తెలంగాణ ఏపీని చంద్రబాబు కలిపేస్తాడట?

Fri Dec 02 2022 19:21:30 GMT+0530 (India Standard Time)

Chandrababu comments connect Telangana and AP

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ ఏపీలుగా విడిపోయింది. ఎవరి సంసారం వాళ్లు చేస్తున్నారు. ఎవరి పాలన వాళ్లు కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పటికీ తెలంగాణ టీఆర్ఎస్ నేతలు మాత్రం మళ్లీ ‘సమైక్య’ పాట పాడుతున్నారు. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మళ్లీ కలపడం అసాధ్యం. ఆ సోయి మరిచి టీఆర్ఎస్ నేతలు మళ్లీ సమైఖ్య భయాలను జనాల్లో కలిగించడమే విడ్డూరం.మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తాజాగా ఈ సంచలన కామెంట్స్ చేశారు. ఏడాదిగా కేసీఆర్ పై సమైక్య వాదులు కుట్ర చేస్తున్నారని.. పదవి నుంచి దించేయాలనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. రెండు రాష్ట్రాలను కలిపి మళ్లీ సమైక్య రాష్ట్రంగా చేయడానికి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని గుత్తా అంటున్నారు. కేసీఆర్ ను మానసికంగా దెబ్బకొట్టేందుకు వారు మూకుమ్మడి దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఏపీలో చేతకాక తెలంగాణలో ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ ను అడ్డు తొలగించుకోవాలని రాష్ట్రాన్ని మళ్లీ కబ్జా చేయడానికి వస్తున్నారని గుత్తా అన్నారు. బీజేపీ దత్త పుత్రిక షర్మిల పాదయాత్రల పేరుతో కేసీఆర్ ను అప్రతిష్ట పాలు చేస్తోందని విమర్శించారు. అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లడమే కాకుండా ఐఏఎస్ అధికారులను కూడా జైలుకు పంపిన చరిత్ర వారిదని మండలి చైర్మన్ చెప్పుకొచ్చారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే ముఖ్యమని ఆయన తెలిపారు.

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి దేశం మొత్తం పాలించాలనుకుంటున్న కేసీఆర్ టీఆర్ఎస్ కు ఇప్పుడు మళ్లీ ఆంధ్రా వాదం.. సమైక్యవాదం అనడం బూమరాంగ్ అయినట్టేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా అయితే ఏపీలో ఒక్క ఓటు కూడా పడదని.. ఇంకా ఈ విభజన రాజకీయాలను పట్టుకొని వేలాడడం ఎంత వరకూ కరెక్ట్ అని నిలదీస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా ఇవి మానుకోవాలని సూచించారు. 


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.