Begin typing your search above and press return to search.

గోదారి మాట : పవన్ వినేది అదేనట...?

By:  Tupaki Desk   |   16 May 2022 8:37 AM GMT
గోదారి మాట : పవన్ వినేది అదేనట...?
X
గోదావరి జిల్లాలకు రాజకీయంగా కాదు, పర్యాటకంగా, సామాజికంగా, సినీరంగ పరంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. గోదావరి వాళ్లు చల్లగా ఉంటారని, వారి మనసులు నిండు కుండలని చెబుతారు. వారి ఆతీధ్యం అద్భుతం అని కూడా అంటారు. ఇక వారు మనసులో ఏదీ దాచుకోరు. గోదారమ్మ తరహాలోనే సంతోషం వస్తే పొంగిపోతారు. దుఖం వస్తే కూడా అంతే బాధ చూపిస్తారు.

ఇక రాజకీయంగా చైతన్యవంతమైన సీమలు గోదావరి జిల్లాలు. ఇక్కడ కనుక మార్పు వస్తే అది ఏపీ రాజకీయాలను మార్చేస్తుంది అన్నది సెంటిమెంట్. ఉమ్మడి ఏపీ నుంచి విభజన ఏపీ దాకా ఇదే తీరున కధ సాగుతూ వస్తోంది. ఇక గోదావరి జిల్లాలు ఈ రోజు మరిన్ని అయినా కూడా అంతా ఒక్కటే మాట. ఒక్కటే బాట.

గతసారి వైసీపీని నెత్తికెక్కించుకున్న ఈ జిల్లాలు ఇపుడు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకునే విధంగా ఆలోచన చేస్తున్నాయని అంటున్నారు. ఈసారి గోదావరి రాజకీయం అధికార వైసీపీకి షాక్ ఇస్తుందనే చెబుతున్నారు. మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఇక్కడ ఉన్నాయి. ఇవి 2014 ఎన్నికల్లో నూటికి తొంబై శాతం టీడీపీ పరం అయ్యాయి. ఇక 2019 ఎన్నికల్లో చూస్తే ఇవే జిల్లాలు వైసీపీకి పట్టం కట్టాయి.

కానీ 2024 ఎన్నికల్లో మాత్రం అలా జరిగే సీన్ లేనే లేదని అంటున్నారు. ఈ జిల్లాలలో జనసేనకు మంచి ఊపు కనిపిస్తోంది. అది లోకల్ బాడీ ఎన్నికలతోనే రుజువు అయింది. అయితే సొంతంగా పోటీ చేయడం కంటే పొత్తులనే ఈ జిల్లాల జనసేన నాయకులు ఎక్కువగా కోరుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాలకు గుండె కాయ లాంటి ఈ జిల్లాలు ఇపుడు పొత్తుల వైపే చూస్తున్నాయి. ఇక్కడ జనసేన రాక ముందు వరకూ టీడీపీకి గట్టి పట్టుంది.

జనసేన రావడంతో ఆ ఓటు కొంత అటుగా చీలింది. మరో వైపు చూస్తే వైసీపీకి కొన్ని ఓట్లు షిఫ్ట్ అయినా కూడా మెజారిటీ సెక్షన్ మాత్రం జనసేన టీడీపీ కాంబోనే ఇష్టపడుతున్నారు. అందుకే పొత్తులకే సై అని ఇక్కడ జనసేన నాయకులు చెబుతున్నారు. వీరి మాటలనే అధినాయకుడు పవన్ కళ్యాణ్ కూడా పట్టించుకుంటున్నారు అని అంటున్నారు.

ఇక చూడబోతే ఉత్తరాంధ్రా జిల్లాల నాయకులు కానీ గుంటూరు, క్రిష్ణ జిల్లాలు, రాయలసీమ వైపు నాయకులు కానీ టీడీపీతో పొత్తు కంటే సొంతంగా పోటీ చేయడం బెటర్ అని పార్టీకి సూచిస్తున్నారు. అయితే రాయలసీమలో జనసేనకు బలం తక్కువగా ఉంది. ఉత్తరాంధ్రాలో చూసుకుంటే విశాఖలో కొన్ని చోట్ల బాగా ఉన్న మొత్తంగా జనసేన పటిష్టంగా లేదు. గుంటూరు, క్రిష్ణా జిల్లాల్లో సైతం కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాలలో మాత్రమే జనసేన పుంజుకున్నా గెలుపు అవకాశాలు ఫిఫ్టీ ఫిఫ్టీ గానే ఉన్నాయి.

దాంతో సాలిడ్ ఓటు బ్యాంక్ ఉన్న గోదావరి జిల్లాల మాటలకే జనసేన అధినాయకత్వం పెద్ద పీట వేస్తోంది అని అంటున్నారు. పొత్తులు కనుక కుదిరితే ఇక్కడ ఉన్న 34 సీట్లలో తొంబై శాతం సీట్లు టీడీపీ జనసేనల పరం అవుతాయన్న లెక్కలు అయితే ఉన్నాయి. దాంతో పొత్తు పెట్టుకుని ఎక్కువగా గోదావరి జిల్లాలలో సీట్లనే కోరాలని కూడా ఆ పార్టీ భావిస్తోంది అంటున్నారు. మొత్తానికి జనసేన విషయం చూసుకుంటే గోదారి మాటే పార్టీలో బాగా చలామణీ అవుతోంది అంటున్నారు. మిగిలిన ప్రాంతాల వారికి పొత్తులు ఇష్టం లేకపోయినా గోదావరి జిల్లాల మాట విని తీరాల్సిన పరిస్థితులు అయితే గట్టిగా కనిపిస్తున్నాయని అంటున్నారు.