కేంద్రం పట్టించుకుంటుందా ?

Fri Oct 22 2021 22:00:01 GMT+0530 (IST)

Chandrababu was on a tour of Delhi because center Did not care

ఏపీలో అర్జంటుగా రాష్ట్రపతి పాలన పెట్టాలని చంద్రబాబునాయుడు పదే పదే డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ కు కారణం ఏమిటయ్యా అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతినేశాయట. దీనికి ఉదాహరణగా తమ పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు చేసిన దాడులను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఒకపార్టీ కార్యాలయాలపై మరోపార్టీ శ్రేణులు దాడులు చేస్తే లా అండ్ ఆర్డర్ కు ఏ విధంగా విఘాతం కలిగినట్లు ? అన్నదే ఎవరికీ అర్ధం కావటంలేదు.అసలు వైసీపీ నేతలు టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయటానికి కారణమే టీడీపీ నేత పట్టాభి అన్న విషయం అందరికీ తెలిసిందే. దాడులు చేయటం తప్పయితే జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని నోటికొచ్చినట్లు పట్టాభి తిట్టడమూ తప్పే. అయితే చంద్రబాబు మాత్రం పట్టాభిని సమర్ధిస్తు వైసీపీ దాడులను మాత్రమే తప్పుపడుతున్నారు. మరి ఇంతోటి దానికే కేంద్రం జోక్యం చేసేసుకుని ఏపిలో రాష్ట్రపతి పాలన పెట్టేస్తుందా ? ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెడుతుంది కేంద్రం ?

ఎప్పుడంటే సదరు రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నపుడు. శాంతి భద్రతలంటే సామాన్య ప్రజలు స్వేచ్చగా బతికే అవకాశాలు లేనపుడని మాత్రమే అర్ధం. అన్నీ రకాల క్రైం రేటు బాగా పెరిగిపోయి మామూలు జనాలు ప్రశాంత జీవనానికి ఇబ్బందులు పడుతుంటే అప్పుడు కేంద్రం జోక్యం చేసుకుంటుంది. అదికూడా రాష్ట్ర గవర్నర్ ద్వారా నివేదికను తెప్పించుకున్న తర్వాత మాత్రమే ఆలోచిస్తుంది. ఇపుడు రాష్ట్రంలో అలాంటి వాతావరణం ఉందా అంటే ఎతమాత్రం లేదనే చెప్పాలి.

సమస్యంతా కేవలం టీడీపీ నేతలకు మాత్రమే వస్తోంది. టీడీపీ నేతలు మాత్రమే ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే జగన్ను నోటికొచ్చినట్లు తిడుతున్నవారు మాత్రమే కేసులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ చంద్రబాబు అండ్ కో వైఖరి ఎలాగుందంటే తాము జగన్ను ఎన్నైనా అనచ్చు కానీ ప్రభుత్వం మాత్రం తమపై ఎలాంటి కేసులు నమోదు చేయకూడదన్నట్లుగా ఉంది. విధానపరంగా ఆరోపణలు విమర్శలు చేయటం మానేసి వ్యక్తిగతంగా నోటికొచ్చినట్లు తిడుతున్నారు కాబట్టే ప్రభుత్వం కూడా కేసులు పెడుతోంది.

బంద్ ఫెయిలై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పట్టించుకోని కారణంగానే చంద్రబాబు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. తన 36 గంటల నిరసన దీక్ష పూర్తవ్వగానే ఢిల్లీకి వెళుతున్నారు. ఎందుకంటే రాష్ట్రపతి ప్రధానమంత్రి హోంశాఖ మంత్రిని కలిసి రాష్ట్రపతి పాలనను పెట్టించటానికి. మరి వీరిలో చంద్రబాబుకు ఎవరు అపాయిట్మెంట్ ఇస్తారో చూడాలి. ఎందుకంటే చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుండి మోడి షాలు ఏమాత్రం పట్టించుకోవటంలేదు. మరి ఢిల్లీ టూరు ఏమవుతుందో చూడాల్సిందే.