Begin typing your search above and press return to search.

చంద్రబాబు నాయుడి అఖిలపక్ష డ్రామా..కామెడీ అయ్యింది!

By:  Tupaki Desk   |   6 Dec 2019 6:31 AM GMT
చంద్రబాబు నాయుడి అఖిలపక్ష డ్రామా..కామెడీ అయ్యింది!
X
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు అధికారంలో ఉన్నప్పుడు అఖిలపక్షాలు గుర్తుకురావు. అధికారం చేజారుతున్నప్పుడు, అధికారం చేజారాకా చంద్రబాబు నాయుడు అఖిలపక్ష సమావేశాలను డిమాండ్ చేస్తూ ఉంటారు. గత ఐదేళ్లలో చంద్రబాబునాయుడు ఎప్పుడూ అఖిలపక్ష సమావేశాలను నిర్వహించలేదు. కీలకమైన నిర్ణయాలను తీసుకుంటున్నప్పుడు కూడా ఎవ్వరినీ చంద్రబాబు నాయుడు స్పందించింది లేదు.

రాజధాని ఎక్కడనే విషయాన్ని నిర్ణయిస్తున్నప్పుడు కానీ, సింగపూర్ తో ఒప్పందాలు చేసుకుంటున్నప్పుడు కానీ.. చంద్రబాబు నాయుడు మరో పార్టీ ని సంప్రదించింది లేదు. తన నిర్ణయాలను వారికి తెలియ జేసి ముందుకు వెళ్లింది కూడా లేదు. తనకు తోచింది చేశారు. తనకు మించి ఎవరూ లేరని, రాష్ట్రంలో మరో పార్టీనే లేదన్నట్టుగా చంద్రబాబు నాయుడు అప్పుడు వ్యవహరించారు.

అందుకు చంద్రబాబు నాయుడు రాజకీయంగా ప్రతిఫలం పొందారు. అధికారం కోల్పోయారు. అయితే ప్రతిపక్షంలోకి వెళ్లాకా చంద్రబాబు నాయుడు అన్ని విషయాల్లోనూ అఖిలపక్ష సమావేశాలను డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే చంద్రబాబు డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

దీంతో చేసేది లేక చంద్రబాబు నాయుడే ఒక సమావేశాన్ని నిర్వహించారు. దానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్ప అందరినీ పిలిచారు. అయితే మిగతా పార్టీల నుంచి
స్పందన అంతంత మాత్రంగానే ఉంది. జనసేన, సీపీఐలు తప్ప చెప్పుకోదగిన పార్టీలు హాజరు కాలేదు. బీజేపీ కూడా ఆ సమావేశాన్ని లైట్ తీసుకుంది.

ఇక జనసేన, సీపీఐలు హాజరైనా ఆ పార్టీలు తమకు తోచినట్టుగా మాట్లాడాయి. అమరావతిలో కుంభకోణం జరిగిఉంటే.. విచారణ జరిపించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఇది చంద్రబాబు నాయుడుకు మింగుడు పడే డిమాండ్ కాదు! ఎందుకంటే.. అమరావతి విషయంలో బోలెడన్ని ఆరోపణలున్నాయి. వాటిపై విచారణలు మొదలై ఇరకాటంలో పడేది టీడీపీనే!

ఇక జనసేన కూడా ఈ విషయంలో చంద్రబాబుతో తందానా అనలేదు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి తీసుకెళ్లాలని, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లను కూడా జగన్ ఢిల్లీకి తీసుకెళ్లాలని జనసేన డిమాండ్ చేసింది. జగన్ నాయకత్వంలో ఢిల్లికి వెళ్లడానికి చంద్రబాబు ఒప్పుకుంటారా? ఏతావాతా అఖిలపక్ష సమావేశం అంటూ చంద్రబాబు నాయుడు చేసిన హడావుడి అసలు కథ ఇది!