Begin typing your search above and press return to search.

ఛీ..పొమ్మన్న తర్వాత సస్పెన్షన్ వేటు వేసుడేంది బాబు?

By:  Tupaki Desk   |   15 Nov 2019 10:20 AM GMT
ఛీ..పొమ్మన్న తర్వాత సస్పెన్షన్ వేటు వేసుడేంది బాబు?
X
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వేసిన దెబ్బకు టీడీపీ విలవిలలాడిపోతోంది. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి.. సీఎం జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలవాలన్న విషయాన్ని ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పటం తెలిసిందే. ఓవైపు జగన్ సర్కారు ఇసుక కొరత కారణంగా పలువురు ఊసురు తీసిందని ఆరోపిస్తూ.. లక్షలాది జీవితాల్ని ప్రభావితం చేసిందంటూ అధినేత దీక్ష చేస్తున్న వేళ.. అందుకు భిన్నంగా సీఎం జగన్ పాలనా తీరు చాలాబాగుందన్న ప్రశంసలతో ముంచెత్తిన వల్లభనేని వంశీ తీరు హాట్ టాపిక్ గా మారింది.

విలేకరుల సమావేశం.. సాయంత్రం వేళ ఒక చానల్ లో డిబేట్ కు పాల్గొన్న వేళ టీడీపీ సీనియర్ నేతతో పాటు.. పార్టీ అధినేత చంద్రబాబు మీద విరుచుకుపడిన వంశీ తీరు తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలకు కారణమైంది. తాజాగా వంశీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు (శుక్రవారం) ఉదయం పార్టీ సీనియర్ నేతలతో సమావేశమైన చంద్రబాబు.. వంశీ వ్యాఖ్యలపై చర్చలు జరిపారు.

వంశీ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవన్న మాటను చెప్పటంతో పాటు.. ఆయన మాటల్ని తీవ్రంగా పరిగణించి ఆయన్ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లుగా నేతలకు తేల్చి చెప్పారు. అయితే.. బాబు నిర్ణయం సరైన సమయంలో సరిగా తీసుకోలేకపోయారంటున్నారు.

వంశీ పార్టీ మారటం ఖాయమైన వేళ.. వేటు వేయాల్సింది పోయి.. తినాల్సిన తిట్లు అన్ని తిన్న తర్వాత.. ఛీ కొట్టిన తర్వాత పార్టీ వేటు వేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు. పార్టీకి చేయాల్సిన నష్టాన్ని చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవటం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా వంశీ విషయంలో పార్టీకి కోలుకోలేనంత డ్యామేజ్ జరిగిందన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్లు తమ అంతర్గత సమావేశాల్లో ఒప్పుకోవటం కనిపిస్తోంది.