Begin typing your search above and press return to search.

టీడీపీ మ్యానిఫేస్టో ఢిల్లీ సెట్ మాదిరిగా ఉందా...?

By:  Tupaki Desk   |   30 May 2023 3:00 PM GMT
టీడీపీ మ్యానిఫేస్టో ఢిల్లీ సెట్ మాదిరిగా ఉందా...?
X
తెలుగుదేశం పార్టీ ఎంతో ఊరించి రిలీజ్ చేసిన మొదటి విడత మ్యానిఫేస్టో ఇపుడు చూస్తే పెద్దగా కిక్ ఇవ్వలేదని అంటున్నారు. దానికి కారణం అందులో ఉన్న అన్ని అంశాలు అక్కడా ఇక్కడా ఏర్చి కూర్చి పెట్టినవే. పైగా ఉచిత హామీలు అంటేనే విరక్తి కలిగేలా ఏపీలో రాజకీయ వాతావరణం ఉన్న వేళ తెలుగుదేశం కొత్త సీసాలో పాత సారా మాదిరిగా ఇదిగో హామీలు కుమ్మరించాం అంటూ జనాలను మెస్మరైజ్ చేయాలనుకుని బొక్క బోర్లాపడింది అంటున్నారు.

ఇక ఎంతో శోధించి సాధించామని మేధావులను పెట్టి మరీ నెలల తరబడి బుర్రలు బద్ధలు కొట్టుకుని మరీ మ్యానిఫేస్టో తయారు చేశామని తెలుగుదేశం ఎంత చెప్పుకునా అది రీమేక్ సినిమా మాదిరిగా పాత వాసనలు కొడుతోంది అని అంటున్నారు. దేశంలోనూ ఏపీలోనూ అమలవుతున్న అనేక సక్సెస్ ఫుల్ పధకాలను ఏర్చి కూర్చి ఇదే మా మ్యానిఫేస్టో అని ఆడంబరంగా తెలుగుదేశం రిలీజ్ చేసింది.

దాంతో ఈ మ్యానిఫేస్టోను చూసిన వారు అంతా అతుకుల బొంతలా ఉందని, ఢిల్లీ సెట్ మాదిరిగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఢిల్లీ సెట్ అంటే ఆ పార్టూ ఈ పార్టూ అందులో ఇందులో తెచ్చి అసెంబ్లింగ్ చేయడం అన్న మాట. అంటే అందులో పార్టీలు ఏవీ ఒరిజినల్ కావు, అలా అతికించి చేసే మ్యాజిక్ మాదిరిగానే టీడీపీ ఎన్నికల మ్యానిఫేస్టో ఉందని అంటున్నారు.

దీని మీదనే ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మ్యానిఫేస్టో అంటే ఒక నిబద్ధత చిత్తశుద్ధి ఉండాలని, పైగా పార్టీకి ఆత్మ లాంటి విధానాలు కొన్ని ఉంటాయని వాటికి సరిపోలి ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలని అంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్నా కూడా విధానాల పరంగా చూస్తే గాలివాటాన్నే నమ్ముకుందా అన్న చర్చ అయితే సాగుతోంది.

దక్షిణాదిన ప్రాంతీయ పార్టీలలో సీనియర్ అయిన డీఎంకేకి ఒక విధానం ఉంది. హిందీ వ్యతిరేకత. ద్రవిడ భావజాలం వ్యాప్తి, ప్రాంతీయ పిడి వాదం ఇలా చాలా ఆ పార్టీకి ఆత్మగా ఉన్నాయి. తెలుగుదేశం పెట్టినపుడు కూడా దానికి చాలా ఆశయాలను ముందు పెట్టారు. చంద్రబాబు చేతిలోకి టీడీపీ వెళ్లాక ఆయన అవకాశాన్ని బట్టి సంక్షేమం అంటారు, మరో సందర్భంలో విజన్ అంటారు. అభివృద్ధి ముఖ్యమని అంటారు.

ఇలా డోలాయమానంలో ఒక సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న పార్టీ ఉండడం వల్లనే ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు. ఆరు నూరు అయినా మా విధానం ఇదే అని చాటి చెప్పాల్సిన చోట చతికిల పడడం, డీలా పడడం అన్నది తెలుగుదేశం మ్యానిఫేస్టోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అంటూ ఇచ్చిన హామీలో డొల్లతనం ఉంది. ఇది కూడా వేరే చోట్ల అమలు చేస్తున్నదే. అయితే అది ఎలా అమలవుతుందో కూడా స్తడీ చేశారా అన్న చర్చ వస్తోంది.

ఆర్టీసీ నష్టాలలో కష్టాల్లో ఉన్న వేళ ఇలాంటి హామీలు తగునా అన్నది కూడా మేధావుల మాటగా ఉంది. అసలు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలన్నది టీడీపీ అధికారంలో ఉన్నపుడు విధానంగా ఉంది. ఇపుడు వైసీపీ దాన్ని ప్రభుత్వ రంగంలో ఉంచింది. మరి టీడీపీ ఆర్టీసీ మీద తన అలోచనలు ఏంటో చెప్పలేదు. ఈలోగా హామీలు కురిపిస్తోంది.

ఇలాంటివే మరికొన్ని ఉన్నాయి. అమ్మ ఒడి స్కీం విషయం కూడా అలాగే ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేరేందుకు ప్రోత్సహించేందుకు ఈ పధకం పెడితే బాగుంటుంది అని అంటున్నా జగన్ మాత్రం ప్రైవేట్ స్కూళ్లకు వర్తింపచేశారు ఇపుడు తల్లికి వందనం అంటూ టీడీపీ కూడా అదే రూట్లో వెళ్లడమే కాదు కాపీ కొడుతోంది అని అంటున్నారు.

రైతులకు ఏ ప్రభుత్వం వచ్చినా హామీలు తప్ప మేలు జరగడంలేదు ఇపుడు వారికి ఇరవై వేలు ఏడాదికి ఇస్తామని చెప్పే హామీ మభ్యపెట్టడమే అంటున్నారు. యూత్ కి నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి ఒకసారి ఫెయిల్ అయిన టీడీపీ మళ్లీ దాన్ని భుజానికి ఎత్తుకుంది అంటే హామీల విషయంలో లైట్ తీసుకుంటున్నారా లేక ఎన్నికలలో గెలుపే టార్గెట్ గా ఏమైనా చేస్తామని చెప్పదలచారా అన్నదే చర్చగా ఉంది. మనది వెల్ఫేర్ స్టేట్ అని రాజ్యాంగం లో రాసుకున్నామని బరితెగించి హామీలు కుమ్మరిస్తే చివరికి తీపి కూడా చేదు చేటు అవుతుందని చంద్రబాబు వంటి అనుభవశాలి గుర్తించకపోవడమే దారుణం అంటున్నారు.