండిపడ్డారు. నలుగురు ఎమ్మెల్యేలను ఈసారి కొన్న చంద్రబాబు 2024లో ఆ సీట్లకే పరిమితం అవుతారని అన్నారు. అది కదా కొత్త స్క్రిప్ట్ అని ఆయన అంటున్నారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీయార్  పెట్టిన రోజైన ఈ రోజు అంటే మార్చి 29నాడు  బాబు ఏకైక కుమారుడు లోకేష్  ఉన్న ఆ కాస్త ఎమ్మెల్సీ పదవీ కోల్పోయి మాజీ అయ్యాడని కొడాలి నాని గుర్తు చేశారు.

ఇది కదా తనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ఎన్టీఆర్ స్వయంగా రాసి అందించిన స్క్రిప్ట్ అని ఆయన ఎద్దేవా చేశారు. ఏపీలో టీడీపీకి హవా ఉందని చంద్రబాబు ఎలా చెప్పుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అతి పరిమితమైన సెక్షన్ వేసిన ఓట్లను మొత్తం ఎన్నికల్లో గెలుపుగా ఎలా చూపిస్తారని ఆయన ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో ఫలనా సెక్షన్ కే ఓట్లు అని ఏమీ ఉండదు కదా పల్లె పట్నం పట్టభద్రులు టీచర్లు ఉద్యోగులు సామాన్యులు పేదలు అంతా కలసి ఓట్లేస్తారు కదా అని ఆయన అంటున్నారు. ఏ టూ జెడ్ ప్రజలు పాలుపంచుకుని ఓట్లేసే ఎన్నికల్లో దమ్ముంటే చంద్రబాబు గెలిచి చూపించాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలుగుదేశం పెట్టిన ఎన్టీఆర్ హయాంలో ఒక స్వర్ణయుగంగా పాలించారని అన్నారు. ఎన్టీఆర్ మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఒకసారి మాత్రమే ఓడారని మిగిలిన రెండు సార్లు అద్భుతమైన విజయాలు అందుకున్నారని అలాగే ఎన్టీఆర్  మూడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే రెండు సార్లు ఎన్నికల్లో మెజారిటీ సీట్లను ఉమ్మడి ఏపీలో గెలిచి చూపించారని అన్నారు.

అదే చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ అయిదు సార్లు అసెంబ్లీ ఎన్నికలో పాలు పంచుకుంటే ఉమ్మడి ఏపీలో 1999లో వాజ్ పేయి దయతో గెలిచిందని 2004 2009లో ఓడిన బాబు విభజన ఏపీలో మోడీ దయతో మళ్లీ గెలిచారు. తెలంగాణాలో ఓడారని అన్నారు. 2018లో తెలంగాణాలో టీడీపీ భూస్తాపితం అయిపోగా 2019లో ఏపీలో కూడా ఘోరంగా ఓడిందని ఆయన విమర్శించారు.

ఇక ఏడు సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో బాబు నాయకత్వాన టీడీపీ పాల్గొంటే 1999లో ఒకే ఒక్కసారి 27 సీట్లతో మెజారిటీని సాధించింది తప్ప మిగిలిన అన్ని సార్లు తక్కువ ఎంపీ సీట్లు వచ్చాయని 2019లో అయితే కేవలం మూడు సీట్లు మాత్రమే వచ్చిన సంగతి ఎవరికి తెలియదు అని డేటా మొత్తం నాని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కుని బాబు ఆ పార్టీని నాశనం చేయడం తప్ప గెలిపించినది ఎపుడని నాని ప్రశ్నించారు.

ఎన్టీఆర్ దేవుడు సంక్షేమ పధకాలకు ఆద్యుడు అని అంటున్న చంద్రబాబు ఆయనకు ఎందుకు వెన్నుపోటు పొడిచారో చెప్పాలని నాని డిమాండ్ చేశారు. కనీసం 42వ పార్టీ ఆవిర్భావ వేళ అయినా తెలుగు జాతికి క్షమాపణలు చెప్పి ఎన్టీఆర్ కి చేసిన అన్యాయం మీద బాబు విచారిస్తే అంతకు మించిన ప్రాయశ్చిత్తం వేరేది లేదని నాని అంటున్నారు. మొత్తానికి దేవుడు ఎన్టీఆర్ కలసి 2024లో టీడీపీకి ఘోరమైన ఓటమిని అందించడమే అసలైన స్క్రిప్ట్ అంటున్నారు నాని. దీని మీద టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.