Begin typing your search above and press return to search.

సీనియర్ ఎన్టీయార్ విగ్రహం... జూనియర్ ఎన్టీయార్ నిగ్రహం

By:  Tupaki Desk   |   29 May 2023 7:00 AM GMT
సీనియర్ ఎన్టీయార్ విగ్రహం... జూనియర్ ఎన్టీయార్ నిగ్రహం
X
తెలుగుదేశం పార్టీ అన్న గారిని చాలా గొప్పగా కీర్తిస్తోంది. ఆ రోజున ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడిచిన వారే ఈ రోజు టీడీపీలో అత్యధికులు ఉన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి ఒకరిద్దరు నేతలు తప్ప అంతా బాబు వైపే నాడు ఉన్నారు. ఎన్టీయార్ దివంగతులై విగ్రహంగా మారేంత వరకూ బాబు తెలుగుదేశం నాయకులు ఆయనను పెద్దగా కీర్తించినది లేదు.

ఇదిలా ఉంటే 1995 సెప్టెంబర్ 1న ఎన్టీయార్ నుంచి అధికారం లాక్కుని సీఎం అయిన చంద్రబాబు నాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతూ తనను వెన్నుపోటుదారుడు అని ఎన్టీయార్ అనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను పార్టీని రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే పోరాటం చేశాను అని చెప్పుకున్నారు. 1995 సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి 1996 జనవరి 18 తేదీ దాకా చూసుకుంటే చంద్రబాబు వివిధ ఆంగ్ల పత్రికలకు, మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఎన్టీయార్ విధానాలను విమర్శిస్తూనే వచ్చారు.

అదే విధంగా ఎన్టీయార్ కూడా ఆనాడు ఉన్న కొన్ని టీవీ చానళ్ళు, ప్రింట్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆ వ్యక్తి పేరు నా నోటితో ఉచ్చరించను అంటూ బాబు మీద తీవ్ర ఆగ్రహం ప్రదర్శించారు. ఇక ఎన్టీయార్ మరణించాక మరో రెండు మూడేళ్ళ పాటు అంటే 1999 ఎన్నికల దాకా చంద్రబాబు అండ్ కో ఎన్టీయార్ పేరు పెద్దగా ప్రచారంలోకి పెట్టలేదు. ఆయనను పక్కన పెట్టి చంద్రబాబు ఇమేజ్ తోనే ముందుకు సాగాలనుకుంది.

అయితే 1999 ఎన్నికల వేళకు ఎన్టీయార్ కుమారుడు నందమూరి హరిక్రిష్ణ అన్న తెలుగుదేశం పార్టీ పెట్టి జనంలోకి వెళ్లారు. దాంతో ఎన్టీయార్ ని తమ వైపే ఉంచుకోవాలని బాబు టీడీపీ భావించడంతో ఆ మీదటనే ఆయన పేరు టీడీపీలో పూర్తి స్థాయిలో మారుమోగింది. ఇక హరిక్రిష్ణ అన్న తెలుగుదేశం ఫెయిల్ కావడం, దానికి ముందు లక్షీపార్వతి నాయకత్వాన ఎన్టీయార్ టీడీపీకి జనాదరణ లేకపోవడంతో జనాలలో ఎన్టీయార్ వారసుడు అంటే చంద్రబాబు అన్న భావన ఏర్పడింది అని భావించి చంద్రబాబు అండ్ కో నాటి నుంచే ఆయన జయంతిని మరింత గొప్పగా చేయడం ఆరంభించారు.

ఇదిలా ఉంటే మహానాడుని ఎన్టీయార్ పుట్టిన రోజున చేయాలా అని కూడా ఒక దశలో బాబు నాయకత్వంలోని టీడీపీ ఆలోచించిందని కూడా అప్పట్లో ప్రచారం సాగింది. టీడీపీ నిజానికి పుట్టింది మార్చి 29. దాంతో ఆ రోజునే టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం జరపాలని ఆలోచించారు. అయితే అది అమలు జరగలేదు. ఆ మధ్యలో హరిక్రిష్ణ కూడా అన్న గారి వారసత్వం కోసం తానుగా కొంత పోటీ పడడం, మహానాడు అంటే మే 27, 28 తేదీలలో అన్న భావన పార్టీ క్యాడర్ లో బలంగా నాటుకుపోవడంతోనే ఆ ఆనవాయితీ అలాగే కొనసాగిస్తున్నారు.

ఇక 2009 నుంచి పూర్తి స్థాయిలో ఎన్టీయార్ ని టీడీపీని ముందు పెట్టి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అయితే పార్టీ అధికారంలో ఉన్నప్పటి కంటే కూడా ప్రతిపక్షంలో ఉన్నపుడే ఎన్టీయార్ కీర్తనలు ఎక్కువగా వినిపిస్తాయని విమర్శలు ఉన్నాయి. ఎన్టీయార్ కి భారతరత్న ఇవ్వాలన్న మహానాడు తీర్మానాలకు పాతికేళ్ళు వచ్చేశాయి. అది ఎందుకో సాకారం కాలేదు. ఆ విషయంలో చంద్రబాబు మీదనే అందరి చూపూ ఉంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఎన్టీయార్ శత జయంతి వేడుకల వేళ నటుడు ఆర్ నారాయణమూర్తి బాబు అధికారంలో ఉన్న సమయంలో ఎక్కువగా కృషి చేసి ఉంటే భారతరత్న ఎన్టీయార్ కి వచ్చేదని ఆయన సమక్షంలోనే కుండబద్ధలు కొట్టారు.

ఏది ఏమైనా ఎన్టీయార్ మరణించి 27 ఏళ్లు పూర్తి అయింది. ఆయన విగ్రహంలో ఉన్నారు. ఆ విగ్రహానికి రాగద్వేషాలు లేవు. విగ్రహం కాబట్టి ఎవరు పూజించినా ఏమీ అనేది లేదు. ఇక ఆయన మనవడు జూనియర్ ఎన్టీయార్ ఉన్నారు. ఆయనతోనే ఇపుడు బాబు టీడీపీకి తంటా వస్తోందా అన్న చర్చ సాగుతోంది. జూనియర్ కి అపారమైన మాస్ ఇమేజ్ ఉంది. సీనియర్ ఎన్టీయార్ కి అసలు సిసలు వారసుడు ఆయనే అని అంతా ఒప్పుకుంటారు.

ఆ రూపు వాచకం, ఆ భాష మీద పట్టు, ధాటీగా మాట్లాడే తీరు జనాలను ఆకట్టుకునే నేర్పు ఇవన్నీ జూనియర్ కి తాత నుంచి అబ్బినవి. అందుకే ఆయన మూడవ తరంలో పోటీగా వస్తారన్న భయాలు ఉన్నట్లున్నాయి. దాంతో దూరం గానే ఆయన్ని పెడుతున్నారని టాక్ ఉంది. జూనియర్ సైతం ఎందుకొచ్చిన గొడవ అని నిగ్రహంగా ఉంటుంది. ఇక మహానాడులో చంద్రబాబు లోకేష్ ఉన్నా తెలుగుదేశం పార్టీ అంతా అక్కడే ఉన్నా కూడా అన్న గారి జయంతి వేళ ఎన్టీయార్ ఘాట్ కి వచ్చిన జూనియర్ కి అభిమానుల నుంచి జేజేలు లభించాయి. సీఎం జూనియర్ కావాలి అంటూ వారు నినదిస్తూనే ఉన్నారు.

జూనియర్ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. ఆయన వయసు నాలుగు పదులు మాత్రమే. సినీ రంగంలో ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఇక నందమూరి వంశంలో మూడవ తరంలో రాజకీయంగా రాణించేది జూనియర్ మాత్రమే అని అంతా అంటారు. ఈ రోజున టీడీపీలో ఆయన ఉన్నా లేకపోయినా కాలం కలసి వచ్చినపుడు ఆయన చుట్టూనే తెలుగు రాజకీయం తిరగకతప్పదని అంతా అంటారు. మొత్తానికి ఎన్టీయార్ విగ్రహం, జూనియర్ నిగ్రహం ల మధ్య ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఏ ఇబ్బందులు లేకుండా సజావుగానే ముందుకు సాగుతోంది అని చెప్పాలి.