Begin typing your search above and press return to search.

ఇంతకీ మోడీ జగన్ కి హెల్ప్ చేస్తున్నారా లేక...?

By:  Tupaki Desk   |   7 Dec 2022 3:03 AM GMT
ఇంతకీ మోడీ జగన్ కి హెల్ప్ చేస్తున్నారా లేక...?
X
ఏపీలో 2019 ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీ గెలిచింది. ఆ గెలుపు వెనక సవాలక్ష కారణాలు ఉన్నాయి. అందులో జగన్ వేవ్ అతి ముఖ్యమైనది. ఆయనను ఒక్కసారి అయినా సీఎం సీట్లో చూడాలనుకునే వారు వేసే ఓట్లే సునామీగా మారి టీడీపీని దెబ్బ తీసాయి. అదే సమయంలో వ్యూహకర్త, అధికారంలో ఉన్న చంద్రబాబును ఓడించడం బహు కష్టమన్నది వైసీపీకి తెలుసు. కానీ అది సాధ్యపడింది అంటే కేంద్రంలోని బీజేపీ తెర వెనక సాయం చేయబట్టే అంటారు.

టీడీపీ ఆర్ధిక మూలలను దెబ్బ తీయడం, ఆ పార్టీకి ఎవరూ సాయపడకుండా చేయడం వంటి అనేక విధానాల ద్వారా టీడీపీని దారుణంగా నష్టపరచారు అని ప్రచారంలో ఉంది. ఈసారి అలాంటివి జరగకూడదనే బాబు బీజేపీ మైత్రిని కోరుకుంటున్నారు. మరో వైపు గతసారి నూరు శాతం ఫలితాలు పొందిన వైసీపీ కూడా ఎన్నికల వేళ కేంద్రంతో సాన్నిహిత్యంగా ఉంటే కలిగే లాభాలు ఏంటో బాగా గుర్తించే సర్దుకుంటోంది

కానీ కేంద్రంలో బీజేపీ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు అంటున్నారు. విశాఖకు వచ్చి పవన్ కళ్యాణ్ణి రప్పించుకుని ఆయనకు రోడ్ మ్యాప్ ఇచ్చిన మోడీ చంద్రబాబుని కూడా వదలడంలేదు. ఆయనకు వరసబెట్టి ఆహ్వానాలు పంపుతున్నారు. ఆయనతో నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఆయన చెప్పినది వింటున్నారు. ఇలా బాబుతో కూడా సానుకూలంగా ఉన్నట్లుగా మోడీ వ్యవహరిస్తున్నారు.

దీన్ని చూసిన వైసీపీలో కొత్త చర్చ సాగుతోంది. 2024 ఎన్నికల వేళ కేంద్రం తీరు ఎలా ఉంటుందో అన్న కలవరం కూడా ఉంది. ఏపీలో వైసీపీ నేతల మీద కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు అలాగే వైఎస్ షర్మిలతో మోడీ ఫోన్ లో మాట్లాడడం ఇవన్నీ చూసుకున్నపుడు వైసీపీని చాన్స్ దొరికితే దెబ్బ తీయడానికి కేంద్ర బీజేపీ పెద్దలు ఎక్కడా ఆగరని అంటున్నారు. కానీ వైసీపీ ఈ టైం లో చేసేది కూడా ఏమీ లేదు అని అంటున్నారు.

ఇంత దూరం వచ్చి ఇపుడు మోడీని డైరెక్ట్ గా ఎదిరిస్తే అది 2019 ఎన్నికల ముందు చంద్రబాబు పరిస్థితి ఉంటుంది అంటున్నారు. ఇపుడు కేసీయార్ కూడా ఇలాగే ఇబ్బంది పడుతున్నారు అని కూడా గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మరోసారి గెలవడానికి జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు. ఆ విషయాన్ని వైసీపీ మంత్రి సీదరి అప్పలరాజు కూడా ఈ మధ్య లీక్ చేశారు. అయితే ఢిల్లీ వెళ్ళినపుడు మోడీ ముందస్తు ఎన్నికల విషయం వద్దు అని చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. మరి అది ఎలా వచ్చిందో తెలియదు కానీ అదే నిజమని అంటున్నారు.

ఒకవేళ అది కేవలం ఉత్త ప్రచారం అనుకున్నా కేంద్ర పెద్దలకు ముందస్తు ఎన్నికలు అన్నవి తెలంగాణాలోనూ ఏపీలోనూ ఇష్టం ఉండవని అంటున్నారు. తమకు వీలైనత టైం ఉంటే తాము మరింతగా బలపడేందుకు ఆస్కారం ఉంటుంది అన్నది ఆ పార్టీ పెద్దల వ్యూహం. అందుకోసం వారు ముందస్తు అని ఎవరు అన్నా కూడా దాన్ని కానివ్వకుండానే చూస్తారు. కేంద్రం అభిప్రాయం తీసుకోకుండా ఎన్నికల సంఘం ముందస్తు అని అసెంబ్లీలు రద్దు చేసిన చోట్ల ఎన్నికలు ఎటూ పెట్టదు, అందువల్ల అది వీలు కాదనే అంటున్నారు.

మరి ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఏపీలో వైసీపీకి మరోసారి బొటాబొటీతో అయినా అధికారంలోకి వచ్చే చాన్స్ ఉంటుంది అని అంటున్నారు. అలా కాని నాడు షెడ్యూల్ ప్రకారం 2024లో ఎన్నికలు జరిగితే బాగా ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. దానికి ముఖ్య కారణం ఆర్ధిక ఇబ్బందులు, అప్పులు, ఇపుడు ఇస్తున్న సంక్షేమ పధకాలు ఏ మాత్రం ఆగినా మొత్తం జనాగ్రహం కట్టలు తెంచుకుని అసలుకే ఎసరు వస్తుంది. అలాగే విపక్షాలు మరింతగా జనాల్లోకి తిరిగి బలపడినా పొత్తులు కుదిరినా కూడినా కూడా వైసీపీకి 2024 ఎన్నికలు అగ్ని పరీక్షగా మారుతాయని అంటున్నారు.

మొత్తానికి చూసుకుంటే మాత్రం కేంద్రంలోని మోడీ తో సఖ్యతగా ఉండి 2018 లో ముందస్తు ఎన్నికలు తెచ్చుకుని కేసీయార్ గెలిచారు. అదే చాన్స్ జగన్ కి మాత్రం మోడీ ఇవ్వరని అంటున్నారు. అలా అనుకుంటే ఎంత విధేయతగా ఉంటున్నా కేంద్రంలోని మోడీ వైసీపీకి జగన్ కి చేసే స్పెషల్ హెల్ప్ ఏంటి అన్న చర్చ అయితే వస్తోంది. ఇంతకీ మోడీ అండగా ఉంటున్నారా లేక అదను చూసి బండ వేయడానికి చూస్తున్నారా అన్నది వైసీపీ పెద్దలకే అర్ధం కావడంలేదుట.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.