Begin typing your search above and press return to search.

మహానాడుకు టీడీపీ కీలక ఎంపీ డుమ్మా!

By:  Tupaki Desk   |   29 May 2023 3:00 PM GMT
మహానాడుకు టీడీపీ కీలక ఎంపీ డుమ్మా!
X
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ రెండు రోజులపాటు రాజమండ్రి సమీపాన వేమగిరిలో మహానాడు నిర్వహించింది. ఇందులో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు లక్షల సంఖ్యలో పాల్గొన్నారు.

అయితే.. గత కొంత కాలంగా టీడీపీ అధిష్టానంతో ఉప్పూనిప్పుగా వ్యవహరిస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని మాత్రం ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. విజయవాడ ఎంపీగా 2014, 2019 ఎన్నికల్లో వరుసగా కేశినాని నాని విజయం సాధించారు. అయితే 2019లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొద్ది కాలానికి పార్టీ అధిష్టానంపై ఘాటైన విమర్శలు చేస్తూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినాని నాని సోదరుడు కేశినేని చిన్నిని టీడీపీ అధిష్టానం బరిలో దించబోతోందని వార్తలు వచ్చాయి. ఇందుకు తగ్గట్టే కేశినేని చిన్ని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ నేతలతో భేటీలు నిర్వహించడంతోపాటు పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారు.

ఈ పరిణామాలపై ఇటీవల కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ టికెట్‌ తనకు ఇవ్వకపోయినా ఫరవాలేదని.. కేశినేని చిన్నికి మాత్రం ఇవ్వద్దని కోరారు. కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ లో ఉన్నవారికి టికెట్‌ ఇవ్వవద్దన్నారు.

అయితే టీడీపీ అధిష్టానం కేశినేని నానిని పట్టించుకోవడం మానేసింది. పార్టీ పరిస్థితి బాగోనప్పుడు.. వైసీపీ హవా బలంగా ఉన్నప్పుడు కేశినేని నాని టీడీపీని ఇరుకునపెట్టేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం, చంద్రబాబుపైన ధిక్కార స్వరం వినిపించడం పట్ల ఆ పార్టీ ఆగ్రహంతో ఉందని టాక్‌ నడిచింది.

ఈ నేపథ్యంలో కేశినేని నాని పార్టీ పరంగా చాలా ముఖ్య కార్యక్రమమైన మహానాడుకు డుమ్మా కొట్టారు. పోనీ పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి.. అందుకే రాలేదనుకోవడానికి లేదు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరగడం లేదు. అయినా కేశినేని నాని మహానాడుకు హాజరు కాలేదు.

అయితే ఊరంతా ఒకదారయితే ఉలిపికట్టెది ఒకదారి అన్నట్టు టీడీపీ నేతలంతా మహానాడులో ఉంటే కేశినేని నాని మాత్రం పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా పార్లమెంటులో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు అర్పించడానికి అనుమతించాలని లోక్‌ సభ స్పీకర్‌ ఓం ప్రకాష్‌ బిర్లాకు విన్నవించారు. ఈ మేరకు స్పీకర్‌ కు లేఖ రాశారు.

ఈ లేఖ మీడియాలో హల్చల్‌ చేసింది. దీంతో పార్టీ ముఖ్య కార్యక్రమమైన మహానాడుకు రాకుండా ఢిల్లీలో కేశినేని నాని చేసేదేమీటంటూ చర్చలు మొదలయ్యాయి. ఈ రకంగా కేశినేని నాని మీడియా అటెన్షన్‌ ను కోరుకుంటున్నారని చర్చ జరుగుతోంది.