Begin typing your search above and press return to search.

బీసీలను ఆకట్టుకోవటం టీడీపీకి అంత ఈజీనా ?

By:  Tupaki Desk   |   20 Oct 2020 5:33 PM GMT
బీసీలను ఆకట్టుకోవటం టీడీపీకి అంత ఈజీనా ?
X
ఎన్టీయార్ ఏ ముహూర్తంలో పెట్టారో తెలీదు కానీ అప్పటి నుండి 2014 వరకు బీసీలు తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. టీడీపీ అంటే బీసీలు, బీసీలు అంటే టీడీపీ అన్నట్లుగా సాగింది ప్రయాణం. అయితే మొదటిసారిగా బీసీల్లో చీలిక వచ్చింది 2019 ఎన్నికల్లోనే. చంద్రబాబునాయుడు స్వయంకృతం వల్ల బీసీల్లో చీలిక వచ్చి వైసీపీకి ఓట్లేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సంఘాల్లోని నేతలతో చంద్రబాబు వ్యవహరించిన తీరు వల్ల చాలామంది టీడీపీతో విభేదించటంతో అనేక ఉపకులాల వాళ్ళు మొదటిసారి వైసీపీ వైపు మళ్ళారు.

టీడీపీని బీసీలు వదిలేసిన ఫలితం మిగిలిన సామాజికవర్గాల వాళ్ళలో మెజారిటి వైసీపీని ఓన్ చేసుకోవటంతో రిజల్టు ఎలాగ వచ్చిందో అందరికి తెలిసిందే. ఎన్నికల ముందు ఇటు చంద్రబాబు అటు జగన్మోహన్ రెడ్డి పోటీలు పడి బీసీ సామాజికవర్గానికి వరాలు గుప్పించారు. అయితే జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న బీసీలు మాత్రం జగన్ మాటనే నమ్మారు. బీసీల నమ్మకాన్ని నిలబెట్టేందుకు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారమే అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్ కూడా బీసీ సామాజికవర్గాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు.

ఇందులో భాగంగానే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. పనిలో పనిగా రెండు రోజుల క్రితమే 56 కార్పొరేషన్లకు ఛైర్మన్లతో పాటు పాలకవర్గాలను కూడా భర్తీ చేశారు. ఎన్నికల సమయంలో బీసీల కోసం తానిచ్చిన హామీలను ఒక్కొక్కటే అమలు చేస్తుండటంతో సహజంగానే వాళ్ళలో జగన్ పై నమ్మకం పెరుగుతోంది. ఎన్నికల సమయంలోనే రాయలసీమలోని ఎనిమిది ఎంపి స్ధానాల్లో మూడింటిని బీసీలకే కేటాయించింది వైసీపీ. ఇదే విధంగా ఎక్కడ అవకాశముంటే అక్కడల్లా బీసీలకే ఎంపి, ఎంఎల్ఏ సీట్లు ఇచ్చారు.

ఇటువంటి సమయంలో పార్టీకి దూరమైన బీసీ సామాజికవర్గాన్ని మళ్ళీ దగ్గరకు తీసుకోవాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలుగురాష్ట్రాలకు అధ్యక్షులుగా ఇద్దరినీ బీసీలనే నియమించారు. ఇక జాతీయ కార్యవర్గం, పాలిట్ బ్యూరోలో కూడా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే అధికారంలో ఉన్నపుడు సంఘాల నేతలను కసిరికొట్టి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత దగ్గరకు తీసుకుంటామంటే బీసీలు మళ్ళీ టీడీపీని ఆధరిస్తారా ? అన్నదే ప్రధాన ప్రశ్న. మరి చంద్రబాబు ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాల్సిందే.