సీఎం జగన్‌కు మరో సంకటం.. ఏం జరిగిందంటే..!

Tue Nov 29 2022 10:51:04 GMT+0530 (India Standard Time)

Another problem for CM Jagan.. What happened..!

రాష్ట్రంలో రాజకీయ  పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. రిజర్వేషన్ కల్పించలేదని గొడవ పడుతున్నవారు కనిపిస్తున్నారు. దీంతో అంతో ఇంతో సాహసం చేసి.. రిజర్వేషన్ కల్పిస్తే.. మరో వర్గం.. మాకు అన్యాయం చేస్తారా? అని సర్కారుపై నిప్పులు చెరుగుతున్న పరిస్థితి ఉంది.తాజాగా వాల్మీకి బోయ కులాలను ఎస్టీల్లో చేర్చేందుకు సీఎం జగన్ రెడీ అయ్యారు. వాస్తవానికి ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రతిపాదన.. అయితే దీనిపై గత చంద్రబాబు ప్రభుత్వం యథాలాపంగా.. కాపుల మాదిరిగానే కాలక్షేపం చేసింది. దీంతో ఈ వర్గాలు.. గత ఎన్నికల్లో టీడీపీకి దూరమయ్యాయి. బోయ వర్గానికి చెందిన కాల్వ శ్రీనివాసులు ఓడిపోవడానికి కూడా ఇదే కారణం.

అదేసమయంలో గిరిజన ప్రాంతాల్లో ఓటమికి కూడా ఈ తాత్సారమే కారణమని టీడీపీనే తేల్చింది. ఇక ఈ పరిణామాలను గ్రహించిన.. వైసీపీ ప్రభుత్వం.. వాల్మీకి బోయ కులాలను ఎస్టీలో చేర్చేందుకు రెడీ అయ్యారు.

దీనికి సంబంధించిన చేసిన బిల్లును రేపు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి.. కేంద్రానికి పంపించేందుకు రెడీ అయ్యారు. అయితే..ఈ విషయంలో ఇతర ఎస్టీ వర్గాలైన చెంచులు ఎరుకలు లంబాడా వర్గాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

వారికి ఇస్తే.. తమ రిజర్వేషన్లు తగ్గిపోతాయని గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించేందుకు.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చాయి.

అయితే దీనిపై అధికార పక్షమే కాదు.. ప్రతిపక్షాలు కూడా మాట్టాడే అవకాశం లేకుండా పోవడం గమనార్హం. ఎందుకంటే.. ఏం మాట్లాడితే ఏం కొంపలు మునుగుతాయో.. అనే బెంగ ఉంది. మొత్తానికి జగన్‌కు మరో సంకటం కనిపిస్తుండడం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.