టెస్టుల్లో ఇంగ్లండ్ ఈ దూకుడు పేరు 'బజ్ బాల్'

Wed Jul 06 2022 12:12:13 GMT+0530 (IST)

England's aggressive name in Tests is 'buzz ball'.

277 299  296.. ఇప్పుడు 378.. అలవోకగా కొట్టేస్తోంది.. టెస్టును.. కనీసం వన్డేలా కూడా కాదు.. టి20లా ఆడేస్తోంది.. తొలి ఇన్నింగ్స్ లో వెనుకబడినా.. రెండో ఇన్నింగ్స్ (నాలుగో ఇన్నింగ్స్) లో దంచికొడుతోంది ఇంగ్లండ్. అది కూడా అలా ఇలా కాదు.. ఓవర్ కు దాదాపు 5 రన్ రేట్ తో పరుగులు సాధిస్తోంది. ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది. ప్రస్తుతం భారత్ తో జరుగుతున్న ఐదో టెస్టు లో 378 పరుగుల టార్గెట్ ను అందుకుంది. సరిగ్గా ఈ ఏడాది ప్రారంభంలో చూసిన ఇంగ్లండ్ కు ఇప్పటి ఇంగ్లండ్ కు పూర్తి తేడా ఉంది. ఎందుకిలా..? ఇంత మార్పు ఎలా సాధ్యమైంది..? దీనంతటి వెనుక ఏమైనా శక్తి ఉందా? అంటే ఔననే చెప్పాలి.యాషెస్ లో చిత్తయి..2021-22 యాషెస్ లో ఇంగ్లండ్ కు పీడకలే మిగిలింది. బ్యాటింగ్ లో దారుణ ప్రదర్శన బౌలింగ్ లో పస లేదు. దీంతో 4-0తో యాషెస్ ను కోల్పోయింది. ఆ వెంటనే వెస్టిండీస్ కు వెళ్లింది. నాలుగు టెస్టుల సిరీస్ ను 2-0తో కోల్పోయింది. అంతే.. ఇక ఇంగ్లండ్ పనైపోయింది అనుకున్నారు. కానీ అతడొచ్చాడు రాతమార్చాడు. అందుకే ఇప్పుడు 400 టార్గెట్ నైనా ఐదో రోజైనా కొట్టేస్తోంది ఇంగ్లండ్.

అతడొచ్చాడు.. ఇంతకీ ఎవరతడు..?2015 వరకు వన్డేలను టెస్టుల్లా సాగదీసి ఆడిన ఇంగ్లండ్ నాడు 2015 ప్రపంచ కప్ లో దారుణ ప్రదర్శన తర్వాత అనూహ్య రీతిలో పుంజుకొంది. వన్డేల్లో 400 పైగా పరుగులు చేస్తూ అదరహో అనిపించింది. ఇక 2019 ప్రపంచ కప్ ను అద్భుత ఆటతీరుతో చేజిక్కించుకుంది.

వన్డేల్లో అంతలా ఇంగ్లండ్ ట్రాన్స్ ఫార్మేషన్ కు కారణం దూకుడైన ఆటగాళ్లకు పెద్దపీట వేయడమే. ఇక ఇయాన్ మోర్గాన్ నాయకత్వం వారికి మరింత అందివచ్చింది. అలాగే.. ఇప్పుడు టెస్టుల్లోనూ దూకుడుగా ఆడుతోంది ఇంగ్లిష్ జట్టు. దీనికి కారణం బ్రెండన్ మెక్ కల్లమ్.

వారు ప్రస్తుతం ఆడుతున్న ఆటకు పెట్టిన పేరు "బజ్ బాల్" లేదా "బాజ్  బాల్".ఏమిటీ బాజ్ బాల్?న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ అయిన మెక్ కల్లమ్ ఎంతటి దూకుడైన ఆటగాడో మనందరికీ తెలిసిందే. న్యూజిలాండ్ కు ఆడిన సందర్భాల్లో అతడి ధాటిని తట్టుకోవడం ప్రపంచ జట్లకు పెద్ద తలనొప్పి అయ్యేది. స్టయిలిష్ దూకుడైన మెక్ కల్లమ్ ఈ ఏడాది మేలో ఇంగ్లండ్ టెస్టు టీమ్ ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టాడు. దీంతోనే ఆ జట్టు రూపురేఖలు మారిపోయాయి. అదే సమయంలో యాషెస్ పరాభవంతో డీలాపడిన ఇంగ్లడ్ కు జవజీవాలు కల్పించాడు. రూట్ కెప్టెన్ గా తప్పుకోవడంతో బెన్ స్టోక్స్ కు కెప్టెన్సీ దక్కింది.

దూకుడైన స్టోక్స్ కు అదే తరహా మెక్ కల్లమ్ తోడవడంతో బజ్ బాల్ గేమ్ పురుడుపోసుకుంది. దీని ప్రకారం ఎలాంటి భయం లేకుండా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతూ ఆడాలి. అలాగే.. ఇప్పుడు ఇంగ్లండ్ విజయ పథంలో నడుస్తోంది. ఇంతకూ "బజ్" అంటే.. మెక్ కల్లమ్ కు న్యూజిలాండ్ జట్టు సభ్యులు పెట్టుకున్న ముద్దు పేరు. ఆ పేరు మీదనే ఇప్పుడు బాజ్ బాల్ గేమ్ వచ్చింది. ఇంగ్లండ్ ను విజేతగా నిలుపుతోంది. అయితే న్యూజిలాండ్ తో నాలుగు టెస్టులు భారత్ తో ఒక టెస్టు అన్నీ ఇంగ్లండ్ సొంతగడ్డపై ఆడినవే. ఇదే దూకుడును విదేశాల్లోనూ చూపగలిగితేనే వారి బజ్ బాల్ గేమ్ ప్లాన్ విజయవంతం అయినట్లు.