'కళ్యాణ కర్ణాటక'.. చంద్రబాబు-కేసీఆర్-జగన్ టార్గెట్ ఇదేనా?

Fri Mar 31 2023 13:02:24 GMT+0530 (India Standard Time)

Is Telugu Politicians Target on Kalyana Karnataka

కర్ణాటకలో కీలకమైన ప్రాంతాలు అనేకం ఉన్నాయి. మహారాష్ట్రతో సరిహద్దు ఉన్న ప్రాంతాలు.. ఏపీ తెలంగాణ బోర్డరు ప్రాంతాలు.. తమిళనాడు బోర్డర్గా ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో రెండు తెలుగు రాష్ట్రాలకు బోర్డరుగా ఉన్న కర్ణాటక జిల్లాలను కళ్యాణ కర్ణాటకగా పేర్కొంటారు. ఇక్కడ తెలుగు వారు ఎక్కు వగా ఉన్నారు. ఈ కళ్యాణ కర్ణాటకలో బీదర్ కలబురగి రాయ్చూర్ యాదగిరి బళ్లారి విజయనగర కొప్పళ్ జిల్లాలు అత్యంత కీలకం.ఈ ప్రాంతాల్లో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలకు వ్యాపార సంబంధం ఉన్న జిల్లాలు కూడా ఉన్నాయి. దీంతో ఇక్కడ తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల జోరు కూడా కనిపిస్తుంది.

అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. ఈ జిల్లాలను ప్రధానంగా చేసుకుని.. తెలుగు రాష్ట్రాల నుంచి నేతలు ప్రచారం కూడా నిర్వహిస్తుంటారు. రాయ్చూర్ బళ్లారి బీదర్ వంటి చోట్ల మన వారు ఎక్కువగా కూడా ఉన్నారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న కర్ణాటక ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్.. బీజేపీకి వ్యతిరేకంగా కళ్యాణ కర్ణాటకనే ఎంచుకున్నారని తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా.. అదేసమయంలో జేడీఎస్కు అనుకూలంగా ఆయన అక్కడ ప్రచారం చేయనున్నట్టు సమాచారం. గత 2018 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం.. ఇక్కడి కొన్ని జిల్లాల్లో.. బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అంతేకాదు.. కొందరు  ఎన్జీవోలను కూడా ఆయన కూడగట్టుకున్నారు.

ఈ మొత్తం జిల్లాల్లో 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో ప్రభావం చూపించగలిగితే.. మొత్తం 224 స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో అంతో ఇంతో ప్రభావం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కళ్యాణ కర్ణాటక ప్రాంతాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు.

ఈ దఫా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. బీజేపీని సమర్థించే పార్టీలుగా టీడీపీ వైసీపీ ఉండగా.. కేసీఆర్ ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కళ్యాణ కర్ణాటకలో ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారో చూడాలి.        


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.