కెప్టెన్ బుమ్రా ప్రపంచ రికార్డు.. బంతితో కాదు బ్యాట్ తో.. యువరాజ్ ను గుర్తుతెచ్చేలా

Sat Jul 02 2022 18:00:01 GMT+0530 (India Standard Time)

Captain Bumrah World Record

ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్ లో బుమ్రా జట్టుకు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా 35ఏళ్ల తర్వాత ఓ పేసర్ టీమిండియా సారథ్యం చేస్తున్నాడు. 1987లో పేస్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ చివరిసారిగా కెప్టెన్ గా వ్యవహరించాడు.కాగా ఇంగ్లండ్ తో ప్రస్తుత మ్యాచ్ లో పేస్బౌలర్ అయిన బుమ్రా.. ఈ రికార్డు సాధించినది బంతితో కాదు.. బ్యాట్ తో కావడం విశేషం. ఈ మ్యాచ్ లో శుక్రవారం టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 416 పరుగులకు ఆలౌటైంది.అంతకుముందు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (104; 194 బంతుల్లో 13x4) సెంచరీ అందుకున్నాడు.

అయితే 338/7 ఓవర్నైట్ స్కోర్తో శనివారం రెండో రోజు షమి(0)తో కలిసి బ్యాటింగ్ ఆరంభించిన జడేజా 183 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో మూడంకెల స్కోర్ చేరాడు. షమి(16; 31 బంతుల్లో 3x4)తో కలిసి ఎనిమిదో వికెట్కు 48 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే.. స్టువర్ట్ బ్రాడ్ వేసిన 80వ ఓవర్ చివరి బంతికి షమి ఔటయ్యాడు. దీంతో టీమిండియా 371 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది.కాసేపటికే జడేజా అండర్సన్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. అప్పటికి జట్టు స్కోర్ 375/9గా నమోదైంది.బుమ్రా భలే భలే..

జడేజా ఔటయ్యేటప్పటికి 9 వికెట్లు పడిపోయాయి. దీంతో కెప్టెన్ బుమ్రా క్రీజులోకి వచ్చాడు. ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన 84వ ఓవర్లో చెలరేగిపోయాడు. రెండు సిక్సులు నాలుగు ఫోర్లతో 35 పరుగులు రాబట్టాడు. ఇందులో 29 పరుగులు బుమ్రా బ్యాట్ నుంచి వచ్చినవే. దీంతో మొత్తంగా చూసినా బ్యాట్స్ మన్ పరంగా చూసినా బుమ్రా టెస్టుల్లో ఒకే  ఓవర్లో అత్యధికపరుగులు సాధించిన బ్యాట్స్ మన్ గా నిలిచాడు.

ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రయాన్ లారా దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఆస్ట్రేలియా క్రికెటర్ జార్జిబెయిలీ (ఒకే ఓవర్లో 28 పరుగులు) పేరిట ఉంది. ఆ రికార్డును బుమ్రా చెరిపేశాడు. మొత్తమ్మీద బుమ్రా (31 నాటౌట్; 16 బంతుల్లో 4x4 2x6) అజేయంగా నిలిచాడు.యువరాజ్ ను గుర్తుకుతెస్తూ

ఇంగ్లండ్ పై 2007 టి20 ప్రపంచ కప్ లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో కొట్టిన 6 సిక్సులను ఎవరూ మర్చిపోలేరు. నాడు బౌలర్ స్టువర్ట్ బ్రాడ్. ఇప్పుడదే బౌలర్ బ్రాడ్ బౌలింగ్ లో బుమ్రా ఫోర్ (వైడ్) ఫోర్ (నోబ్) సిక్స్ ఫోర్ ఫోర్ ఫోర్ సిక్స్ సింగిల్ (4w-4nb-6-4-4-4-6-1)తో 35 పరుగులు సాధించాడు. దీంతో నాటి యువరాజ్ సింగ్ ను తలపించాడు. కాగా
టీమిండియా తరఫున ఇప్పటివరకు టెస్టుల్లో ఒకే ఓవర్లో చేసిన అత్యధిక పరుగులు 26. దీనిని 2017లో శ్రీలంకపై ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సాధించాడు.